డబ్బు, వారసత్వం శాసిస్తున్నాయి
రాజకీయాలపై జస్టిస్ చలమేశ్వర్
అహ్మదాబాద్: ధన బలం, వారసత్వ రాజకీయాలు.. రాజకీయ న్యాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో డబ్బు, రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తూ రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన రాజకీయ సమానత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జస్టిస్ పీడీ దేశాయ్ స్మారక ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
చట్టసభలో సభ్యుడయ్యే అర్హతను చివరకు ధనబలం నిర్ణయిస్తుందని, ఒకరు చట్ట సభలో సభ్యుడైతే.. అతని భార్య, పిల్లలు, మిగతా కుటుంబసభ్యులు ఆ స్థానం కోసం వరుసలో ఉంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ తప్పుపట్టారు. ‘రాజకీయ క్షేత్రంలో సమానత్వం, న్యాయం విషయానికొస్తే.. మనమింకా ప్రాథమిక దశలోనే ఉన్నాం. రాజ్యాల్ని, జ్యేష్ట పుత్రుడికి వారసత్వ హక్కు నిబంధనను రద్దు చేశాం. అయితే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించే విషయంలో ఎంతవరకూ రాజకీయ న్యాయం సాధించాం?’ అని జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు.