కౌశాంబి: వారసత్వ రాజకీయాలు, కులవాదానికే ప్రమాదం తప్ప దేశ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కులతత్వం, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు అనే మూడు అల్సర్లతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యాన్ని చుట్టుముట్టిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ మూడింటినీ తొలగించి వేసినందుకే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతోందని పేర్కొన్నారు.
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ యూకేలో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు బదులిచ్చారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ‘కౌశాంబి మహోత్సవ్’ను ప్రారంభించి, అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడిందనే ఒకే ఒక్క కారణంతో పార్లమెంట్ సమావేశాలను సవ్యంగా సాగనీయని కాంగ్రెస్‌ను దేశం క్షమించదని అమిత్ షా ఆరోపించారు.
ఎటువంటి కార్యకలాపాలు, చర్చ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలోని నిబంధనల ప్రకారమే రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని ఆయన చెప్పారు. ఒక్క రాహుల్ గాంధీయే కాదు, ఈ చట్టం కింద ఇప్పటి వరకు 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాలు రద్దయ్యాయన్నారు. చట్టానికి లోబడి నడుచుకుని, హైకోర్టులో అనర్హత వేటు నుంచి బయటపడాలని రాహుల్‌కు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోదీని 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment