Casteism
-
ప్రమాదం వారసత్వ రాజకీయాలకే.. ప్రజాస్వామ్యానికి కాదు!: అమిత్ షా
కౌశాంబి: వారసత్వ రాజకీయాలు, కులవాదానికే ప్రమాదం తప్ప దేశ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కులతత్వం, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు అనే మూడు అల్సర్లతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యాన్ని చుట్టుముట్టిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ మూడింటినీ తొలగించి వేసినందుకే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతోందని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ యూకేలో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు బదులిచ్చారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ‘కౌశాంబి మహోత్సవ్’ను ప్రారంభించి, అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడిందనే ఒకే ఒక్క కారణంతో పార్లమెంట్ సమావేశాలను సవ్యంగా సాగనీయని కాంగ్రెస్‌ను దేశం క్షమించదని అమిత్ షా ఆరోపించారు. ఎటువంటి కార్యకలాపాలు, చర్చ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలోని నిబంధనల ప్రకారమే రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని ఆయన చెప్పారు. ఒక్క రాహుల్ గాంధీయే కాదు, ఈ చట్టం కింద ఇప్పటి వరకు 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాలు రద్దయ్యాయన్నారు. చట్టానికి లోబడి నడుచుకుని, హైకోర్టులో అనర్హత వేటు నుంచి బయటపడాలని రాహుల్‌కు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోదీని 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
కుల సమాజమే కానీ...
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... దేశంలో మత అసహనం, హిందువుల్లో ఉన్మాదం పెరుగుతోందని; ప్రజాస్వామ్య సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయనీ బీజేపీ వ్యతిరేక పార్టీలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత అనే విషయాన్ని వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలి. హిందుత్వ సంస్థలు హిందువులను రెచ్చగొడుతున్నాయనీ, మైనారిటీలపై ముఖ్యంగా... ముస్లింలపై విద్వేషాన్ని, పగను ప్రోది చేస్తున్నాయని ఆ పార్టీల ఆరోపణ! వాస్తవంగా ఈ దేశంలో హిందువులు ఒక మత సమూహం కాదు. ఇది కులపరంగా విభజితమైన సమాజం. ఈ సమాజంలో అనాదిగా అసంఘటిత ఛాయలే దర్శనమిస్తున్నాయి. ఈ సమాజం నుండి రాజకీయంగా ఎదిగిన నాయకులందరూ కులపరమైన ఆలోచనా దృక్పథంతోనే ఉంటారు. అంతేకానీ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఇత్యాది విషయాలను అర్థం చేసుకునే స్థాయి వీరికి ఉండదు. అదే ఉంటే దేశ విభజన జరిగేది కాదు. కశ్మీర్ రావణ కాష్ఠం అయ్యేది కాదు. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమివేయడం జరిగేది కాదు. హిందువులందరూ ఒకే సమూహం అనే భావం ఉన్నట్లయితే ఈ ఘటనలన్నింటికీ ప్రతిచర్యలు వేరే విధంగా ఉండేవి. ఈ దేశంలో మైనారిటీల పట్ల లౌకికవాద పార్టీ నాయకులు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట మీద ఉండటంతో... కులాల వారీగా విభజితమైన హిందువుల్లో అసంతృప్తి, ఆవేదన పుట్టుకొచ్చి కొంత చైతన్యం అంకురించింది. దాన్ని హిందుత్వ రాజకీయ పార్టీ అయిన బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుని కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. (క్లిక్: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?) లౌకిక వాదులుగా చెప్పుకునేవారు ప్రధాని మోదీపై వ్యతిరేకత, ద్వేషాలను.. దేశంపై వ్యతిరేకతగా మార్చుకోవడం.. వారి విచిత్రమైన భావదాస్యపు ఆలోచనకు ప్రతీక! ప్రపంచంలో ఏ దేశంలోనూ మన దేశంలోని మైనార్టీలు అనుభవించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కనిపించవు. పాక్ వంటి చోట్ల దేశ విభజన తర్వాత హిందూ జనాభా తగ్గిపోతుంటే.. మనదేశంలో మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోవడం మైనారిటీలకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛకు సంకేతంగా చెప్పవచ్చు. (క్లిక్: ఆ హత్యను ఖండిస్తున్నాం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
కుల వివక్ష, వేధింపులకు గురయ్యా: నటి
గత కొద్ది రోజులుగా విద్యార్థిని, విద్యార్థులు తమ పాఠశాల, కళాశాలల్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, కుల వివక్ష గురించి బహిరంగంగా నోరు విప్పుతున్నారు. ఇటీవల చెన్నైలో ఓ కళాశాలకు చెందిన కామర్స్ ఉపాధ్యాయుడిపై సదరు పాఠశాల విద్యార్థులు కుల వివక్ష, లైంగిక వేధింపుల వంటి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిగతా స్కూళ్ల విద్యార్థులు సైతం తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో సినీ నటి, ‘96, మాస్టర్’ మూవీ ఫేం గౌరి కిషన్ కూడా తాను స్కూలింగ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కుల వివక్ష, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్‌కు గురయ్యానంటూ ట్విటర్ వేదికగా బుధవారం వరుస పోస్ట్స్ షేర్ చేశారు. ‘ప్రతి ఒక్కరికి చదువుతున్న రోజులు మధుర జ్ఞాపకాలుగా ఉంటాయని భావిస్తారు. కానీ అవే రోజులు కొందరికి భయం పుట్టించేవిగా ఉండటం నిజంగా బాధాకరం. నేను కూడా అలాంటి చెదు అనుభవాలను నా స్కూలింగ్‌లో చూశాను. ఇప్పుడు నాలాంటి అమ్మాయిలు వేల సంఖ్యల్లో ఉన్నారనే విషయం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. పాఠశాల అనేది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మైదానం కావాలి, కానీ వారి విలువలను కూల్చేసే స్థలం కాకుడదు’ అంటు ఆమె రాసుకొచ్చారు. అంతేగాక తను చదివిన ఆడయార్ హిందు సీనియర్ సెకండరీ స్కూల్ సంఘటనలను కూడా గుర్తు చేసుకున్నారు. ‘ఇటీవల వెలుగు చూసిన పీఎస్‌బీబీ స్కూల్ సంఘటన మాదిరిగా నేను చదివిన అడయార్ హిందూ సీనియర్ సెకండరీ పాఠశాలలో కూడా ఇలాంటి భయంకర సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. విద్యార్థులపై లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, కుల వివక్షత, వ్యక్తిత్వాన్ని కించపరడం, నిరాధారమైన ఆరోపణలు వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల వారి ఆత్మగౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వేధింపులన్నిటిని కూడా నేను అడయార్ పాఠశాలలో స్వయంగా చూశాను, ఎదుర్కొన్నాను. అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే దీనికి కారణమైన ఉపాధ్యాయుల పేర్లను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇలాంటివి ధైర్యంగా బహిర్గతం చేయడం ద్వారా మున్ముందు పాఠశాలల సంస్కృతిలో మార్పు తీసుకువస్తాయనే ఆశిస్తున్నా. ఎందుకంటే బాల్యంలో ఇలాంటి సంఘటనలు నరకంగా ఉంటాయి. అవి గుర్తుకు వస్తనే గుండెల్లో వణుకుపుడుతుంది’ అంటు ఆమె భావోద్వేగంతో చేదు జ్ఞాపకాలను పంచుకుంది. This is with respect to the issues being brought to light in school environments which seem highly toxic and problematic! It needs to change, NOW. Please read the thread. #SpeakUpAgainstHarrasment #HinduSchoolAdyar #PSBB @Chinmayi pic.twitter.com/QXsV784x6P — Gouri G Kishan (@Gourayy) May 25, 2021 -
అది పోవాలంటే రాహుల్ పెళ్లి చేసుకోవాలి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కులతత్వం పోవాలంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ దళిత మహిళను పెళ్లి చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సలహా ఇచ్చారు. రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. రాహుల్ ఇచ్చిన నినాదం ‘హమ్ దో హమారే దో’ ఈ సందర్భంగా మంత్రి పార్లమెంట్లో వినిపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అథవాలే తప్పుపట్టారు. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ‘హమ్ దో హమారే దో’ అనే నినాదం గురించి ఆయన మాట్లాడుతున్నారని, నిజానికి ఈ నినాదం గతంలో కుటుంబ నియంత్రణ గురించి వాడేవారని గుర్తుచేశారు. అందుకే ముందుగా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆయన దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అప్పుడు ఆయన మహాత్మా గాంధీ కలలను నిజం చేసినవాడవుతాడని పేర్కొన్నారు. ఆయన పెళ్లితో కులపిచ్చికి అంతం పలకవచ్చు అని పేర్కొన్నారు. ఇలా చేస్తే దేశ యువతకు రాహుల్ మార్గనిర్దేశకుడు అవుతారని ఎద్దేవా చేశారు. గతంలోనూ మంత్రి అథవాలే రాహుల్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకుంటే, ఆయనకు కులాంతర వివాహం పథకం కింద రూ.2.5 లక్షలు ఇస్తానని తెలిపారు. -
అరాచకం, అస్థిరతలపై అసహనం
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దాలన్నీ యువతరానివేనని, వ్యవస్థపై వారికి అపారమైన నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవస్థలు సరిగా స్పందించకపోతే యువతలో ప్రశ్నించే ధోరణి కనిపిస్తోందని కొనియాడారు. ఆకాశవాణిలో ఆదివారం నాడు ఈ ఏడాది చివరి మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. అరాచకత్వం, అనిశ్చితి పరిస్థితుల్ని నేటి తరం ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. కులతత్వం, బంధుప్రీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్ట సవరణలకు, ప్రతిపాదిత ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇటీవల యూనివర్సిటీల్లో నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘నాకు తెలిసినంతవరకు నేటి తరం వ్యవస్థలపైనే నమ్మకం ఉంచింది. వాటిని అనుసరించాలనీ భావిస్తోంది. వ్యవస్థలు సరిగా స్పందించనప్పుడు వారిలో అసహనం పెరిగిపోతోంది. ధైర్యంగా ప్రశ్నించే తత్వం కూడా కనబడుతోంది’’అని మోదీ అన్నారు. దేశంలో యువత అరాచకం ఏ రూపంలో ఉన్నా సహించలేరని, పాలనా వైఫల్యాలను, అస్థిరతను తట్టుకోలేకపోతున్నారని అన్నారు. జాతి నిర్మాణంలో పాల్గొనాలి ధైర్యసాహసాలు, ఉత్తేజపూరిత స్వభావం కలిగిన యువతే మార్పుకి బాటలు వేస్తుందని స్వామి వివేకానంద మాటల్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుకు తెచ్చుకున్నారు. జనవరి 12 వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని యువత జాతి నిర్మాణంలో తమ వంతు బాధ్యతని తలకెత్తుకోవాలని, దేశ పురోగతికి కావల్సిన ఆలోచనలు చేయా లని పిలుపునిచ్చారు. దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లే సత్తా యువతకే ఉందన్నారు. దేశీయ ఉత్పత్తులకి ప్రాచుర్యం కల్పించాలి వచ్చే రెండు మూడేళ్లు దేశీయ ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2022లో భారత్ 75ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పూర్తి చేసుక్నుంతవరకు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని అన్నారు. భారత్‌లో భారతీయుల చేతులతో, వారి స్వేదాన్ని చిందించి తయారు చేసిన ఉత్పత్తుల్ని ఒక రెండేళ్లు వాడేలా యువతే ముందుకు రావాలని అన్నారు. -
చనిపోయిన విద్యార్థిని ఫోన్లో సూసైడ్ నోట్ ఫోటోలు
సాక్షి, ముంబై: సీనియర్ల ర్యాగింగ్‌తో మనస్తాపానికి గురై మే 22న ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని పాయల్ తద్వి రాసిన సూసైడ్ నోట్ ఫోటోలు ఆమె ఫోన్లో లభ్యమయ్యాయి. వివరాలు.. సెంట్రల్ ముంబైలోని బివైఎల్ ఆస్పత్రికి అనుబంధగా ఉన్న వైద్య కళాశాలలో ఎస్టి సామాజిక వర్గానికి చెందిన పాయల్ తద్వి(26) పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న సీనియర్లు హేమ అహుజా, అంకిత ఖండేల్వాల్, భక్తి మెహర్లు పాయల్‌ను కులం పేరుతో దూషిస్తూ ర్యాగింగ్ చేశారు. దీంతో పాయల్ సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి, ఆనోట్ను తన ఫోన్‌తో ఫోటోలను తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై అప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. అయితే సూసైడ్ నోట్ మాత్రం దొరకలేదు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారెవరో దాన్ని నాశనం చేసుంటారని ఈ కేసు వాదిస్తున్న లాయర్ తెలిపారు. తాజాగా ఆమె ఫోన్లో ఫోటోలు బయటికి రావడంతో పోలీసులు నిర్ధారణ కోసంవాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పరీక్షలో ఆ నోట్ పాయల్ రాసిందేనని తేలడంతో ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఈ కేసు వాదిస్తున్న లాయర్ కోరారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ మే 31 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకు ముందు రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ప్రత్యేక కోర్టు ద్వారా విచారిస్తున్న ఈ కేసులో, నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను జూన్ 24న కోర్టు కొట్టివేసింది. దాంతో వారు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో వాళ్లు బెయిల్ కావాలని కోరడంతో పాటు ఈ కేసులో మమ్మల్ని కావాలనే ఇరికించారని పేర్కొన్నారు. కాగా, తదుపరి విచారణను కోర్టు జులై 16కు వాయిదా వేసింది. -
కోర్టులో ఏడ్చేసిన మహిళా డాక్టర్లు
ముంబై: కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలి కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లకు ముంబై ప్రత్యేక కోర్టు జూన్ 10 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరేలను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితురాళ్లకు విధించిన పోలీస్ కస్టడీని పొడిగించాలని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాల్చింది. కోర్టు నిర్ణయంతో నిందితురాళ్లు కన్నీరు పెట్టుకున్నారు. బెయిల్ కోసం సోమవారం కోర్టులో వీరు పిటిషన్ వేయనున్నారు. కాగా, డాక్టర్ పాయల్ తాడ్వీ ఆత్మహత్య కేసులో నిందితురాళ్లపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని భక్తి మహెరే తల్లి అన్నారు. పాయల్ తాడ్వీపై ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు మహిళా డాక్టర్లు నిరపరాధులని, వీరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?) -
పాయల్ తాడ్వీ ఆత్మహత్య; ముగ్గురు అరెస్ట్
ముంబై: కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలి కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్ తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, ఐటీ యాక్ట్, సెక్షన్ 360 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసులు పెట్టారు. దర్యాప్తులో భాగంగా బుధవారం తెల్లవారుజామున అంకితా ఖండేల్వాల్ను అగ్రిపడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి హేమ అహుజాను, అదేరోజు సాయంత్రం భక్తి మహెరేను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుస్తు బెయిల్ కోసం వీరు ముగ్గురు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. పాయల్ తల్లిదండ్రులు మంగళవారం ఆమె పని చేస్తున్న ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. వీరికి దళిత, గిరిజన సంస్థలకు చెందిన కార్యకర్తలు మద్దతు పలికారు. పాయల్ ఆత్మహత్యకు కారణమైన ఆ ముగ్గురు డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగుల ముందే వారు తన ముఖం మీద ఫైళ్లను విసిరి కొట్టేవారని కూతురు తమకు చెప్పేదని ఆమె తల్లి వెల్లడించింది. దీంతో పలుమార్లు వారిపై ఫిర్యాదు చేయమని మేం చెప్పగా, అలా చేస్తే వారి కెరియర్ దెబ్బతింటుందంటూ ఊరుకునేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?) -
ఈ పాపం ఎవరిది?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న కుల వివక్ష, వేధింపుల పర్యవసానంగా దళిత యువ మేధావి రోహిత్ వేముల ఆత్మార్పణ చేసుకుని మూడేళ్లయింది. ఆ కేసు అతీ గతీ ఈనాటికీ తేలలేదు. ఆ విషాద ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్థిని డాక్టర్ పాయల్ తాడ్వీ గత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. విజ్ఞాన కేంద్రా లుగా విలసిల్లుతూ ఉన్నతస్థాయి నిపుణులను అందించాల్సిన మన విద్యా సంస్థలు కుల, మతాల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయని తరచుగా మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ విషయంలో తగినంత ప్రక్షాళన జరుగుతున్న జాడలు లేవు. ఇప్పుడు పాయల్ ఉదంతం దాన్నే ధ్రువపరుస్తోంది. అన్ని వృత్తులలోనూ వైద్య వృత్తి అత్యున్నతమైనదని చెబుతారు. సమాజంలో వైద్యులను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు. అలాంటి రంగంలో... అందునా విద్యార్థినుల్లో కుల, మత దురహంకారాలు ఇంతగా ఉంటాయని, అవి ఎదుటివారి ప్రాణాలు తీసేంత వికృత స్థాయికి చేరతాయని ఊహించడం కూడా సాధ్యం కాదు. డాక్టర్ పాయల్ నేపథ్యం గురించి విన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. పుట్టుకను బట్టి ఆమె భిల్లు తెగకు చెందిన ఆదివాసీ యువతి. ఆ రంగంలో అక్షరాస్యత శాతమే తక్కువ. పైగా ఉన్నత విద్య వరకూ వచ్చేవారి శాతం అత్యల్పం. ఆ తెగలో వైద్యరంగంలో పీజీ కోర్సుకు చేరుకున్న తొలి యువతి ఆమేనని సన్నిహితులు చెబుతున్నారు. చదువులో ఎంతో రాణిస్తూ, ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందుతూ, తన రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపనపడిన ఒక ఆదివాసీ యువతి కలలు చివరికిలా ఛిద్రంకావడం విషాదకరం. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు జరిగిన ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ బోర్డు సమా వేశంలో మాట్లాడుతూ ‘సబ్ కా సాత్, సబ్కా విశ్వాస్(అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం) అని పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు సమాజంలో కొరవడుతున్నది అదే. బడుగు కులాలవారు మంచి బట్టలు కట్టుకున్నా, వారు సౌకర్యవంతంగా జీవిస్తున్నా తట్టుకోలేని స్థితి ఇంకా కొనసాగు తోంది. పల్లెల్లో ఈ జాడ్యం బాహాటంగా కనిపిస్తుంటే నగరాల్లో ఇది ప్రచ్ఛన్నంగా చలామణిలో ఉంది. పాయల్‌తోపాటు రూంలో ఉంటున్న మరో ముగ్గురు యువతులు ఆధిపత్య కులాలకు చెందినవారని, వారు నిత్యం ఆమెను వేధించేవారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విష యమై కళాశాల నిర్వాహకులకు నిరుడు డిసెంబర్‌లోనూ, ఈ నెల మొదట్లోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని పాయల్ తల్లి చెబుతున్నారు. ఆదివాసీల్లో ఇతర తెగలతో పోలిస్తే భిల్లుల్లో ఇస్లాం మత విశ్వాసాలు అనుసరించేవారు అధికం. పాయల్ ఆదివాసీ కావడం, అందునా ముస్లిం కావడం ఆమె ఉసురు తీశాయని తల్లి చెబుతున్న మాట. ఎనిమిదేళ్లక్రితం ఢిల్లీలోని ఉన్నతశ్రేణి వైద్య సంస్థ ఎయిమ్స్‌లో అమలవుతున్న కుల వివక్షను యూజీసీ మాజీ చైర్మన్, విద్యావేత్త సుఖదేవ్ తొరాట్ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేసి అక్కడ దళిత, ఆదివాసీ విద్యార్థులకు ఇతర వర్గాల విద్యా ర్థులతో పోలిస్తే అధ్యాపకుల నుంచి పెద్దగా సహకారం అందదని నిర్ధారించారు. కులం తెలియ నంతవరకూ ఆత్మీయంగా ఉన్నవారే, తెలిసిన మరుక్షణం నుంచి వివక్ష ప్రదర్శిస్తారని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 84 శాతంమంది ఆ కమిటీకి చెప్పారు. పరీక్ష పత్రాలు దిద్దే అధ్యాపకులు ప్రత్య క్షంగానో, పరోక్షంగానో విద్యార్థుల కుల నేపథ్యాన్ని తెలుసుకుని ఉద్దేశపూర్వకంగా మార్కులు తగ్గి స్తారని కమిటీ తేల్చింది. భోజనం చేసేచోట, ఆటలాడుకునేచోట తమను అత్యంత హీనంగా చూస్తా రని ఆ వర్గాల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులకు దినదిన గండంగా మారిన ఈ ధోరణులను అరికట్ట డానికి యూజీసీ ఎన్నో చర్యలు సూచించింది. ఈ విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు విద్యా సంస్థలు తమ వెబ్సైట్లలో ప్రత్యేక ఏర్పాటు చేయడం దగ్గర నుంచి రిజిస్ట్రార్ లేదా ప్రిన్సిపాల్ కార్యాలయాల్లో ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు రెండు నెలల వ్యవధిలో వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్న నిబంధన పెట్టింది. అయితే విచారకరమైన విషయమేమంటే...దేశంలోని అత్యధిక విశ్వవిద్యాలయాలు యూజీసీ ఇచ్చిన ఈ మార్గదర్శకాలను సరిగా పట్టించుకోవడం లేదు. ఆ సంగతిని యూజీసీయే అంగీకరించింది. తాము మార్గదర్శకాలు పంపుతూ 800 విశ్వవిద్యాలయాలకు లేఖలు రాస్తే కేవలం 155 సంస్థలు మాత్రమే ప్రతిస్పందిం చాయని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో పాయల్ వంటివారు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కార మనుకోవడంలో వింతేముంది? తమకు నిత్యమూ వేధింపులు తప్పనప్పుడు, ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోనప్పుడు వారికి అంతకన్నా గత్యంతరం లేదు. ఆత్మహత్యలన్నీ వాస్తవానికి హత్యలేనంటారు. విద్యాసంస్థల వరకూ ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. సమాజం ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడాల్సిన ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు కుల, మతాల రొంపిలో కూరుకుపోతుండటం... బాధితుల గోడు అరణ్యరోదన కావడం ఆందోళన కలిగించే అంశం. ‘నా పుట్టుకే ఒక ప్రాణాంతక దుర్ఘటన’ అని ఎంతో ఆర్తితో, ఆవేదనతో రోహిత్ వేముల తన చిట్ట చివరి లేఖలో రాశాడు. పాయల్ సైతం అలా అనుకోకతప్పని దుస్థితి ఉన్నత విద్యాసంస్థల్లో ఇంకా రాజ్యమేలుతున్నదని తాజా ఉదంతం చెబుతోంది. ఆమె ఆత్మహత్య చేసు కున్న వారం రోజులకు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగలిగారు. అది కూడా దళిత సంఘాల ఆందోళన తర్వాత. ఈలోగా ఇద్దరు నిందితులు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్’ నెరవేరాలంటే, పాయల్ మాదిరి మరెవరూ బలికాకూడదనుకుంటే నిందితులకు వత్తాసుపలికే ధోరణిని ప్రభుత్వాలు విడనాడాలి. చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. సకల జాడ్యాల నుంచీ విద్యాసంస్థల్ని కాపాడుకోవాలి. -
దేశంలో ప్రమాదకరంగా కులతత్వం..
సాక్షి, జోధ్‌పూర్ : దేశంలో కులతత్వం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరెస్సెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగే కొనసాగితే దేశానికే ప్రమాదం అని, జాతీయత భావం దెబ్బతింటుందని పేర్కొంది. వెంటనే సామాజిక సామరస్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. కుటుంబ విలువలు-జాతీయ సామరస్యం వంటి అంశాలపై ఆరెస్సెస్ రెండు రోజులపాటు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అరుణ్ చతుర్వేది, గులాబ్ చంద్ కఠారియా, వాసుదేవ్ దేవ్నానాయ్, బీజేపీ నేతలు సతిష్ పునియా, అశోక్ పార్నమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కులవాదం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దేశానికి క్యాస్టిజం పెద్ద ప్రమాదంగా మారింది. గుజరాత్ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టమైంది. పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా దీనిని ఆరెస్సెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. సమాజంలో సామరస్యం పెంపొందించేందుకు కృషిచేయాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు. -
కులతత్వంపై మౌనం వద్దు
యువతకు రాహుల్ పిలుపు అంబేడ్కర్ జయంతి వేడుకలను ప్రారంభించిన కాంగ్రెస్ నేత మహూ(మధ్యప్రదేశ్): ‘కులతత్వాన్ని తుద ముట్టించాలన్న బాబాసాహెబ్ కల ఇంకా నెరవేరలేదు. కుల నిర్మూలన జరగాలన్న ఆయన కల ఇంకా నెరవేరలేదు. ఈనాటికీ మన దేశంలో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నారు’ అంటూ.. సామాజిక వివక్షను అంతమొందించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దళిత మహానాయకుడు బి.ఆర్.అంబేడ్కర్‌ను ఉటంకిస్తూ పిలుపునిచ్చారు. ఒకరిని మరొకరికి ప్రత్యర్థులుగా నిలిపే సిద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మహూలో రాహుల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ‘జై భీమ్’ నినాదంతో మొదలుపెట్టి ప్రసంగించారు. పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించిన ఘనత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేడ్కర్ నాయకత్రయానిదేనని పేర్కొన్నారు. అయితే.. దేశం ఇంకా కులతత్వం నుంచి విముక్తి పొందలేదని.. ఈ సామాజిక రుగ్మత విషయంలో యువత మౌనంగా ఉండరాదని సూచించారు. ‘‘ఇప్పుడు కూడా కులం, మతం పేరు మీద ప్రజలను వేరుగా చూస్తున్నారు. వారికి సమాన హక్కులు ఇవ్వరాదని కొందరు కోరుకుంటున్నారు. అధికారం కేంద్రీకృతం కావటం కులతత్వాన్ని బలోపేతం చేస్తుంది’ అంటూ బీజేపీ నేతల పేర్లు ప్రస్తావించకుండా రాహుల్ విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ వంటి వ్యక్తిని ఏ ఒక్క కులానికో, దేశానికో పరిమితం చేయజాలమని.. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి ఆయన ప్రతీక అని రాహుల్ కీర్తించారు. మరి.. భారతరత్న ఇవ్వలేదేం?: బీజేపీ న్యూఢిల్లీ: అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. సమాజాన్ని విభజించే వ్యాఖ్యలని బీజేపీ తప్పుపట్టింది. అంబేడ్కర్‌కు ఇవ్వవలసినంత గౌరవం కాంగ్రెస్ ఇవ్వలేదని.. పైగా ఆయనను అవమానిస్తోందని ఎదురుదాడికి దిగింది. రాహుల్ కుటుంబ సభ్యుల నేతృత్వంలోని ప్రభుత్వాలు సహా 58 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు.. అంబేడ్కర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్.. రాహుల్‌ను ప్రశ్నించారు.