కులతత్వంపై మౌనం వద్దు
యువతకు రాహుల్ పిలుపు
అంబేడ్కర్ జయంతి వేడుకలను ప్రారంభించిన కాంగ్రెస్ నేత
మహూ(మధ్యప్రదేశ్): ‘కులతత్వాన్ని తుద ముట్టించాలన్న బాబాసాహెబ్ కల ఇంకా నెరవేరలేదు. కుల నిర్మూలన జరగాలన్న ఆయన కల ఇంకా నెరవేరలేదు. ఈనాటికీ మన దేశంలో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నారు’ అంటూ.. సామాజిక వివక్షను అంతమొందించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దళిత మహానాయకుడు బి.ఆర్.అంబేడ్కర్‌ను ఉటంకిస్తూ పిలుపునిచ్చారు. ఒకరిని మరొకరికి ప్రత్యర్థులుగా నిలిపే సిద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మహూలో రాహుల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ‘జై భీమ్’ నినాదంతో మొదలుపెట్టి ప్రసంగించారు. పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించిన ఘనత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేడ్కర్ నాయకత్రయానిదేనని పేర్కొన్నారు. అయితే.. దేశం ఇంకా కులతత్వం నుంచి విముక్తి పొందలేదని.. ఈ సామాజిక రుగ్మత విషయంలో యువత మౌనంగా ఉండరాదని సూచించారు. ‘‘ఇప్పుడు కూడా కులం, మతం పేరు మీద ప్రజలను వేరుగా చూస్తున్నారు.
వారికి సమాన హక్కులు ఇవ్వరాదని కొందరు కోరుకుంటున్నారు. అధికారం కేంద్రీకృతం కావటం కులతత్వాన్ని బలోపేతం చేస్తుంది’ అంటూ బీజేపీ నేతల పేర్లు ప్రస్తావించకుండా రాహుల్ విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ వంటి వ్యక్తిని ఏ ఒక్క కులానికో, దేశానికో పరిమితం చేయజాలమని.. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి ఆయన ప్రతీక అని రాహుల్ కీర్తించారు.
మరి.. భారతరత్న ఇవ్వలేదేం?: బీజేపీ
న్యూఢిల్లీ: అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. సమాజాన్ని విభజించే వ్యాఖ్యలని బీజేపీ తప్పుపట్టింది. అంబేడ్కర్‌కు ఇవ్వవలసినంత గౌరవం కాంగ్రెస్ ఇవ్వలేదని.. పైగా ఆయనను అవమానిస్తోందని ఎదురుదాడికి దిగింది. రాహుల్ కుటుంబ సభ్యుల నేతృత్వంలోని ప్రభుత్వాలు సహా 58 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు.. అంబేడ్కర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్.. రాహుల్‌ను ప్రశ్నించారు.