కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీనే..  | Bjp government was coming back at the Center | Sakshi
Sakshi News home page

కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీనే.. 

Dec 23 2018 1:57 AM | Updated on Mar 29 2019 9:04 PM

Bjp government was coming back at the Center - Sakshi

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి ధీమా వ్యక్తం చేశారు. హిందుత్వ, సోషల్‌ ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తేనే అది సాధ్యమని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో శనివారం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ‘ఏ నేషన్‌ జర్నీ త్రూ టు ది నెక్ట్స్‌ ఎరా ఆఫ్‌ గవర్నెన్స్‌’అనే అం«శంపై సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ ఎడిటర్‌ భూపేంద్ర చౌబేతో ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే అధిక సీట్లు వస్తాయని, వ్యతిరేక పవనాలు వీయడంలేదని, 3 రాష్ట్రాల్లో ఓటమి ఆ రాష్ట్రాలకే పరిమితమన్నారు. కేంద్రం లోని ఒక్క మంత్రిపైనా ఈ నాలుగేళ్లలో ఒక్క కేసు, చార్జీషీటు నమోదు కాలేదన్నారు. 

ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన జైట్లీ... 
దేశంలో ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి బాగా పనిచేసే వాళ్లు ఉంటే అది మంచి ప్రభుత్వం అన్నారు. మన దేశంలో ముగ్గురు బాగానే పనిచేస్తున్నా ఆర్థిక మంత్రి జైట్లీ అన్నింటా విఫలమయ్యారన్నారు. జైట్లీ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాడని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు మంచి నిర్ణయమే అయినా ఆర్థిక మంత్రిత్వశాఖ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం విడ్డూరమన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా చేయాల్సింది కాదని, అతని స్థానంలో శక్తికాంత్‌దాస్‌ను నియమించడం దారుణమన్నారు. దాస్‌ అవినీతిపరుడని, ఆర్థిక శాఖలో పనిచేసే సమయంలో తాను చేసిన ఆరోపణలతోనే అతన్ని పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుకు ఆ శాఖను తనకు అప్పగిస్తే స్వీకరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ« చక్కగా నడుస్తోందని, ఇటీవలి కాలంలో కొన్ని సమçస్యలు వచ్చినా అన్నీ ప్రస్తుతం సర్దుకున్నాయన్నారు.
 
కౌలు రైతులకు మేలు జరగడం లేదు... 
రుణమాఫీ, రైతు పెట్టుబడి వంటి పథకాలతో అసలైన రైతులకు మేలు చేకూరడం లేదని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 47 శాతం కౌలు రైతులున్నారని, వారే వ్యవసాయం చేస్తున్నారని, వీరికి పైసా అందడం లేదన్నారు. రైతులుగా ఉన్న భూస్వాములు, నగరాల్లో నివాసముంటూ గ్రామాల్లో భూములున్న వారికే లబ్ధిచేకూరుతోందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాక్తిస్తాన్‌ దేశం ఏర్పాటు ఒక విఫల ప్రయోగమని, అది 4 దేశాలుగా విడిపోతేనే అక్కడి వారికి, మనకు మేలు జరుగుతుందన్నారు. 

‘రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు’ 
రాహుల్‌ ఎప్పుటికీ ప్రధాని కాలేడని, ఆయన బ్రిటన్‌ పౌరుడని చెప్పుకున్నాడని, దాన్ని కోర్టులో కేసు వేశానని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. సోనియా, రాహుల్, వాద్రా, చిదంబరం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మహాకూటమి విఫలకూటమి అని, ప్రధాని ఎవరో చెప్పలేని స్థితిలో వారున్నారన్నారు. అయోధ్యలో ఆలయం నిర్మించాల్సిందేనన్నారు. మన దేశంలోని ముస్లింలు, క్రైస్తవుల పూర్వీకులు హిందువులేనని, దీన్ని కొందరు ఒప్పుకున్నా, ఇంకొందరు ఒప్పుకోకపోవడంతోనే సమస్యగా మారిందన్నారు. మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొనడం తప్పన్నారు. తమిళనాడులో 69 శాతం ఉన్నాయని పేర్కొంటున్నారని, అక్కడ మత ఆధారిత రిజర్వేషన్లు కావని గుర్తించుకోవాలన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement