మసీదుల మీదున్న ప్రేమ ఆలయాలపై లేదా? | BJP National President Amit Shah Fires On Kcr Over Minority Reservation In Adilabad Meeting | Sakshi
Sakshi News home page

‘మాకు అధికారమివ్వండి అక్బరుద్దీన్‌ పీచమణుస్తాం’

Published Wed, Nov 28 2018 3:07 PM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

BJP National President Amit Shah Fires On Kcr Over Minority Reservation In Adilabad Meeting - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : కేసీఆర్‌, రాహుల్‌ గాంధీ, ఇతర పార్టీల నేతలు రజాకార్ల వారసులైన మజ్లీస్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించగలరా అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గేట్‌వే లాంటి ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చాను.. ఇక జీజేపీ ప్రవేశం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసి వీరుడు కుమ్రంభీమ్‌ను స్మరించుకుంటున్నానని తెలిపారు. కుమ్రంభీం లేకపోతే నేడు ఇక్కడకు రావాడానికి తను పాస్‌పోర్ట్‌ తీసుకోవాల్సి వచ్చేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహిస్తామని హామి ఇచ్చారు. గత ఎన్నికల్లో​ చెప్పిన ఎయిర్‌ పోర్ట్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్‌, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఏమైనాయి... డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఎక్కడ అంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు.

కేంద్ర నుంచి వచ్చిన రూ. 80 వేల కోట్లకు లెక్కలు చెప్పాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కారణంగా.. మోదీ పథకాలు తెలంగాణలో అమలు కావటం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఒక్కరికి కూడా ఇళ్లు నిర్మించలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదీవాసీలకు ఆయుశ్మాన్‌ భారత్‌ కింద సంత్సరానికి రూ. 5 లక్షలు అందిస్తున్నామని వివరించారు. గత ఎన్నికల ముందు దళితుణ్ణి సీఎం చేస్తా అన్న కేసీఆర్‌.. మాట తప్పి తానే పీఠమెక్కాడని విమర్శించారు. విదేశీ చోరబాటుదారులకు మద్దతు పలుకుతున్నారు.. రాహుల్‌ బాబా ఈ విషయంలో అందరికంటే ముందున్నాడంటూ కాంగ్రెస్‌పైన కూడా అమిత్‌ షా విమర్శనాస్త్రాలు సంధించారు. మైనార్టీ సంతుష్టీకరణ విషయంలో కేసీఆర్‌ పోటీ పడ్తున్నారు.. సాధ్యాసాధ్యాలతో నిమత్తం లేకుండా మైనార్టిలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ అబద్ధాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టిలకు విద్య, వైద్యం, ఉపాధి, మసీద్‌ ఇలా అన్ని విషయాల్లో ఊతమంటూ.. ఆలయాల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి అనేది అందరి కోసం ఉండాలిగాని మతాధారంగా కాదంటూ వ్యాఖ్యానించారు.

సీఎం ఎవరైనా మా కాళ్ల దగ్గర కూర్చోవాల్సిందే అంటూ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రగల్భాలు పలుకుతున్నారని మండి పడ్డారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. ఇలాంటి దుష్టశక్తుల పీచమణుస్తామని అమిత్‌ షా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావ్‌ భౌతిక కాయాన్ని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కూడా తీసుకురానివ్వలేదని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే.. సిమెంట్‌ ఫ్యాక్టరీని రీఓపెనింగ్‌ చేస్తాం.. పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌ పత్తి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.. దీంతో దక్షిణ భారతం మొత్తానికి వస్త్రాలందించొచ్చని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement