న్యూఢిల్లీ: కులతత్వం పోవాలంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ దళిత మహిళను పెళ్లి చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సలహా ఇచ్చారు. రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. రాహుల్ ఇచ్చిన నినాదం ‘హమ్ దో హమారే దో’ ఈ సందర్భంగా మంత్రి పార్లమెంట్‌లో వినిపించారు.
రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అథవాలే తప్పుపట్టారు. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ‘హమ్ దో హమారే దో’ అనే నినాదం గురించి ఆయన మాట్లాడుతున్నారని, నిజానికి ఈ నినాదం గతంలో కుటుంబ నియంత్రణ గురించి వాడేవారని గుర్తుచేశారు. అందుకే ముందుగా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆయన దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అప్పుడు ఆయన మహాత్మా గాంధీ కలలను నిజం చేసినవాడవుతాడని పేర్కొన్నారు. ఆయన పెళ్లితో కులపిచ్చికి అంతం పలకవచ్చు అని పేర్కొన్నారు. ఇలా చేస్తే దేశ యువతకు రాహుల్ మార్గనిర్దేశకుడు అవుతారని ఎద్దేవా చేశారు. గతంలోనూ మంత్రి అథవాలే రాహుల్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకుంటే, ఆయనకు కులాంతర వివాహం పథకం కింద రూ.2.5 లక్షలు ఇస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment