సాక్షి, ముంబై: సీనియర్ల ర్యాగింగ్‌తో మనస్తాపానికి గురై మే 22న ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని పాయల్ తద్వి రాసిన సూసైడ్ నోట్ ఫోటోలు ఆమె ఫోన్‌లో లభ్యమయ్యాయి. వివరాలు.. సెంట్రల్ ముంబైలోని బివైఎల్ ఆస్పత్రికి అనుబంధగా ఉన్న వైద్య కళాశాలలో ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన పాయల్ తద్వి(26) పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న సీనియర్లు హేమ అహుజా, అంకిత ఖండేల్‌వాల్, భక్తి మెహర్‌లు పాయల్‌ను కులం పేరుతో దూషిస్తూ ర్యాగింగ్ చేశారు. దీంతో పాయల్ సూసైడ్ నోట్‌లో వారి పేర్లు రాసి, ఆనోట్‌ను తన ఫోన్‌తో ఫోటోలను తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై అప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది.
అయితే సూసైడ్ నోట్ మాత్రం దొరకలేదు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారెవరో దాన్ని నాశనం చేసుంటారని ఈ కేసు వాదిస్తున్న లాయర్ తెలిపారు. తాజాగా ఆమె ఫోన్‌లో ఫోటోలు బయటికి రావడంతో పోలీసులు నిర్ధారణ కోసంవాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పరీక్షలో ఆ నోట్ పాయల్ రాసిందేనని తేలడంతో ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఈ కేసు వాదిస్తున్న లాయర్ కోరారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ మే 31 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకు ముందు రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ప్రత్యేక కోర్టు ద్వారా విచారిస్తున్న ఈ కేసులో, నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను జూన్ 24న కోర్టు కొట్టివేసింది. దాంతో వారు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో వాళ్లు బెయిల్ కావాలని కోరడంతో పాటు ఈ కేసులో మమ్మల్ని కావాలనే ఇరికించారని పేర్కొన్నారు. కాగా, తదుపరి విచారణను కోర్టు జులై 16కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment