Mumbai: Salman Khan House Firing Case Accused Commits Suicide In Police Custody, Dies In Hospital | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఇంటిపై కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య

Published Wed, May 1 2024 3:59 PM | Last Updated on Wed, May 1 2024 6:50 PM

Mumbai: Accused In Salman Khan House Firing Case Suicide In Custody

ముంబై: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి  వద్ద కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్‌ లాకప్‌లో ఉన్న నిందితుడు అనుజ్‌ థాపన్‌.. బుధవారం  ఉదయం 11 గంటలకు లాకప్‌ గదిలో వాష్‌రూమ్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అధికారులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన అనూజ్‌ను ఏప్రిల్‌ 26న పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా గత నెల 14న సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయ్యాయి.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీస్‌ క్రైం బ్రాంచ్‌ అధికారులు.. నిందితులు, విక్కీ గుప్తా, సాగర్ పాల్‌గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు ఆయుధాలు అందించిన అనుజ్ థాపన్, సుభాష్‌ చందర్‌లను కూడా  కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఒకడైన అనూజ్‌ తపన్‌ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.

అయితే అనుజ్‌తోపాటు మరో పదిమంది అదే లాకప్‌లో ఉన్నారని, నలుగురు నుంచి అయిదుగురు పోలీసులు నిత్యం వీరిని గమనిస్తూ ఉంటారని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందనిప్పారు

లాకప్‌లో వ్యక్తి మరణిస్తే హత్య కేసుగా పరిగణిస్తారని, పోలీస్ స్టేషన్‌లోని పోలీసులందరినీ సీఐడీ ప్రశ్నిస్తుందని అని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే  జైన్‌ చెప్పారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఏ వస్తువు అందుబాటులో ఉండకుండా పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారని పేర్కొన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు లాకప్‌ వద్ద నిత్యం గస్తీ కాస్తుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా నలుగురు నిందితులు జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు  తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement