సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? | Siddiqui Paid Price for Salman Khan Friendship | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?

Published Sun, Oct 13 2024 9:48 AM | Last Updated on Sun, Oct 13 2024 10:36 AM

Siddiqui Paid Price for Salman Khan Friendship

ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ముంబైలో శనివారం రాత్రి ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ఈ  హత్య పలు సందేహాలకు తావిస్తోంది. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు దగ్గరైనందుకే బాబా సిద్ధిఖీని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు తాము బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారిమని పోలీసులకు చెప్పారని సమాచారం. ఈ షూటర్లలో ఒకరి పేరు కర్నైల్ సింగ్, ఇతను హర్యానా నివాసి. రెండో షూటర్ ధరమ్‌రాజ్ కశ్యప్.. ఇతను యూపీకి చెందినవాడు. వీరు గత కొంతకాలంగా బాబా సిద్ధిఖీ ఇంటికి రెక్కీ చేశారని పోలీసుల విచారణలో తేలింది.

గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంబడిస్తోంది. లారెన్స్ గ్యాంగ్ షూటర్లు సల్మాన్ ఖాన్‌ను రెండుసార్లు రెక్కీ చేశారు. మొదటిసారి రెడీ సినిమా షూటింగ్‌లో ఉండగా, రెండోసారి పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్‌కి వెళ్లి రెక్కీ చేశారు. ఆ తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ముంబైలోని సల్మాన్‌ ఉంటున్న లాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిపారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని సమాచారం. సల్మాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి అంటూ గతంలొ అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముష్కరులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడాడు. వారికి ఆదేశాలు ఇచ్చాడని తేలింది.

ఇదిలావుండగా లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోద్రా ఇటీవల మీడియాతో.. సల్మాన్ ఖాన్‌కు స్నేహితుడైనవాడు తమకు శత్రువు అని వ్యాఖ్యానించాడు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న బాబా సిద్ధిఖీకి సల్మాన్ ఖాన్‌తో మంచి స్నేహం ఉంది. దీనికి తోడు బాలీవుడ్‌ హీరోలు సల్మాన్- షారుక్ ఖాన్‌ మధ్య స్నేహాన్ని కుదర్చడంలో సిద్ధిఖీ కీలకపాత్ర పోషించాడని చెబుతారు. మొత్తంగా చూస్తే సల్మాన్‌తో దోస్తీ కారణంగానే బాబా సిద్ధిఖీ.. లారెన్స్‌ బిష్ణోయ్‌కి శత్రువయ్యాడని, ఈ నేపధ్యంలోనే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్‌ గ్యాంగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement