పాట్నా: బీహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) పగ్గాల్ని మళ్లీ ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందుకోబోతున్నారా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మరో వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ ఉన్నారు. అయితే తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నితీశ్ కుమార్‌నే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారట. ఈ క్రమంలో.. ఢిల్లీలో డిసెంబర్ 29వ తేదీన జరగబోయే పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లాలన్ సింగ్ తొలగింపు ఎందుకంటే..
జేడీయూ చీఫ్‌గా లాలన్ సింగ్‌ను తొలగించేందుకు కారణం లేకపోలేదు. లాలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామంపై అసంతృప్తితో రగిలిపోతున్న నితీశ్.. ఆయన్ని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లాలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు.
ఆర్జేడీతో వైరం.. మైత్రి.. గ్యాప్
జనతా పార్టీ చీలికతో.. ఒకవైపు కర్ణాటకలో హెచ్‌డీ దేవె గౌడ జనతా దళ్(సెక్యులర్), నార్త్ బెల్ట్‌లో బీహార్ నుంచి శరద్ యాదవ్ నేతృత్వంలో జనతా దళ్(యునైటెడ్) ఏర్పాడ్డాయి. అప్పటికే జార్జి ఫెర్నాండేజ్, నితీశ్ కుమార్‌లు సమతా పార్టీని స్థాపించారు. సమతా పార్టీని 2003 అక్టోబర్ 30న జనతా దళ్‌లో విలీనం చేశారు. మరో పార్టీ లోక్ శక్తి కూడా ఇందులో చేరింది. అప్పుడు అధికారంలో రాష్ట్రీయ జనతా దళ్ ఉండగా.. ప్రతిపక్ష కూటమిగా జేడీయూ కొనసాగింది.
అయితే.. బీజేపీతో కటీఫ్ ప్రకటించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంతో పొత్తుగా వెళ్లింది జేడీయూ. నలభై సీట్లలో కేవలం రెండే సీట్లు నెగ్గింది. ఓటమికి నైతిక బాధత్య వహిస్తూ నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జతిన్ రామ్ మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ టైంలో బీజేపీ అధికార పక్షాన్ని బలపరీక్షకు ఆహ్వానించగా.. ఆర్జేడీ సాయంతోనే జేడీయూ ప్రభుత్వం నెగ్గడం గమనార్హం. ఆ తర్వాత 2015లో జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పటికీ.. ఎస్పీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో పొత్తుగా వెళ్లి ఎన్నికల్లో నెగ్గాయి.
బీజేపీతో జేడీయూ దోస్తీ-కటీఫ్‌ల నడుమ.. జేడీయూ-ఆర్జేడీల మైత్రి కూడా పడుతూ లేస్తూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా విజయం సాధించి ప్రభుత్వంలో ఆర్జేడీ కూడా భాగమైంది. అయితే.. మధ్య మధ్యలో కీలక నేతల నడుమ లుకలుకలు బయటపడుతూనే వస్తున్నాయి. ఇండియా కూటమి సమావేశాలు కొనసాగుతున్న వేళ.. జేడీయూ-ఆర్జేడీల మధ్య ఆగాథం మరింత పెరుగుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment