పాల వ్యాపారంలోకి మహీంద్రా గ్రూప్
రూ. 750 కోట్లతో బ్రాండ్ కొనుగోలు యోచన
ముంబై: కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అగ్రి బిజినెస్... పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా ఏదైనా ప్రముఖ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 150-750 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని మహీంద్రా అగ్రిబిజినెస్ వర్గాలు తెలిపాయి.
పరిశ్రమల సమాఖ్య సీఐఐ బుధవారం నిర్వహించిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వివరించాయి. ప్రీమియం ఉత్పత్తులపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ పరికరాల తయారీలో పెద్ద సంస్థల్లో ఒకటి కావడంతో పాటు అగ్రి బిజినెస్‌లోనూ గణనీయంగా కార్యకలాపాలు ఉన్నందున డెయిరీ విభాగంలోకి కూడా ప్రవేశించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా శుభ్‌లాభ్ సర్వీసెస్ సంస్థ మహారాష్ట్రలో రైతులతో కలిసి కాంట్రాక్ట్ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు. ఈ సంస్థ అత్యధికంగా ద్రాక్షలు ఎగుమతి చేస్తోందని, రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాలు కూడా అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశీ డెయిరీ పరిశ్రమ రూ. 3 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఇందులో దాదాపు 80 శాతం మార్కెట్ అసంఘటితంగానే ఉంది.