ఒంగోలు టూటౌన్: డెయిరీ ఉద్యోగులు బుధవారం కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావును ఆయన ఇంటి వద్ద కలిసి సమస్యలు విన్నవించారు. డెయిరీకి కరెంటు కట్ చేసి మూడు రోజులవుతోందని, దానివలన జనరేటర్ డీజిల్ కోసం రోజుకి లక్ష రూపాయల వరకు ఖర్చవుతోందని వివరించారు. ఇప్పటికే డెయిరీ నష్టాల్లో ఉందని, డెయిరీని ఆదుకోకపోతే ఎలా.. అంటూ ఉద్యోగులు కొత్త చైర్మన్‌కు విన్నవించారు. ముందు కరెంట్ ఇప్పించండి అని కోరగా, స్పందించిన చైర్మన్.. దానికిప్పుడు రూ.2 కోట్లు ఖర్చవుతుందని, ఎక్కడ తీసుకోస్తామని, సీఎం చంద్రబాబు నుంచి ఎలాంటి అనుమతి రాలేదని పేర్కొన్నారు. అందుకే డెయిరీకి తాను రాలేదని చెప్పడంతో ఉద్యోగులు వెంటనే మాట అందుకుని మీ రాజకీయాలు పక్కన పెట్టండి సార్.. ముందు రాసిచ్చిన లెటర్ ప్రకారం సమస్యలు తీర్చి ఉద్యోగులు, రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతో విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటానని చైర్మన్ చెప్పడంతో ఉద్యోగులు కొంత ఊరట చెందారు. చైర్మన్‌ని కలిసిన వారిలో టీఎన్‌టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ కాటూరి శ్రీనివాసరావు, సెక్రటరీ యు.బ్రహ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ ఎం.రాంబాబు, జాయింట్ సెక్రటరీ చింతపల్లి రాంబాబు, మాజీ ప్రెసిడెంట్ ఆర్‌వీ శేషయ్య, ఉద్యోగులు ఉన్నారు.
చెక్‌బుక్‌లు రిటన్...
కొత్త చైర్మన్‌గా డెయిరీ పాలకవర్గాన్ని ఎన్నుకున్నాక డెయిరీకి సంబంధించిన చెక్‌బుక్‌లను శిద్దా తన వెంట తీసుకెళ్లారు. దీంతో డెయిరీలో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. బుధవారం తిరిగి ఇన్‌చార్జి ఎండీ పరుశురామ్‌కు డెయిరీ చెక్‌బుక్కులను ఆయన రిటన్ చేశారు. దీంతో పాటు ఉద్యోగులకు ఒక నెల జీతంగా రూ.45 లక్షలు జమయ్యేలా చర్యలు తీసుకున్నారని ఉద్యోగ సంఘ నాయకుడు కె.శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా ఐదు నెలల జీతాలు రావాల్సి ఉందన్నారు.పాలరైతులకు కొన్ని పేమెంట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో ఉద్యోగులు కొంత ఊరట చెంది తిరిగి డెయిరీకి వెళ్లిపోయారు.
సాయంత్రం కూడా డైరెక్టర్లరాక కోసం ఎదురుచూపులు...
కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుని కలిసిన అనంతరం తిరిగి డెయిరీకి వెళ్లి డైరెక్టర్ల రాక కోసం ఉద్యోగ సంఘ నాయకులు ఎదురు చూశారు. అయినా, ఎవరూ రాకపోవడంతో ఎదురు చూడటాన్ని ఉద్యోగ సంఘ నాయకులు మానుకున్నారు.
మొహం చాటేసిన డైరెక్టర్లు...
కొద్ది రోజులుగా పాత, కొత్త చైర్మన్లు డెయిరీవైపు కన్నెత్తి చూడకపోవడం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం, పాల రైతులకు డబ్బు చెల్లించకపోవడం, కొత్త చైర్మన్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిపై మంగళవారం సమావేశమైన ఉద్యోగులు.. తొలుత పాలకవర్గం డైరెక్టర్లతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం డైరెక్టర్ల కోసం ఒకటిన్నర వరకు వేచి చూశారు. అయినా, ఒక్కరు కూడా రాకపోవడంతో ఉద్యోగులందరూ కలిసి కొత్త చైర్మన్ ఇంటికి వెళ్లి సమస్యలు విన్నవించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి డెయిరీ సమస్యలు చెప్పాలనుకున్నారు. కానీ, కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో విరమించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment