నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి! | Prakasam District Milk Dairy Closed in Chandrababu Naidu Regime | Sakshi
Sakshi News home page

నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి!

Published Thu, May 26 2022 5:03 PM | Last Updated on Thu, May 26 2022 9:14 PM

Prakasam District Milk Dairy Closed in Chandrababu Naidu Regime - Sakshi

చంద్రబాబు పాలన అంటే ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచన గుర్తుకు వస్తాయి. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో దుర్భిక్షం రాజ్యమేలింది. పాడికి పేరొందిన ప్రకాశం జిల్లాలో రైతులకు అండగా ఉన్న ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. రైతులను నట్టేట ముంచేసి.. వేలాది మంది కార్మికులను రోడ్డు పాల్జేశారు. రుణమాఫీ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది కర్షకులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు.  వెలిగొండ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్ట్‌ పేరుతో విడుదలైన అరకొర నిధులు బాబు బినామీలు కాజేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఐదేళ్లు కాలక్షేపం చేసిన ఎన్నికల వేళ హడావిడిగా శిలా ఫలకం వేసి వంచన చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను నట్టేట ముంచేసిన చంద్రబాబు.. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఈ గడ్డపై మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు హయాం 2014 నుంచి 2019 వరకు ప్రకాశం జిల్లాలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఐదేళ్లూ అన్ని మండలాల్లో కరువు తాండవించింది. సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. పశ్చిమాన పలు గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనలతో హడావుడి చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఐదేళ్ల బాబు నయవంచన పాలనను.. మూడేళ్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని జనం పోల్చుకుంటున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. జిల్లాలో నాడు–నేడు ఒక్కసారి పరిశీలిద్దాం.. 

పాలేరూ అంతే.. 
కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో  ముందుకు సాగనేలేదు. అప్పటి, నేటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి (టీడీపీ) కాంట్రాక్టర్లను మార్చటమే పనిగా పెట్టుకున్నారు. మూడుసార్లు కాంట్రాక్టర్లను మార్చి నిర్లక్ష్యం చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను గాలికొదిలేశారు. కరువు జిల్లాగా మార్చేశారు.  

రుణమాఫీ పేరిట దగా
2014 ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. కమిటీల పేరుతో ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. పాత ప్రకాశం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు కలిపి సుమారు రూ.11 వేల కోట్లకు పైగా రుణాలు ఉండేవి. కేవలం రూ.3 వేల కోట్లలోపు మాత్రమే రుణాలు మాఫీ చేసి అటు రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు.   

హెరిటేజ్‌ కోసం ఒంగోలు డెయిరీ మూత... 
పాడి రైతులకు ఆదాయ వనరుగా ఉన్న ఒంగోలు డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్‌ కోసం నిలువునా ముంచేశారు. తన పార్టీకి చెందిన డెయిరీ పాలక మండలి చేత సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్పించి దగా చేశారు. డెయిరీ సొమ్ముంతా దోచుకునేటట్లు చేసి చివరకు రూ.100 కోట్ల వరకు అప్పులు చేయించి మరీ డెయిరీని మూతవేయించారు. పాడి రైతులను నట్టేట ముంచారు. వేలాది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. 

వెలిగొండ పనులు నత్త నడక....  
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా నిర్మింపతలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఐదేళ్లూ నత్తను తలపించాయి. తన సొంత బినామీ అయిన సీఎం రమేష్‌కు వెలిగొండ పనులను అడ్డగోలుగా నామినేషన్‌పై ఇచ్చి రూ.వందల కోట్లు కాజేశారు. పనుల్లో మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకటో టన్నెల్‌ పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. ఆర్‌అండ్‌ఆర్‌ పనులు అసలు చేపట్టనే లేదు. నాడు గాలికొదిలేసిన టీడీపీ నేతలు ఇదే ప్రాజెక్టుపై లేఖల డ్రామాలు మొదలుపెట్టి అసత్య ప్రచారానికి పూనుకున్నారు. 

ఉత్తుత్తి శంకుస్థాపన
జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం పోర్టు. టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారు. చివరకు ఎన్నికలకు ముందు డ్రామాకు తెరతీశారు. మేజరు పోర్టును మినీపోర్టుగా మార్చేశారు. హడావుడిగా శిలాఫలకం వేశారు. నన్ను తిరిగి గెలిపిస్తే రామాయపట్నం పోర్టు, పేపర్‌ మిల్లు ఏర్పాటు చేస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చి వెళ్లారు.  

మారిన గతి.. 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. వెలిగొండకు భారీగా నిధులు కేటాయించింది. పనుల్లో వేగం పెంచింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నాలుగైదు రకాల ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది దాదాపు రూ.19,600 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు చేరాయి.  

మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ..
దోర్నాలలో గిరిజన సూపర్‌ స్పెషాలిటీ 

వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు వైద్యం అందించేందుకు మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం 50 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.475 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో గిరిజన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల దశ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావాల్సి ఉంది.  

జీజీహెచ్‌ అభివృద్ధికి రూ.170 కోట్లు 
జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారు.  ప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు మంజూరు చేయించారు. జీజీహెచ్‌ వెనుక 7 ఎకరాలను అదనంగా కేటాయించారు. బెడ్లు పెంచటంతో పాటు అదనపు సౌకర్యాలు, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి సీటీఎంఆర్‌తో పాటు జీజీహెచ్‌లో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. థర్డ్‌ వేవ్‌ కోవిడ్‌ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్‌ సమయంలో జీజీహెచ్‌ వేలాది ప్రాణాలను కాపాడింది. 

జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ.. 
టీడీపీ హయాంలో ఒక్క విద్యా సంస్థ కూడా జిల్లాకు కేటాయించలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీని మంజూరు చేసింది. పేర్నమిట్టలో 109 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను డీపీఆర్‌ కోసం రూ.50 లక్షలు రిలీజ్‌ చేసింది. మొత్తం యూనివర్శిటీ బడ్జెట్‌ కింద రూ.340 కోట్లు కేటాయించింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం
► నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించటానికి (స్కిల్‌ డెవలప్‌మెంట్‌) ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో 5 ఎకరాలు కేటాయించింది.  
► దోర్నాలలో రూ.3 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 
► గిద్దలూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల గ్యాప్‌ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లతో పనులు చేస్తున్నారు.  
► ఒంగోలు నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఒంగోలు నగరానికి వచ్చినప్పుడు రూ.400 కోట్లు కేటాయించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. దీంతో ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నట్లు బహిరంగ సభలోనే ప్రకటించారు. 
► రూ.54 కోట్లతో నగరంలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
► చీరాల మండలంలోని వాడరేవు, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో రెండు ఫిషింగ్‌ హార్బర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి స్థల సేకరణ పూర్తయింది. త్వరలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.   

వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టన్నెల్‌ నిర్మాణ పనులు పూర్తి చేసింది. రెండో టన్నెల్‌ 18.679 కిలో మీటర్లకుగాను ఇక కేవలం 4.920 కిలో మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా వేగవంతం చేసింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ఇప్పటికే 31,066 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. భూ సేకరణ కోసం రూ.418 కోట్లు వెచ్చించింది. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కోసం 11 గ్రామాల తరలింపునకు రూ.116 కోట్లు కేటాయించింది. 

పేద విద్యార్థుల కల సాకారమే ట్రిపుల్‌ ఐటీ
ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్‌ ఐటీని జిల్లాకు తీసుకొచ్చి పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఏటా 4 వేల మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో చేరుతుంటారు. ఐదేళ్లపాటు అంటే 20 వేల మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం ఇడుపులపాయతో పాటు పేర్నమిట్ట అవతల ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనిర్మాణం కోసం కనిగిరి ప్రాంతంలో స్థల పరిశీలన జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement