ఒంగోలు డెయిరీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీకి రాకపోవడం, మౌనం వీడకపోవడంతో డెయిరీ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాడి రైతులు, ఉద్యోగుల్లో ఆందోళన అధికమవుతోంది. చేతనైతే డెయిరీని ఆదుకోవాలి.. లేకపోతే పదవికి రాజీనామా చేయాలంటూ ఇటు పాడి రైతులు, అటు ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శిద్దా మౌనం డెయిరీని మరింత ఊబిలోకి నెడుతోంది. తక్షణం బోర్డు మీటింగ్ నిర్వహించాలంటూ మంగళవారం ఉద్యోగులు, పాడి రైతులు ఎండీపై ఒత్తిడి పెంచారు. బుధవారం బోర్డు మీటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోర్డు మీటింగ్ నిర్వహించాలంటూ ఒకరోజు ముందస్తుగా డైరెక్టర్లతో పాటు అందరికీ నోటీసులివ్వాల్సి ఉంది. నోటీసులపై చైర్మన్ శిద్దా సంతకాలు చేయాల్సి ఉంది. ఇదే విషయంపై మాట్లాడేందుకు ఎండీ ప్రయత్నించినా చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు అందుబాటులో లేరు. ఆయన ఫోన్‌లో ఎవరికీ పలికే పరిస్థితి లేదు. మంగళవారం శిద్దా స్పందించకపోవడంతో బుధవారం బోర్డు మీటింగ్ జరిగే పరిస్థితి లేదు. మంగళవారం సైతం డైరెక్టర్ స్వయాన శిద్దా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. బోర్డు సమావేశం సంగతి తేల్చమని కోరినట్లు సమాచారం.
అయితే, ఆ వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో నోటీసులు మంగళవారం అందించే పరిస్థితి లేదు. బోర్డు మీటింగ్‌కు చైర్మన్ శిద్దా అంగీకరించే పక్షంలో బుధవారం అందరికీ నోటీసులు అందజేస్తే గురువారం బోర్డు మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. డెయిరీకి ఉపయోగపడనప్పుడు శిద్దాను చైర్మన్‌గా ఎందుకు ఎన్నుకున్నారంటూ పాడి రైతులు, ఉద్యోగులు నిలదీయడంతో డైరెక్టర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. శిద్దాను చైర్మన్‌గా ఎన్నుకుని మోసపోయామని పలువురు డైరెక్టర్లు రైతులు, ఉద్యోగుల వద్ద సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సీఎం చెబితేనే చైర్మన్‌గా కొనసాగుతానంటూ శిద్దా అడ్డం తిరగడంపై డైరెక్టర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాడు శిద్దాను డైరెక్టర్లే చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆ రోజు సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. నాడు చైర్మన్‌గా అంగీకారం తెలిపిన శిద్దా.. ఇవాళ ముఖ్యమంత్రి చెబితేనే చైర్మన్‌గా కొనసాగుతానని మెలిక పెట్టడాన్ని వీరు జీర్ణించుకోలేకున్నారు. రూ.20 కోట్లు డబ్బులిచ్చి ఆదుకుంటానంటేనే డైరెక్టర్లు, పాలకవర్గం శిద్దాను చైర్మన్‌గా ఎన్నుకుంది. డెయిరీని నడిపిస్తే తర్వాత చూసుకోవచ్చని అందరూ భావించారు. అయితే, శిద్దా ఇప్పుడు అడ్డం తిరగడంతో అందరూ దోషులుగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో శిద్దాను రాజీనామా చేయించడమే మేలని పాలకవర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సహకార పరిధిలోకి డెయిరీ...
మరోవైపు డెయిరీని సహకార పరిధిలోకి తీసుకొస్తేనే ప్రభుత్వం సహకరిస్తుందని ఇప్పటికే ఉద్యోగులు, పాడి రైతులకు జిల్లా కలెక్టర్ చెప్పినట్లు సమాచారం. మొదట పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి డెయిరీని సహకార యాక్టులోకి మార్చేందుకు తీర్మానం చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వం డెయిరీని సహకార పరిధిలోకి తీసుకువస్తుందని ఇప్పటికే ఉన్నతాధికారులు సైతం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నేతలు, డెయిరీ పాలకవర్గం డెయిరీని సహకార పరిధిలోకి మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పాలకవర్గ తీర్మానం అనంతరం చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావుతో రాజీనామా చేయించాలని అధికార పార్టీ నేతలు సైతం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సహకార పరిధిలోకి రాకుండా డెయిరీ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదని, ముందు యాక్టు మారిస్తేనే డెయిరీ విషయాన్ని పరిశీలిస్తామని జిల్లా ఉన్నతాధికారులు సైతం ఉద్యోగులు, రైతు నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment