సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార పార్టీ నేతలు జిల్లా ప్రయోజనాలను గాలికొదిలేశారు. ముఖ్యంగా అధికార పార్టీ పాలనలో కొనసాగుతున్న సహకార వ్యవస్థను కొందరు నేతలు నిర్వీర్యం చేస్తున్నా... మిగిలిన వారు చోద్యం చూస్తుండిపోతున్నారు. పార్టీలో తీవ్ర స్థాయికి చేరిన వర్గవిభేదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం ఎవరికీ వారే అన్న రీతితో వ్యవహరిస్తుండటంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధిష్టానం సైతం పట్టించుకోక జిల్లాను గాలికొదిలేసింది. జిల్లా ముఖ్యనేతల తీరుపై ఆ పార్టీ దిగువ శ్రేణి నేతలు బహిరంగ విమర్శలకు దిగుతుండటం గమనార్హం.
డెయిరీలో పవర్ కట్..
చారిత్రక ఒంగోలు డెయిరీ మూతపడే దిశకు చేరింది. మూడు రోజుల క్రితం దాదాపు కోటి రూపాయల విద్యుత్ బకాయి చెల్లించలేదని విద్యుత్ శాఖ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. డెయిరీ పాలకవర్గం విద్యుత్ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. దీంతో డెయిరీకి విద్యుత్ ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు రైతులకు కోట్లాది రూపాయల పాల బకాయిలు దాదాపు అంతే మొత్తంలో ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. 2014 వరకు కోట్లాది రూపాయల లాభాల్లో ఉన్న డెయిరీని చైర్మన్ చల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో పాలకవర్గం అప్పుల్లోకి నెట్టింది. గడిచిన మూడేళ్లలోనే డెయిరీని రూ.70 కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారు. సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చి చైర్మన్ చల్లా డెయిరీని సర్వనాశనం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు జీతాల కోసం రైతులు, ఉద్యోగులు అధికార పార్టీకి చెందిన తెలుగురైతు, టిఎన్‌యుసిల నేతృత్వంలో 32 రోజుల పాటు డెయిరీ వద్దే నిరసన దీక్షలు చేశారు. డెయిరీ వ్యవహారం రాష్ట్ర స్థాయికి చేరింది. రైతులు, ఉద్యోగులు రోడ్డునపడ్డ జిల్లా అధికార పార్టీ నేతలు దాని సంగతి పట్టించుకోలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పాటు కొందరు చైర్మన్ చల్లా శ్రీనివాసరావుకు మద్ధతుగా నిలవడంతో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం లాంటి నేతలు డెయిరీని గాలికొదిలేశారు. జరుగుతున్న తంతును చూడటం మినహా వారు జోక్యం చేసుకోలేదు.
పీడీసీసీబీలో రగడ..
ఇక అధికార పార్టీ పాలనలోనే కొనసాగుతున్న పీడీసీసీబీ వ్యవహారం గత నెల రోజులుగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ ఈదర మోహన్ డైరెక్టర్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. చైర్మన్ రూ.25 కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని మెజార్టీ డైరెక్టర్లు బహిరంగ విమర్శలకు దిగారు. సీఎం మొదలు రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు. చైర్మన్ ఈదర సైతం డైరెక్టర్లపై ప్రత్యారోపణలకు దిగారు. వీరి గొడవ నెల రోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలకెక్కింది. చైర్మన్‌పై డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టే వరకు వచ్చింది. ఎట్టకేలకు ఈదర మోహన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ గొడవ డీసీసీబీని అస్తవ్యస్తంగా మార్చింది. రైతులకు రుణాలిచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
పాలకవర్గం గొడవలతో బ్యాంకులో డిపాజిట్లు సైతం వెనక్కు తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా... అధికార పార్టీ నేతలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు రెండు వర్గాలుగా విడిపోయి అగ్నికి ఆజ్యం పోసినట్లు గొడవను పెంచారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ చైర్మన్ ఈదరకు మధ్య విభేదాల నేపథ్యంలో ఆయన వర్గం ఈదరను పదవి నుంచి దించేందుకు గట్టిగా ప్రయత్నించినట్లు స్వయంగా ఈదర ఆరోపించిన విషయం తెలిసిందే. జనార్దన్ డైరెక్టర్ల మద్ధతు పలకడంతో మిగిలిన నేతలు డీసీసీబీ సంగతిని పట్టించుకోవడం మానేశారు. అధికార పార్టీ వర్గ విభేదాలతో పీడీసీసీబీ పరువు బజారునపడింది. రైతు ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సినిమాలకు ‘సహకారం’..
ఇక డీసీఎంఎస్‌లో సైతం అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. పాలకవర్గం సినిమాలను కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. దీంతో సినిమా కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను డీసీఎంఎస్ పాలకవర్గం చివరకు చెల్లించాల్సి వచ్చింది. మొత్తంగా అధికార పార్టీ పాలనలో ఉన్న జిల్లాలోని సహకార వ్యవస్థకు సంబంధించిన మూడు విభాగాల్లో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. రెండు నెలలుగా ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీని వల్ల రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికార పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆ పార్టీ నేతలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. మంత్రి శిద్దా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితర నేతలు వర్గాలుగా విడిపోయి వీటి సంగతి గాలికొదిలారు. అధిష్టానం సైతం పట్టించుకోకపోవడం చూస్తే ప్రజాప్రయోజనాలకు ఏమాత్రం ప్రాధాన్యమిస్తున్నారో అవగతమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment