నాన్చుడో.. తేల్చుడో..! | Ongole Dairy Shada Venkateswara Rao resign | Sakshi
Sakshi News home page

నాన్చుడో.. తేల్చుడో..!

Published Sun, May 20 2018 9:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Ongole Dairy Shada Venkateswara Rao resign - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నెలరోజుల క్రితం డెయిరీ చైర్మన్‌గా  బాధ్యతలు చేపట్టిన శిద్దా వెంకటేశ్వరరావు పట్టుమని పది రోజులు కూడా సీట్లో కూర్చోకుండానే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఈ నెల 17 ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. సీఎం ఓకే అంటేనే చైర్మన్‌గా కొనసాగుతానని వద్దంటే రాజీనామా ఆమోదించాలని శిద్దా బంతిని సీఎం కోర్టుకు నెట్టారు. ఇక సీఎం నిర్ణయమే తరువాయి. అయితే  డెయిరీ విషయం మళ్లీ మాట్లాడదామని చైర్మన్‌ శిద్దాతో చెప్పిన ముఖ్యమంత్రి ఆ తరువాత  వీరిని పిలవలేదు. ఒకటి రెండుమార్లు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, ఇన్‌చార్జ్‌ మంత్రి నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు సమావేశమై డెయిరీ విషయం చర్చించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన సూచన మేరకు తరుపరి నిర్ణయం తీసుకుందామని మంత్రులు శిద్దా,నారాయణ, జనార్దన్‌లు చైర్మన్‌ శిద్దాకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తారో తెలియని పరిస్థితి.

ఇంట్లో చిచ్చుకు యత్నం..
మంత్రి శిద్దా రాఘవరావుకు తెలియకుండానే ఆయన సమీప బంధువైన వెంకటేశ్వరరాను రాత్రికి రాత్రే చైర్మన్‌ చేయడం వివాదంగా మారింది. దీని వెనుక టీడీపీకి చెందిన ముఖ్యనేతతో పాటు మరికొందరు నేతల ప్రమేయమున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మరోవైపు మంత్రి శిద్దా సైతం తనకు తెలియకుండా తన కుటుంబ సభ్యుడిని చైర్మన్‌ చేసి తన కుటుంబంలో విబేధాలు సృష్టించే ప్రయత్నం చేయడంపై ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 

దీంతో ముఖ్యమంత్రి పాత, కొత్త చైర్లన్లపై  తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ని గొడవల నేపథ్యంలో డెయిరీ కొత్త చైర్మన్‌ విషయం ముఖ్యమంత్రి ఇప్పట్లో తేల్చే పరిస్థితి  కనిపించడం లేదు. పైగా వెంకటేశ్వరరావును చైర్మన్‌ గా ముఖ్యమంత్రి ఆమో పరిస్థితి లేదన్నది  స్పష్టం. ఆయన రాజీనామాను ఆమోదించకుండా.. విషయాన్ని ఎటూ తేల్చకుండా ముఖ్యమంత్రి నాన్చుడు ధోరణి అవలంబించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అడకత్తెరలో పోకచెక్క..
డెయిరీ చైర్మన్‌ వెంకటేశ్వరరావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. పాత చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు  ప్రోద్భలంతో  శిద్దా కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రూ.20 కోట్లు సొంత డబ్బులు ఇచ్చి డైరీని ముందుకు నడిపిస్తానన్నారు. ఈ పరిస్థితిలో ఎవరో ఒకరు డెయిరీని నడిపిస్తే చాలని భావించిన పాలకవర్గం, ఉద్యోగ, రైతు సంఘాలు శిద్దాను చైర్మన్‌గా ఆమోదించాయి. తమకు తెలియకుండానే డెయిరీ చైర్మన్‌గా శిద్దా వెంకటేశ్వరరావును ఎలా ఎన్ను కుంటారంటూ అధికార పార్టీలోని ఓ వర్గం సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది.

డెయిరీకి చైర్మన్‌ డుమ్మా..:
ముఖ్యమంత్రి ఎటూ తేల్చక పోవడంతో డెయిరీకి రూ. 20 కోట్లు ఇస్తానన్న చైర్మన్‌ పైసా ఇవ్వలేదు. తన సొంత డబ్బులు ఇచ్చేది లేదని, బ్యాంకు రుణమొస్తేనే ఇస్తానని మాటమార్చారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ఓకే అంటేనే చైర్మన్‌గా ఉంటానని లేకపోతే లేదని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రికి ఈ నెల 17నే రాజీనామా లేఖను ఇచ్చినట్లు వెల్లడించారు. చైర్మన్‌  డెయిరీకి రాకపోవడం, ఉద్యోగులు, రైతుల బకాయిలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ వర్గాల్లో ఆందోళన మొదలైంది. 

మళ్లీ ఆందోళనకు సిద్ధం...
ఒంగోలు డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల 5 నెలల జీతాలు రూ.2.5 కోట్లు, పీఆర్‌సీ అరియన్స్, గ్రాడ్యూటీ, ఎల్‌ఐసీ డబ్బులు కలిపితే మొత్తం రూ.8 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కరెంట్‌ బిల్లులు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టేషన్‌ రూ.2 కోట్లు చెల్లించాలి. ఇప్పటికే ఉద్యోగులు, రైతు సంఘాలు మంత్రి శిద్దా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితర నేతలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సోమవారం కలెక్టర్‌ను కలిసి విన్నవించి మరోమారు ఆందోళనకు దిగేందుకు ఉద్యోగులు, రైతులు సిద్ధమౌతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement