సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బ్లాక్ మెయిల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు తలొగ్గారా? ఆగమేఘల మీద జీఓ జారీ చేసి ఎంపీని బుజ్జగించారా? జేసీ వైఖరి, చంద్రబాబు తీరుపై ఇద్దరు ఎమ్మెల్యేలు అలక వహించారా? జేసీ ఉంచిన మూడు డిమాండ్లలో తక్కిన రెండింటినీ చూసి రాజీనామా చేస్తామని వారు కూడా అధిష్టానానికి సంకేతాలు పంపారా? ‘అనంత’లో గురువారం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ‘జేసీ అలక–రాజీ..డ్రామా’కు సంబంధించి తొలి అంకానికి తెరపడింది. అయితే రాజీనామాపై స్పష్టత ఇవ్వకుండా, నేటి సాయంత్రం వరకూ వేచి చూడాలని జేసీ ప్రకటన చేయడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అనంతపురం పాతూరులోని తిలక్‌నగర్, గాంధీనగర్ రోడ్ల విస్తరణకు సంబంధించి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య రెండేళ్లుగా ప్రత్యక్షపోరు నడుస్తోంది. విస్తరణ చేయాలని జేసీ, వద్దని చౌదరి ఎవరికి వారు పట్టువదలకుండా ఉండిపోయారు. గతంలో సీఎం ఇద్దరినీ పిలిచి సయోధ్య కుదిర్చినా ఫలితం లేకపోయింది. విస్తరణ అంశంలో జేసీపై చౌదరిదే పైచేయి కావడంతో కొన్ని నెలల కిందట రాజీనామా చేస్తానని జేసీ ప్రకటించారు. ‘తానో అట్టర్‌ఫ్లాప్ ఎంపీని అని, స్పీకర్‌కు రాజీనామా ఇస్తాన’ని చెప్పారు. ఆ వెంటనే ప్రభుత్వం రోడ్ల విస్తరణకు సంబంధించి త్రిసభ్య కమిటీని నియమించింది.
పార్టీలో తన మాట చెల్లుబాటు కాలేదనే నిర్ణయానికి వచ్చిన జేసీ
రోడ్ల విస్తరణ తర్వాత మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. అహుడా చైర్మన్ పదవిని ఇస్తామనే హామీతోనే గురునాథ్‌రెడ్డి టీడీపీలో చేరారు. ఆర్నెల్లు గడిచినా చైర్మన్‌గిరిపై నిర్ణయం తీసుకోలేదు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చేలా సీఎంతో జేసీ సంప్రదింపులు జరిపారు. మహానాడు సందర్భంగా పార్టీలో చేరేందుకు భారీగా కార్యకర్తలతో గుప్తా తరలివెళ్లారు. గుప్తా చేరితో ఎమ్మెల్యే పదవులకు తామూ రాజీనామా చేస్తామని జీడీ జనార్ధన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. దీంతో గుప్తా చేరిక వాయిదా పడింది. ఈ మూడు అంశాలపై కినుక వహించిన జేసీ అవిశ్వాస తీర్మానాన్ని అస్త్రంగా చేసుకున్నారు. పార్టీలో తన మాటకు విలువలేనప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సీఎంకు చెప్పి పార్లమెంట్‌కు వెళ్లకుండా ఉండిపోయారు. డిమాండ్ల సాధనకు బ్లాక్‌మెయిల్ చేసినట్లు వ్యవహరించారు. గురువారం జేసీఅంశం ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మాణానికి దేశవ్యాప్తంగా ఇతర పార్టీల మద్ధతు చంద్రబాబు అడుగుతున్న నేపథ్యంలో సొంతపార్టీ ఎంపీ గైర్హాజరైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించి జేసీ డిమాండ్లకు చంద్రబాబు తలొగ్గారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పిలిపించి చర్చించారు. సాయంత్రానికి పాతూరు రోడ్ల విస్తరణకు నిధులు కేటాయిస్తూ జీఓ జారీ చేశారు. ఆ తర్వాత తాను ఢిల్లీకి బయలుదేరుతున్నట్లు జేసీ ప్రకటించారు. ఒక ఎంపీ బ్లాక్‌మెయిల్ చేస్తే ఏకంగా సీఎం లొంగిపోవడం, జీఓ జారీ చేయడంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
రాజీనామాపై స్పష్టత ఇవ్వని వైనం
గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన జేసీ, అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొంటున్నానని చెప్పారు. ఓటింగ్ తర్వాత రాజీనామా చేస్తారా? అని అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ..‘రేపు సాయంత్రం వరకూ వేచి చూడండి.. తెలుస్తుంది’ అని డ్రామాకు తెరదించకుండా ఉత్కంఠ రేపారు. సీఎం ముందు జేసీ ఇంకొన్ని డిమాండ్లు పెట్టారని, వాటి సాధనకు రాజీ‘డ్రామా’ ఆడుతున్నారని జేసీని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలలో ఇద్దరు ‘సాక్షి’కి తెలిపారు. తక్కిన డిమాండ్లపై చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకుంటే, తాము ఓ నిర్ణయం తీసుకోవల్సి వస్తుందని సన్నిహతులతో చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారం చూస్తే ‘అనంత’ టీడీపీలో చంద్రబాబు కొత్త చిచ్చు రగిల్చారని స్పష్టమవుతోంది. ఏదేమైనా గురువారం రోజంతా ‘అనంత’లో తీవ్ర ఉత్కంఠ రేపిన జేసీ వ్యవహారం.. శుక్రవారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment