ఆ పాపం బాబుదే
ఎన్టీఆర్ ఆశయానికి తూట్లు పొడిచి నిషేధాన్ని ఎత్తేశారు
ఆనాడు ఎంత వద్దన్నా వినిపించుకోలేదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే డా.వెంకటేశ్వర్‌రావు
‘‘చంద్రబాబునాయుుడు మద్య నిషేధాన్ని ఎత్తివేసి గ్రామాల్లోచిచ్చు పెట్టారు. టీడీపీ ఆవిర్భావం, ప్రజల్లో వచ్చిన ఆదరణకు ప్రధాన కారణం మూడు అంశాలే. ఒకటి రెండు రూపాయలకు కిలో బియ్యం, మరోటి సంపూ ర్ణ మద్య నిషేధం, ఇంకోటి రూ.50కి పేదలకు ఉచిత విద్యుత్. కానీ... ఈ మూడింటికీ చంద్రబాబు పాలనలో చరమగీతం పాడారు. దీనికోసం పార్టీలోని సిన్సియర్ లీడర్లను దూరం చేసుకున్నారు. అన్నగారు ఉన్నప్పుడు నిషేధం కచ్చితంగా అమల్లో పెట్టారు. చాలా ఇబ్బందులు, ఒత్తిళ్లు వచ్చినా.. సారా దుకాణాలను రద్దు చేశారు. సరిగ్గా 1995 జనవరి 16న మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాత సీఎం పీఠం కోసం వైస్రాయ్ హోటల్ నుంచి చక్రం తిప్పిన చంద్రబాబు.. 1995 సెప్టెంబర్ 1న కుర్చీ ఎక్కారు. అప్పటి నుంచి మద్యం వ్యాపారులు, సారా కాంట్రాక్టర్లు బాబుగారి కోటరీలో చేరిపోయారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేతబట్టుకుని అన్నగారి ఆశయాలన్నీ బురదలో పోశారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మద్యం సరఫరాపై కాంట్రాక్టర్లు, వ్యాపారులకు చాటుమాటుగా అవకాశం కల్పించారు. చివరికి 1997 జూలై 7న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సరిగ్గా 12 రోజుల ముందు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి నేను కూడా వెళ్లా. ఆ మీటింగ్‌లో నేనొక్కడినే చాలా వాదించాను. నిషేధాన్ని ఎత్తి వేయరాదని చెప్పా. కానీ... నన్ను బయటకు వెళ్లాలన్నట్లుగా పరిగణించారు. ఆ తర్వాత నిషేధం ఎత్తివేస్తున్నారని తెలియగానే చంద్రబాబుకు దాదాపు 4 పేజీల లేఖ రాశా. దీంతో నన్ను పార్టీలో వ్యతిరేకుడిగా చూశారు. నాకు మళ్లీ టికెట్ కూడా ఇవ్వలే. టికెట్ కోసం వెళ్తే కూడా పట్టించుకోలేదు. మద్య నిషేధం ఎత్తివేశాక.. ఊరూరా వుద్యాన్ని విచ్చలవిడిగా దొరికేలా చేశారు. బెల్ట్ దుకాణాలకు పర్మిషన్ ఇప్పించారు. ఇప్పుడు మద్యం ప్రతీ ఊళ్లో దొరికేందుకు ఆద్యుడు అక్షరాలా నూటికి నూరుపాళ్లు చంద్రబాబే కారణం.