అడుగడుగునా అరాచకాలే | TDP Criticized By People In Ongole | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అరాచకాలే

Published Thu, Apr 11 2019 10:51 AM | Last Updated on Thu, Apr 11 2019 10:51 AM

TDP Criticized By People In Ongole - Sakshi

కమ్మపాలెంలో సంఘటన..

సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రంలోనే అడుగడుగునా అరాచకం తాండవించింది. అక్రమాన్ని ప్రశ్నించినా, నోరు మెదిపినా అటు జైలుకో లేక  ఇటు గృహ నిర్బంధమో తప్పని పరిస్థితులు. సాక్షాత్తు ప్రభుత్వం నిరసనలకు దిగితే భద్రత కల్పించిన పోలీసు యంత్రాంగం, ప్రతిపక్షం, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా వెంటాడి కేసులు నమోదు చేసిన ఘటనలు ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను సహించిన జనం ఎన్నికల వేళ తమదైన తీర్పు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.

మేమింతే..మారమంతే..
జిల్లా పరిషత్‌కు వెయ్యికోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన జిల్లా పరిషత్‌ కార్యాలయం స్థానంలో సొంత భవనం కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందుకు మహాత్మాగాంధీ కాంప్లెక్స్‌ పేరుతో పంచాయతీరాజ్‌ కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండాలని తీర్మానించారు. ఈ మేరకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కానీ ఆ స్థలంపై అధికార పార్టీ కన్నుపడింది. ఇంకేముంది జెడ్పీ కార్యాలయ నూతన భవనానికి అనుమతులు రాకుండా అడ్డుకున్నారు. అంతేనా...ఆ స్థలాన్ని తమ పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వయానా ఈదర హరిబాబును కలిసి అభ్యర్థించడం, దానిని ఈదర హరిబాబు సమర్థనీయంగా అడ్డుకున్న విషయమూ చర్చనీయాంశమే.

ప్రభుత్వ భూములపై పెత్తనమేంటి..?
స్థానిక కేశవరాజుకుంటకు పడమర భాగంలో ఉన్న ప్రాంతంపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ భూమిలోకి అడుగుపెట్టారు. హద్దురాళ్లు వేసుకుంటూ నిర్మాణాలు ప్రారంభించారు. అయితే అప్పటికే ఆ భూముల్లో పట్టాలు ఉన్న వారు తమ భూములంటూ అడ్డుకోగా వారిని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో వైఎస్సార్‌ సీపీ నేతలు పేదలకు అండగా ఉండి, అసలు ఆ భూమి ఎవరిదంటూ ఆరా తీయడం ప్రారంభించారు. మరో వైపు ప్రజలు గట్టిగా నిలదీయడంతో కొంతమంది అధికార పార్టీ నేతలు పట్టాలను బయటపెట్టారు. తీరా వాటిని చూస్తే కనీసం సంతకాలు కూడా లేనవి కొన్నయితే మరికొన్నింటిపై తహసీల్దార్‌ చిరంజీవి సంతకం పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఆయన మాత్రం తాను పట్టాలు ఇవ్వలేదని పేర్కొనడం కొసమెరుపు.

ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు వచ్చిన వారిని తమ సమక్షంలోనే విచారించాలని, వారిని ఎవరు పంపించారో నిగ్గుతేల్చాలంటూ కేశవరాజుకుంట, చినమల్లేశ్వర కాలనీకి చెందిన పలువురు మహిళలు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో తమ విధులను అడ్డుకుంటారంటూ ఏకంగా 40 మందిపై కేసులు పెడుతున్నట్లు తాలూకా పోలీసులు పేర్కొన్నారు. తీరా విచారిస్తే ఆ భూమి ఇంకా ఎన్‌ఎస్‌పీ స్వాధీనంలోనే ఉంది. అది రెవెన్యూకు కన్వర్షన్‌ కాలేదు. మరి..పట్టాలు ఎలా చెల్లుబాటవుతాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసులు మౌనం వహించారు. కానీ తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారంటూ పలువురు కొనుగోలుచేసిన డాక్యుమెంట్లతో ఫిర్యాదులు చేసినా నేటికి వాటిపై కదలిక లేకపోవడానికి కారణం కేవలం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండడమేననే భావన వ్యక్తం అవుతోంది. 

ఒక్కొక్కరికి ఒక్కో రూలా..?
ప్రత్యేక హోదా కావాలంటూ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినా పోలీసులు కేసులు నమోదుచేసిన దాఖలాలు లేవు. కానీ వైఎస్సార్‌ సీపీ నాయకులు కొద్దిసేపు బస్సులను అడ్డుకున్నారంటూ వారిని పశువులు తోలే వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించి దోర్నాలకు తరలించి కేసులు నమోదుచేసిన అనంతరం వదిలిపెట్టిన ఘటనలు నేటికి చిరపరిచితమే. 

చిరు వ్యాపారులపై ప్రతాపమా..? 
రంజాన్‌ మాసం పర్వదినాన ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో అల్లాను పూజించే ముస్లింలపై మున్సిపల్‌ అధికారులు విరుచుకుపడ్డారు. కనీసం ఏంటనేది చెప్పకుండా దుకాణాలను ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేశారు. షాపులను కూల్చవద్దంటూ ముస్లింలు వేడుకున్నా వినలేదు. దశాబ్దాల తరబడి ఊరచెరువు కట్టనే ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్న వారి షాపులను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దీంతో ఆ రంజాన్‌ మాసంలో ముస్లింలు పడిన ఇక్కట్లు చెప్పేవీ కావు. స్థలాలకు పట్టాలు ఉన్నాయని చెప్పినా వాటిని చూపించగా అవి చెల్లవంటూ నగరపాలక సంస్థ కమిషనర్‌ దుకాణాలను కూల్చేశారు. అయితే ఇదంతా తనకు తెలియకుండా జరిగిందంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తూనే మరో వైపు కోర్టులో ముస్లింలకు ఆ స్థలం దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. 

అధికారం అండగా.. అడ్డగోలుగా..
ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్‌ రాజీనామాతో కొత్తనేతను ఎన్నుకోవాల్సి వచ్చింది. పట్టుమని 18 మంది మాత్రమే ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. కానీ శాంతిభద్రతల సమస్య తలెత్తే వ్యవహారం ఉందంటూ చివరకు సహకార శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి పాలకవర్గ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇచ్చేంత వరకు పోలీసులు వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా మారింది. కేవలం 18 మంది వ్యక్తులకు భద్రత కల్పించలేకపోతే ప్రస్తుతం ఎన్నికలను ఏ విధంగా సజావుగా నిర్వహించగలుగుతారా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఓ పద్ధతి, పాడు లేకుండా..
ఆర్టీసీలో సిటీ సర్వీసులు ఉండాలంటూ నగర పౌరులు ఎప్పటినుంచో పోరాటం చేస్తూ వచ్చారు. చివరకు మంత్రి శిద్దా రాఘవరావు హయాంలో వాటిని ఏర్పాటుచేశారు. తూర్పునాయుడుపాలెం ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి బయల్దేరిన బస్సు గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ఉన్న మంత్రి ఫ్యాక్టరీ వద్దకు నడిచింది. దూరం విపరీతంగా ఉండడం, కేవలం నాలుగు సర్వీసులు మాత్రమే రెండు ప్రధాన రూట్లలో తిప్పడంతో ప్రజల ఆశలకు భంగం వాటిల్లింది. దీంతో ఆదాయం తక్కువుగా ఉందంటూ కనీసం మంత్రికి కూడా తెలియకుండానే ఆర్టీసీ అధికారులు సిటీ సర్వీసులకు మంగళం పాడేయడం, అనంతరం ఆటో చార్జీలు పెరిగిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆ తరువాత ఇప్పటి వరకు సిటీ బస్సుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఒంగోలులో సిటీ బస్సుల ఆవశ్యకత ఎంతో ఉన్నా ప్రజాప్రతినిధులెవ్వరూ ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. ఈ క్రమంలో  అరాచకాలు స్వస్తి చెబుదాం..ప్రజాస్వామ్యానికి పట్టం కట్టుకుందాం అంటూ ప్రజల నుంచి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

అంతా ఏకపక్షమే..
ఫ్లెక్సీలు చించారనే అనుమానంపై వైఎస్సార్‌ సీపీ నేతలకు చెందిన పలువురు యువకులను అదుపులోనికి తీసుకొని 24 గంటల పాటు నిర్బంధించారు. కానీ ట్రంకురోడ్డులో ఫ్లెక్సీలను చించడంతో పాటు మరుసటి రోజు కార్యక్రమం జరగకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేసినా స్పందించలేదు. మరుసటి రోజు కేవలం కొద్దిమంది ఎలాగైనా వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని యత్నించడం, వారిని నిలువరించడంలో వైఫల్యం చెందిన పోలీసులు తీరా సమస్య ఉధృతరూపం దాల్చిన తరువాత కూడా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంయమనం వహిస్తే చివరకు వారిపైనే కేసులు నమోదుచేసి జైలుకు పంపించిన ఘటనల పట్ల జనంలో చర్చలు నడుస్తున్నాయి.

ఓట్ల చేర్పులు, మార్పులకు సంబంధించి ఫారంలు సమర్పించాలనుకుంటే వ్యక్తిగతంగా వారే హాజరుకావాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఆగడాలు ఆగలేదు. చివరకు ఓ మహిళా బీఎల్‌ఓ అధికార పార్టీ నేత వాసు ఒత్తిడికి తట్టుకోలేక పడిపోయింది. ఈ మేరకు ఆమె తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేసినా నేటికి దానిపై చర్యలు లేవు. కానీ గంపగుత్తగా దరఖాస్తులు మీవద్ద ఎందుకు ఉన్నాయంటూ వాటిని తీసుకొని ప్రశ్నించినందుకు టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదవడానికి అధికార పార్టీ ఒత్తిళ్లే పనిచేశాయని విమర్శలు నేటికి వినిపిస్తున్నాయి.

డెయిరీ సర్వనాశనం.. 
ఒంగోలు డెయిరీ ఎవరి పాలనలో తీవ్ర సంక్షోభానికి లోనైంది, డెయిరీ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికార పార్టీ ఎందుకు చిత్తశుద్ధితో ముందుకు రాలేదు, లాభాలలో ఉన్న డెయిరీ  నష్టాల బాటలో పట్టడానికి కారణాలు ఏమిటి, కారకులు ఎవరనే అంశంపై నేటికి కనీసం కమిషన్‌ కూడా లేకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఎంతమంది పాల రైతులు తమ డబ్బులు నేటికి పొందలేకపోయారంటూ చర్చించుకుంటున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

షాపులను కూల్చేస్తున్న దృశ్యం

2
2/2

వద్దని వేడుకుంటున్న చిరువ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement