చరిత్రకు చెద!
►పతనావస్థకు చేరిన ఒంగోలు డెయిరీ
►రైతుల శ్రమ ‘చల్లా’పాలు
►మూడేళ్లలో రూ.80 కోట్లకు పైగా అప్పులు
►రైతుల పాల బకాయిలు చెల్లించలేని దుస్థితి
►అధికార పార్టీ సేవలో తరిస్తున్న పాలకవర్గం
►ఆస్తుల తనఖాకు మరోమారు యత్నం
►ఆదుకోక పోతే మూతే..
ఒంగోలు : ఒంగోలు డెయిరీ 1974 సంవత్సరంలో ఒక చిల్లీ పాయింట్‌గా ప్రారంభమైంది. 1978లో కో ఆపరేటివ్ యూనియన్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా 423 రిజిస్ట్రేషన్ గ్రామ సంఘాలు, 120 కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటికి సొంత భవనాలను నిర్మించారు. 1985 నుంచి డెయిరీ బలోపేతం లక్ష్యంగా రైతులు వారంలో ఒకరోజు ఉచితంగా పాలు పోశారు. తొలుత ఆ డబ్బులతో 6.90 ఎకరాల స్థలం కొన్నారు. 1987లో ఎన్‌డీడీబీ సహకారంతో ఏషియాలోనే పెద్దదైన పాలపొడి కేంద్రం ఏర్పాటు చేశారు. రోజుకు 30 టన్నుల పాలపొడి ఉత్పత్తి కెపాసిటీతో నిర్మించారు. ఆ తరువాత 70 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. కంభం, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి, కొండమంజులూరులో చిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒంగోలు డెయిరీకి సంబంధించి రూ.450 కోట్ల ఆస్తులు సమకూర్చారు. 2006 నుంచి 2013 వరకు పాల ఫ్యాక్టరీకి పెట్టిన పెట్టుబడి 40 కోట్ల రూపాయలు. బకాయిలు తీరేవరకు ఎన్‌డీడీబీ డెయిరీని నడిపింది. అప్పటికి ఒక్క రూపాయి కూడా డెయిరీ పరిధిలో అప్పు లేకపోవడం గమనార్హం.
కంపెనీ యాక్ట్ కొంప ముంచింది..
2013లో నిబంధనలకు విరుద్ధంగా ఒంగోలు డెయిరీని చైర్మన్ చల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. 423 గ్రామ సంఘాల్లో మెజార్టీ సంఘాల అనుమతి లేకుండా కేవలం పది సంఘాల మద్దతుతో ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా కో ఆపరేటివ్ శాఖ ఎన్‌ఓసీని నిబంధనలకు విరుద్ధంగా తెల్ల కాగితంపై డీసీఓ సంతకంతో తీసుకున్నారు. ఈ విషయమై అప్పట్లో ఉన్నతాధికారులు డీసీఓను సస్పెండ్ చేశారు. 2014 నాటికి డెయిరీ ఐదుకోట్ల రూపాయల లాభాల్లో ఉందని ప్రకటించిన పాలకవర్గం అప్పట్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఒంగోలు వచ్చిన టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడుతో రైతులకు బోనస్‌లు ఇప్పించి సంబరాలు చేసింది.
టీడీపీ సేవలో పాలకవర్గం..
ఒంగోలు డెయిరీ రైతులకు మూడు నెలలుగా రూ.13 కోట్ల మేర పాల బకాయిలు, ఉద్యోగులకు రూ.3 కోట్ల జీతాలు ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ప్రస్తుతం రూ.80 కోట్లకు పైగానే డెయిరీ అప్పుల్లో కూరుకుపోయింది. గడచిన మూడేళ్లలోనే డెయిరీ ఇంత పెద్ద స్థాయిలో అప్పుల్లో కూరుకుపోవడానికి పాలకవర్గం అక్రమాలకు పాల్పడటమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పాలకవర్గం మూడు పెద్ద కార్లు కొనుగోలు చేసి దుబారా ఖర్చులను మరింతగా పెంచింది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ఇదే కార్లను వాడుతూ పెట్రోల్, డీజిల్ ఖర్చును డెయిరీ ఖాతాలోనే జమ చేసినట్లు సమాచారం. ఇక టీడీపీ సమావేశాలకు పాలపొడి, మజ్జిగ, వెన్న సైతం ఈ డెయిరీ నుంచే సరఫరా చేశారు. అధికారపార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ మెయింటెనెన్స్ ఖర్చును డెయిరీ నుంచే ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ సమావేశాలు జిల్లాలో ఎక్కడ జరిగినా భోజన ఖర్చుల్లో డెయిరీ భాగస్వామ్యం ఉన్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ జిల్లా ముఖ్య నేతల వేడుకల ఖర్చులో అగ్రభాగం డెయిరీ నుంచే జమ అయినట్లు ప్రచారం ఉంది.
కొత్త అప్పుల కోసం వేట...
ఒంగోలు డెయిరీని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు డెయిరీ ఆస్తులను తనఖాపెట్టి మరిన్ని కొత్త అప్పులు తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల సిండికేట్ బ్యాంకులో రూ.20కోట్ల రుణాలకు ప్రయత్నించగా, సంక్షోభంలో ఉన్నట్లు తెలుసుకొని, చివరి నిముషంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. భంగపాటుకు గురైన పాలకవర్గం ప్రత్యామ్నాయంగా ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐలో కూడా రుణాలు తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం పాలకవర్గం కలిసి అప్పులు పుట్టించాలంటూ వేడుకున్నట్లు తెలుస్తోంది.
మూత దిశగా డెయిరీ..
రోజుకు రెండు లక్షల లీటర్ల పాల సేకరణతో కళకళలాడిన డెయిరీ ప్రస్తుతం పదివేల లీటర్లు సేకరించమే గగనంగా మారింది. రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వారంతా ప్రైవేట్ డెయిరీలకు పాలు పోస్తున్నారు. పాల ఫ్యాక్టరీ పరిధిలో 83 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 300 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నా వారికి పని లేకుండా పోయింది. రోజులో అరగంట కూడా ఫ్యాక్టరీ పనిచేసిన దాఖలాలు లేవు. డెయిరీ నమ్మకం కోల్పోవడంతో ఇతర జిల్లాల వారు పాలు సరఫరా చేసే పరిస్థితులు లేవు.
పాలకవర్గం మారితేనే పూర్వవైభవం
గతంలో మాదిరి ఫ్యాక్టరీకి పాలువస్తే ఏడాదికి రూ.40కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండేది. ఈ లెక్కన రెండేళ్లు సక్రమంగా డెయిరీని నిర్వహించినా అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న ప్రస్తుత పాలకవర్గానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి చేయూత ఇచ్చినా అది కూడా దుర్వినియోగమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమర్ధవంతమైన పాలకవర్గాన్ని నియమించి డెయిరీని ముందుకు నడిపించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.