ఇక్కట్ల ‘పాలు’ | Dairy farmers are suffering from financial problems | Sakshi
Sakshi News home page

ఇక్కట్ల ‘పాలు’

Published Sun, May 27 2018 4:23 AM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM

Dairy farmers are suffering from financial problems - Sakshi

ఒంగోలు డెయిరీ..పాడి పరిశ్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్రకాశం జిల్లా రైతులకు కొన్నేళ్ల పాటు ఆదరువుగా ఉన్న సహకార సంస్థ. రైతుల సంక్షేమానికి తోడ్పడుతూ లాభాల బాటలో పయనిస్తున్న డెయిరీని కో ఆపరేటివ్‌ సొసైటీ నుంచి కంపెనీ యాక్టులోకి మార్చి పథకం ప్రకారం క్రమంగా నిర్వీర్యం చేశారు. పాలకవర్గం, అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం వేలాది మంది రైతుల సంక్షేమాన్ని, ఉద్యోగుల జీవితాలను పణంగా పెట్టారు. డెయిరీ నిధులు పక్కదారి పట్టించి దుబారాగా ఖర్చు చేసి..  ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా నష్టాల ఊబిలోకి నెట్టారు.  ఏడాదిగా పాలుపోసిన రైతులకు, ఆరు నెలలుగా ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వారిని ఇక్కట్లపాలు చేశారు. బకాయిల కోసం ఎన్ని ఆందోళనలు చేసినా పాలకవర్గానికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. అప్పుల బాధతో మనోవేదనకు గురై ఓ పాల ఏజెంట్‌ గుండెపోటుతో మృతిచెందగా.. పాడి రైతులు, ఉద్యోగుల కుటుంబాల వెతలు అయితే వర్ణనాతీతం. 

ఒంగోలు టూటౌన్‌/యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలో ఒంగోలు డెయిరీ పరిధిలో దాదాపు 450 వరకు పాల సొసైటీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 30 వేల మంది వరకు పాలరైతులు ఉన్నారు. వీరంతా పాడినే నమ్ముకుని డెయిరీకి గత కొన్నేళ్లుగా పాలు పోస్తూ వస్తున్నారు. పాడి మీద ఆధారిపడి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. వీరికి ఏడాది కాలంగా డెయిరీ రూ.12 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కసారిగా పాల బకాయిలు ఆగిపోవడంతో ఆయా రైతుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది. నేటికీ పాల రైతులు తమ బకాయిలు చెల్లించాలని ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. డెయిరీ చైర్మన్‌ను ముట్టడించారు. ఆయన గదికి, డెయిరీ ఎండీ గదికి తాళాలు వేసి మరీ నిరసన తెలిపారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆందోళనలు చేశారు. దీంతో సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లింది. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఒంగోలు డెయిరీపై మాట్లాడతారని అందరూ ఆశగా ఎదురు చూసినా నిరాశే మిగిలింది.

నిలిచిన గేదెల కొనుగోలు రుణాలు  
పాలరైతులతో పాటు ఒంగోలు డెయిరీ ద్వారా పాడి గేదెల రుణాలు తీసుకున్న రైతులు నాలుగు విధాలుగా చెడాల్సి వచ్చింది. ఒంగోలు విజయ బ్యాంకు ద్వారా పాడిగేదేల రుణాలు పొందిన రైతులు తొలివిడతగా ఒక గేదె తీసుకున్నారు. డెయిరీకి మాత్రం క్రమం తప్పకుండా పాలు పోస్తూ వచ్చారు. అలా పోసిన పాలలో బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయి డబ్బులు డెయిరీ మినహాయించుకుని బ్యాంకుకు చెల్లించలేదు. దీంతో బ్యాంక్‌ రెండో గేదె ఇవ్వడం ఆపేసింది. దీనిపై కూడా రైతులు పలుమార్లు పాత చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావును నిలదీయడంతో ‘‘రేపు, ఎల్లుండి, వచ్చే వారం చెల్లిస్తాం’’ అంటూ మభ్యపెడుతూ వచ్చారు. చివరకు నట్టేట ముంచారు. ప్రస్తుతం పాడి గేదెల రుణాలు తీసుకున్న రైతులు కుటుంబపోషణ కోసం ఉపాధి హామీ పథకం పనులకు పోతున్నారు. వీరికి వచ్చే కూలీ డబ్బులను బ్యాంకు మేనేజర్‌ అప్పు కింద జమ చేసుకుండటంతో చాలా మంది  రైతులు ఖంగుతిన్నారు. చేసేదేమీ లేక అసలు ఉపాధి హామీ పనికే పోవడం మానుకున్నారని టంగుటూరు మండలం పొందూరు పాల కేంద్రం సొసైటీ అధ్యక్షడు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. 

పేరుకుపోతున్న ఉద్యోగుల వేతన బకాయిలు
ఉద్యోగుల వేతన బకాయిలు నెలనెలకూ కొండలా పేరుకుపోతున్నాయి. నెలకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున ఆరు నెలల వేతనం రూ.3 కోట్ల వరకు  ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. విద్యుత్‌ బకాయిలు, ట్రాన్స్‌పోర్టు బకాయిలు ఇలా అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. పరిస్థితి రోజురోజుకూ ఆందోళన కలిగిస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఉద్యోగులు కలవరపడుతున్నారు. పాత చైర్మన్, కొత్త చైర్మన్‌ ఇద్దరూ డెయిరీ గురించి పట్టించుకోవడం లేదు. అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రభుత్వం కూడా దీనిపై ఎక్కడా స్పందించడం లేదు.

ఆది నుంచి టీడీపీ నాయకుల చేతుల్లోనే.. 
డెయిరీ స్థాపించినప్పటి నుంచి పాలకవర్గం ఎక్కువ కాలం టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. ప్రశ్నించే వారు లేకనే విలాసాలకు, విందులకు ఇష్టారాజ్యంగా డెయిరీ సొమ్మును ఖర్చు చేశారని పాల కేంద్రం సొసైటీ ప్రెసిడెంట్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. మొత్తం మీద డెయిరీ బకాయిలు 43 కోట్ల రూపాయలు ఉన్నట్లు గత డిసెంబర్‌లో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో తేల్చారు. కానీ వాస్తవంగా రూ.80 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ఉద్యోగులు, పాలరైతులు బల్లగుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం డెయిరీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఇప్పటి వరకు చేసిన అప్పులు చెల్లించకపోవడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు. అటు ఉద్యోగులు, ఇటు పాల రైతుల కుటుంబాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. 

పాల కేంద్రం మూత
యర్రగొండపాలెంలోని ప్రభుత్వ పాల కేంద్రం మూతవేసి దాదాపు 7 నెలలు కావస్తున్నప్పటికీ జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో పాల ఉత్పత్తిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పాల ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన రూ.1.30 కోట్ల బకాయిల గురించి ఎవరూ నోరు మెదపడంలేదు. రెండు రోజుల్లో పాలకేంద్రాన్ని తెరుస్తామని, పశుపోషకుల నుంచి పాలను సేకరించే కార్యక్రమాన్ని చేపడతామని స్థానికంగా కేంద్రంలో ఉండే కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పాలకేంద్రం పరిధిలో 6 మండలాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారు. 2,500 మంది ఉత్పత్తిదారులు ఉండే ఈ కేంద్రంలో 100 మంది పాలసేకరణ కార్యదర్శులు పనిచేస్తున్నారు. రోజుకు 7 వేల లీటర్ల మేర పాలు సేకరించే సామర్థ్యం ఉన్న ఈ కేంద్రం గత ఏడాది జూన్‌ నుంచి 550 లీటర్లకు పడిపోయింది. 

పాలుపోసిన డబ్బులియ్యలా..
ఒంగోలు డెయిరీకి పాలు పోస్తున్నాం. ఆరు నెలలుగా రూ.8200 పాలబాకీ అందాల్సి ఉంది. అడిగినప్పుడల్లా అదిగో ఇస్తాం..ఇదిగో ఇస్తామని చెప్తున్నారేగానీ ఇచ్చింది లేదు. వర్షాలు లేక కరువుతో ఇబ్బంది పడుతున్నాం. గ్రాసం కొని మేపుకోవటానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. నాలాగే ఎంతో మంది పాడి రైతులు డెయిరీ నుంచి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు.  
 – పాశం రమ, జమ్ములపాలెం, టంగుటూరు మండలం 

డెయిరీ నుంచి బకాయి రూ.1.40 లక్షలు రావాలి
ఒంగోలు డెయిరీకి 18 సంవత్సరాలుగా  పాలు పట్టి పంపుతున్నా. రూ.1.40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఏజంట్లకు భారీగా డెయిరీ నుంచి డబ్బులు రావాలి.  పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేక ఆందోళన చెందుతున్నారు. బిల్లులు వెంటనే అందించి రైతులను, ఏజంట్లను ఆదుకోవాలి.
– గల్లా కుమార్, డెయిరీ ఏజంట్, విశ్వనాథపురం, త్రిపురాంతకం మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement