డెయిరీ చైర్మన్ చల్లా, ఎండీ శివరామయ్యల భుజాలపై చేతులు వేసి ఫొటోలకు ఫోజులిస్తున్న చంద్రబాబు(ఫైల్)
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీని రోజు, రోజుకు పతనావస్థకు చేర్చాలన్న కుతంత్రానికి 2013లోనే బీజం పడింది. ఏవిధంగానైనా సరే డెయిరీని నాశనం చేయాలన్న కుట్రకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే అంకురార్పణ జరిగింది. అప్పటికే పుష్కర కాలంగా చల్లా శ్రీనివాసరావు డెయిరీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. టీడీపీకి చెందిన నేత కావటంతో చల్లాతోపాటు, అప్పటి ఎండీ మేడా శివరామయ్యను హైదరాబాద్ పిలిపించుకున్న చంద్రబాబు డెయిరీని ఎలాగైనా సరే నాశనం చేయాలన్నదే లక్ష్యంగా 2013లోనే వ్యూహం రచించారు.అప్పట్లో డెయిరీలోని కొందరు ఉద్యోగులు, కొందరు డైరెక్టర్లు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ‘సేవ్ ఒంగోలు డెయిరీ’ పేరుతో డెయిరీలో జరుగుతున్న అక్రమాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు చైర్మన్, ఎండీలు కలిసి దిగిన ఫొటో కూడా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.
ఆ ఫొటో చూస్తే చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పార్టీ నాయకుడు కాబట్టి సరే. ఒక సాధారణ డెయిరీ ఉద్యోగిపై ఎంత ఆప్యాయత కనబరుస్తున్నాడో చంద్రబాబు అన్నట్లు ఉంది. డెయిరీ ఎండీ మేడా శివరామయ్య, చైర్మన్ శ్రీనివాసరావుల భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసి మరి ఫొటోలకు ఫోజులిచ్చారు చంద్రబాబు. అప్పుడు ఒంగోలు డెయిరీకి పతనానికి భీజం పడిందన్న మాట. అప్పటి నుంచి డెయిరీ డైరెక్టర్లు కొందరు చైర్మన్ చల్లాను ఫేస్ బుక్‌లో ‘పాల మాల్యా’గా పేరు పెట్టి అతను డెయిరీని దోచుకున్న తీరును ఎండకట్టటం మొదలు పెట్టారు ఉద్యోగులు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒంగోలు డెయిరీని కాపాడండి చంద్రబాబూ అంటూ పోస్టింగులు పెట్టటం ప్రారంభించారు. అయినా కనికరం లేని చంద్రబాబు ఉద్యోగులు ఆందోళనలు చేసినా, డైరెక్టర్లు పోరాటాలు చేసినా, చివరకు అధికార టీడీపీకి చెందిన పాడి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేసినా చివరకు మునిగిపోయే వరకు పట్టించుకోలేదు. నాశనానికి కుట్రదారే తానైనప్పుడు ఆయన డెయిరీని ఎందుకు కాపాడుతారు. ఇప్పటికీ అధికారులతో కూడిన నూతన కమిటీ ఏర్పాటయినప్పటికీ ఏపీడీడీసీఎఫ్ నుంచి రూ.35 కోట్లు అప్పు ఇప్పించినప్పటకీ చివరకు నూతన అధికారులు, నూతన కమిటీ కలిసి నిధులు దుర్వినియోగానికి ఊతమిస్తున్నారు. చివరకు ఏదో విధంగా డెయిరీ తాకట్టులోకి వెళ్లటమే అంతిమ లక్ష్యంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పాల మాల్యా పాపాల చిట్టా..
♦ కర్ణాటక ఫెడరేషన్ నుంచి ఒంగోలు డెయిరీకి వచ్చే పాలని పొడిగా మార్చి (జాబ్ వర్క్) వారికి వెనక్కి ఇవ్వాల్సిన పొడి 700 టన్నులు సొంతానికి అమ్ముకున్నారు.
♦ 2016 ఏప్రిల్ 16న సేవ్ ఒంగోలు డెయిరీలో భాగంగా పాలమాల్యా నుంచి ఒంగోలు డెయిరీని కాపాడాలంటూ చంద్రబాబును డైరెక్టర్లు వేడుకున్నారు.
♦ చైర్మన్‌కు చెందిన వ్యక్తి చల్లా సాయికుమార్‌ను టెంపరరీ ఉద్యోగిగా తీసుకొని అత్యంత కీలకమైన పర్చేజ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చి దోచుకున్నారు.
♦ నెలకు రూ.50 వేలు జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులున్నా వారిని పక్కన పెట్టిమరీ దోపిడీ చేశారు.
♦ పాడి రైతుల పాల బకాయిలు చెల్లించకుండా విశాఖ డెయిరీ నుంచి రూ.2 కోట్లు తెచ్చుకొని కాజేశారు.
♦ 423 పాల సొసైటీలకు గాను కేవలం 10 సొసైటీల ఆమోదంతో సహకార పరపతి సంఘాన్ని కంపెనీ యాక్టులోకి మార్చిన ఘనుడు.
♦ 2013 జనవరి 27న ఆదివారం జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ నుంచి తెల్లకాగితంపై తీసుకున్న ఎన్‌ఓసీ చివరకు డీసీఓ కొండయ్య సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
♦ హైదరాబాద్‌లో అమ్మిన పాలు తన సొంతానికి రూ.3 కోట్లు వాడుకున్న చైర్మన్ చల్లా.
♦ డెయిరీ ఆస్తులు తనఖా పెట్టి ఆంధ్రాబ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల నుంచి దాదాపు రూ.40 కోట్లు రుణాలు తీసుకొని నేరుగా కాజేసిన వైనం.
♦ బ్యాంకులకు తాకట్టు పెట్టిన డెయిరీ నిల్వలు నిలువునా గోడౌన్ వెనుక గోడలు పగులగొట్టి అమ్ముకున్నారు.
♦ అప్పటి ఎండీ మేడా శివరామయ్య చైర్మన్‌కు సహకరించి అతని స్థాయిలో అతనూ దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. దోచుకున్న డబ్బుతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 50 ఎకరాలకు పైగా భూములు కొని చివరకు నూతనంగా డెయిరీ పెట్టేం దుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment