తమ బాధలు చెబుతున్న డెయిరీ మహిళా ఉద్యోగులు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ బాధితులైన పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు, పాలు సరఫరా చేసిన ట్రాన్స్‌పోర్టర్స్ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇంటి ముందు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి శిద్దా రెండు రోజుల నుంచి దాటవేత ధోరణితో వ్యవహరించటంతో సహనం కోల్పోయిన బాధితులు మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. శాంతియుతంగా, సామరస్య పూర్వకంగా నిరసన చేయాలని నిర్ణయించిన బాధితులు మంత్రి ఇంటి రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలంలో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. డెయిరీ బాధితులు చేపట్టిన నిరసనకు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి శిరిగిరి లలిత సంఘీభావం ప్రకటించారు. అధికార తెలుగుదేశం హయాంలో జిల్లాలోని సహకార సంఘాలను నిలువునా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
అందులో మొదటిది ఒంగోలు డెయిరీ అన్నారు. కోట్ల రూపాయలు దోచుకోవటానికి సహకార సంఘాల్లో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి తెచ్చి నిలువునా పాడి రైతులను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. పొందూరు సహకార సొసైటీ అధ్యక్షుడు వేజెండ్ల రామారావు మాట్లాడుతూ మంత్రి హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నారన్నారు. రెండు రోజుల్లో వచ్చి డైరెక్టర్ల చేత రాజీనామా చేయిస్తానన్న మంత్రి రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకుండా మళ్లీ పది రోజులని చెప్పి వెళ్లిపోవటం దారుణమని, అందుకే ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నాగులుప్పలపాడుకు చెందిన పాడి రైతు చుండూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ నెలల తరబడి గొడవలు లేకుండా పోరాటం చేస్తున్నామని అన్నారు.
రైతులకు మేలు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి ఒంగోలు డెయిరీని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. డెయిరీ పాలకమండలి చేసిన అవినీతి, అక్రమాల వల్ల డెయిరీలో పూర్తిగా నష్టపోయింది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులేనని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డెయిరీలో ఉద్యోగులు కూడా పార్టీవాళ్లేనని వాపోయారు. ఒంగోలు డెయిరీ పాలు రాష్ట్రంలోనే నాణ్యమైనవని డెయిరీ మహిళా ఉద్యోగులు వివరించారు. ప్రతి రోజూ 1.70 లక్షల లీటర్లు వచ్చే పాలు నేడు రోజుకు 700 లీటర్లకు దిగజారిపోయిందంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గుట్టుగా డెయిరీలో ఉద్యోగాలు చేసుకోవాల్సిన తాము చెట్ల కింద కూర్చొని తమ గోడు వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
శిబిరం వద్దకు మంత్రి శిద్దా...
మంత్రి ఇంటి ముందు డెయిరీ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న మంత్రి శిద్దా రాఘవరావు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లి వెంటనే హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న డెయిరీ బాధితులతో చర్చించారు. పది రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు పూనుకుంటానని చెప్పాను కదా ఇంటి ముందు నిరసన ఏమిటని మండిపడ్డారు. దీంతో పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు నెలల తరబడి సమస్యను సాగదీస్తున్నారని, డెయిరీ మూత పడే పరిస్థితికి చేరుకుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే వద్దకు వెళితే మండిపడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కొండ్రగుంటపై మండిపడిన మంత్రి: తెలుగుదేశం పార్టీ రైతు విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య డెయిరీలో పాడి రైతులు, ఉద్యోగులు పడుతున్న బాధులు గురించి చెబుతున్నప్పుడు మంత్రి శిద్దా రాఘవరావు ఆయనపై మండిపడ్డారు. డెయిరీ వల్ల పూర్తిగా టీడీపీకి చెందిన వారే పూర్తిగా నష్టపోయారని వాపోయారు. డెయిరీ వల్ల తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెడ్డపేరు వస్తుందని అనటంతో మంత్రికి కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంట్లోకి రాండి మాట్లాడుకుందామని మంత్రి లోపలకు వెళ్లారు. మంత్రి ఇంటికి వెళ్లకుండా నిరసన దీక్ష వద్దే నిరసనకారులు భీష్మించుకు కూర్చున్నారు. ఇవరూ ఇంట్లోకి రాకపోవటంతో మంత్రే నడుచుకుంటూ తిరిగి నిరసన శిబిరం వద్దకు వచ్చారు. నిరసనకారులతో మాట్లాడుతూ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నారాయణతోనూ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావుతోనూ చర్చించి శనివారం ముఖ్యమంత్రితో డెయిరీ విషయం మాట్లాడతామని వివరించారు. ఆదివారం కొందరు ముఖ్యులు వస్తే డెయిరీ సమస్యపై లోతుగా ఆలోచన చేద్దామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment