శిద్దా రాఘవరావు, మాగుంట శ్రీనివాసరెడ్డి, నందిగం సురేష్, శ్రీరామ్ మాల్యాద్రి
సార్వత్రిక ఎన్నికల సమరం చివరి ఘట్టానికి చేరింది. మైకుల హోరు.. హామీల జోరుతో ముందుకు సాగిన నేతలు.. తమ తలరాతలు ఎలా మారబోతున్నాయోనని ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. జన సేన ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా మూడు పార్లమెంట్, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు వారి గుణగణాలు, విజయావకాశాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఘన చరిత్ర ఉంది. రాజకీయ ఉద్యమాలకు పురిటి గడ్డ ఇది. ఎందరో ఉద్దండులు, మహామహులు ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ తరఫున శిద్దా రాఘవరావు బరిలో నిలిచారు. మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబం ఒంగోలు కేంద్రంగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాసేవ చేస్తోంది. శిద్దా రాఘవరావు పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు కేంద్రంగా నివాసం ఉంటూ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా.. శిద్దా రాఘవరావు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చెంది ఎంఎల్‌సీగా రాజకీయాల్లో కొనసాగారు. 2014లో దర్శి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన శిద్దా.. మాగుంట సహకారంతోనే ఆ ఎన్నికల్లో గట్టెక్కారని ఆయన సన్నిహతులే చెబుతుంటారు. శిద్దాకు రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇలా మాగుంట, శిద్దా.. జిల్లా రాజకీయాల్లో సుపరిచితులుగా ఉన్నారు.
శిద్దా
అందుబాటులో ఉన్నట్టే ఉంటారు. కొందరికే ఆయనను కలిసేందుకు అనుమతి ఉంటుంది. అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే కష్టమే. కొన్ని క్లిష్టతరమైన సందర్భాల్లో జనంపై చిర్రుబుర్రులాడతారు. జనం సమస్యలపై ఇచ్చే అర్జీల సంగతి పట్టించుకోరు. మంత్రిగా ఆయన ఇక్కడ సాధించిన విజయాలు అతి తక్కువే. కలుపుగోలుతనంగా ఉండరన్న విమర్శలున్నాయి. ఇటీవల యర్రగొండపాలెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడి తన నిజ రూపాన్ని ప్రదర్శించారని శిద్దా అనుచరులే అంటున్నారు. చేసే సాయం పది మందికీ తెలిసేలా చేయడం శిద్దా నైజం. తనకు ఇబ్బంది వచ్చే అంశాల నుంచి తప్పుకోవడానికి ఎంతటి వారినైనా ప్రలోభపెట్టడంలో ఆయకు ఆయనే సాటి అనే విమర్శ ఉంది.
మాగుంట
సౌమ్యంగా ఉంటారు. పది మందితో కలిసి ముందుకు సాగుతారు. కార్యకర్తలను కూడా పేరు పెట్టి పిలుస్తారు. ఎంతటి వారినైనా గౌరవిస్తారు. పిల్లలతో పిల్లవానిగా, పెద్దలతో పెద్దగా, మేధావులతో తలలో నాలుకలా వ్యవహరిస్తారు. అందరితో కలిసి భోజనం చేస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు. ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నా లేచి మాట్లాడతారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే గుణం మాగుంట శ్రీనివాసరెడ్డిది.
వ్యాపారాల్లో దిట్టలు
మాగుంట శ్రీనివాసులురెడ్డి చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శిద్దా రాఘవరావుకు చీమకుర్తి గ్రానైట్‌తో పాటు పాలిషింగ్ యూనిట్ ఇతర వ్యాపారాలున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి పరిచయం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇరువురూ ధార్మిక కార్యక్రమాలకు కొంత నగదు వెచ్చిస్తున్నారు. మాగుంట కుటుంబం గత 30 ఏళ్ల నుంచి సేవా రంగంలో ఉండి తన సొంత నిధులతో ప్రజలకు తాగునీరు, విద్య అందిస్తున్నారు. శిద్దా రాఘవరావు ధార్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. శిద్దా ఎక్కువగా మఠాధిపతులు, పీఠాధిపతులకు సమయం, ధనం వెచ్చిస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
‘మాగుంట’కు ప్రజాభిమానం మెండు
జిల్లా ప్రజానీకంతో మాగుంట కుటుంబానిది విడదీయరాని బంధం. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతున్న వేళ తాగునీటికి సొంత నిధులు వెచ్చించి దప్పిక తీర్చారు. నేటికీ పలు ప్రాంతాల్లో ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత నీరు అందించే ఏర్పాట్లు చేశారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యాదాతగా పేరుపొందారు. ఒంగోలు నగర అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు.
వివాదాలకు దూరం
రాజకీయ వివాదాలకు మాగుంట ఎంత దూరంగా ఉంటారో.. శిద్దా కూడా అంతే. ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా మాగుంట ఆలోచిస్తారు. శిద్దా మాత్రం తన కుటుంబానికి ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో బేరీజు వేసుకుని ఆచితూచి అడుగు వేస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రజల నుంచి మంచితనాన్ని మాగుంట మూటగట్టుకున్నారు. శిద్దాకు గ్రానైట్ వ్యాపార రంగం నుంచి కొన్ని వివాదాలున్నా వాటిని బయటకు రానీయకుండా జాగ్రత్తగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. ఇటీవల ఒంగోలు పర్యటనకు వచ్చిన పవన్‌కళ్యాణ్ శిద్దా గ్రానైట్ వ్యాపారం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావించడం గమనార్హం.
నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి
► సామాన్యుడిగా ఎంపీ టికెట్ సాధించారు
► ప్రజలు తమవాడిగా భావిస్తున్నారు
► నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నారు
► ప్రతి సమస్యా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు
► హోదా వాణిని ఢిల్లీలో వినిపిస్తానని చెబుతున్నారు
► యువకుడు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు
► పార్టీకి ఉన్న సానుకూలత కలిసొస్తుందని నమ్ముతున్నారు.
శ్రీరామ్ మాల్యాద్రి, బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి
► ఆర్థిక బలంతోనే ఎంపీ టికెట్ సాధించారు
► ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు
► ఎంపీ అయ్యాక నియోజకవర్గంలో ఉన్నది చాలా తక్కువ
► సమస్యలపై అవగాహన లేదు
► హోదాపై పోరాడిన దాఖలాలు లేవు
► ఎన్నికల సమయంలోనూ అంతంతమాత్రం ప్రచారమే..
► టీడీపీపై వ్యతిరేకత ఉండడం ప్రతికూలాంశం
Comments
Please login to add a commentAdd a comment