సాక్షి, దర్శి (ప్రకాశం): సైకిల్ తొక్కి అలిసి పోయాయని... ఫ్యాన్ కింద చల్లగా ఉందని టీడీపీ పార్టీ పరిస్థితి, వైఎస్సార్ సీపీ పరిస్థితిపై ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్శి పట్టణంలో జరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ మాగుంట కుటుంబం 30 ఏళ్లుగా సేవలందిస్తుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రేమ, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు. తాను టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడాన్ని జీర్ణించుకోలేని మంత్రి శిద్దా రాఘవరావు తాను టీడీపీని మోసం చేశానని అంటున్నారని.. దర్శి నియోజకవర్గంలో వాళ్ల విషయాలన్ని నాకు తెలుసని హెచ్చరించారు. మాగుంట కుటుంబం ప్రజా సేవకే అంకితమని, ప్రస్తుతం ఫ్యాన్ స్పీడు 120 కిలో మీటర్లతో దూసుకు పోతుందని, ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, ఎంపీ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్‌మోహన్‌రెడ్డిని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు.
అఖండ మెజార్టీతో గెలిపించాలి: బూచేపల్లి
మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చలేదన్నారు. బాబు లాంటి మోసగాడిని ఇప్పటికి చూడలేదని, ఇకపై చూడలేమన్నారు. తొమ్మిదేళ్లు కలసిమెలసి కష్టాలు అనుభవించామని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగో పాల్‌ను, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నడూ లేని ఆదరణ: మద్దిశెట్టి
నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ పులివెందుల పులి అందరికి అన్న అయిన జగన్ అన్నకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి చరిత్రలో ఎప్పుడు లేని ఆదరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉందన్నారు. జన్మభూమి కమిటీలు అడ్డుపెట్టి వృద్ధులకు పింఛన్లు ఎగ్గొట్టారని, కనీసం గూడు లేని వారికి నివాసాలు కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సంక్షేమ ఫలాలన్ని టీడీపీ నేతలే దోచుకుతిన్నారని మండిపడ్డారు. మరో పది రోజులు ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో తనకు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బూచేపల్లికి చట్టసభల్లో స్థానం: వైఎస్ జగన్
తన స్నేహితుడు, సోదర సమానుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూచేపల్లి శివప్రసాదరెడ్డికి చట్టసభల్లో స్థానం కల్పిస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. అన్ని విధాలా శివప్రసాదరెడ్డికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఆయా కార్యక్రమాల్లో పార్లమెంట్ ఇన్‌చార్జి నేదురమల్లి రామకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దిరిసాల రాజకుమార్‌రెడ్డి, నియోజక వర్గ అబ్జర్వర్ అవ్వారు ముసలయ్య, మద్దిశెట్టి శ్రీధర్, రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర వైద్యవిభాగం అధ్యక్షులు గోసుల శివభరత్‌రెడ్డి, రాష్ట్ర రైతు సంఘ సెక్రటరీ మారెడ్డి సుబ్బారెడ్డి, పలగాని యలమందారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment