సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా మరోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున.. కనిష్టంగా గేదె పాలపై రూ.2.26, ఆవు పాలపై రూ.0.11 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.32, ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది.
ఈ పెంపు రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాలకు ఆదివారం నుంచి వర్తించనుంది. తద్వారా 65 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ తరఫున రాయలసీమలో కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇటీవలే సబర్కాంత్ యూనియన్ పాల సేకరణ ధరలను పెంచింది.
తాజాగా కైరా యూనియన్ పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా.. తాజా పెంపుతో కలిపి ఏడు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి.
కైరా యూనియన్ ప్రస్తుతం లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.84.26, ఆవు పాలకు రూ.42.27 చొప్పున చెల్లిస్తోంది. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ.42.38 చొప్పున రాయసీమ జిల్లాల పరిధిలోని పాడి రైతులకు కైరా యూనియన్ చెల్లించనుంది.
30 నెలల్లో 8.50 కోట్ల లీటర్ల సేకరణ
జగనన్న పాల వెల్లువ పథకం 2020 డిసెంబర్‌లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.96 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,549 గ్రామాలకు విస్తరించింది. 2116 ఆర్బీకేల పరిధిలోని 76వేల మంది నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తోంది.
8.50 కోట్ల లీటర్ల పాలను సేకరించగా.. పాడి రైతులకు రూ.378.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా.. అంతకు మించి ప్రస్తుతం లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవు పాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.3,395.18 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment