చంద్రబాబు ప్రభుత్వం హయాం..
రాష్ట్రంలో సహకార డెయిరీలను ప్రభుత్వమే చిదిమేసింది. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ ఎదుగుదల కోసం గ్రామ గ్రామాన వేళ్లూనుకొన్న సహకార డెయిరీలను ఆయన ప్రభుత్వమే నాశనం చేసేసింది. కొన్నింటిని తనకు అనుంగులుగా ఉండే వ్యక్తులకు అప్పజెప్పింది. చివరకు రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. పాలకు కనీస ధర కూడా అందక అల్లాడిపోయారు.
‘ఈనాడు’ విషం..
విషపు రాతల ‘ఈనాడు’కు ఈ వాస్తవాలు పట్టవు. ప్రజల సంక్షేమం అసలే పట్టదు. ఎంతసేపూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యం. అందులో భాగంగానే ‘అమూల్ మాకొద్ద’ంటున్నారంటూ విషపు రాతలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక..
మూతపడ్డ సహకార పాల డెయిరీలు పునరుద్ధరించి, పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ గ్రామాన మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి సహకార రంగాన్ని బలోపేతం చేసింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. లీటర్‌కు రూ. 4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం కింద లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూరుస్తోంది.
పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గిట్టుబాటు ధర వస్తోంది. అమూల్‌కు పాలు పోసే వారే కాదు.. అమూల్ రాకతో పాల సేకరణ ధరలు పెంచడం వలన ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్న పాడి రైతులూ లబ్ధి పొందుతున్నారు.
ప్రైవేటు డెయిరీల రైతులకూ లబ్ధి
అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకూ లబ్ధి చేకూరింది. అమూల్ పాల సేకరణ ధర పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ ధరలు పెంచాయి. అమూల్ ఇచ్చే ధరతో పోలిస్తే తక్కువే అయినా, వాటికి పాలు పోసే పాడి రైతులకు ఈ 30 నెలల్లో రూ.3,312.46 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది.
సహకార డెయిరీలకు చంద్రబాబు కాటు
హెరిటేజ్ డెయిరీ కోసం రాష్ట్రంలో సహకార డెయిరీ రంగాన్ని ఓ పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని కంపెనీలుగా ప్రకటించుకున్నారు. విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా ప్రకటించుకున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు లాభాల్లో ఉన్న ప్రభుత్వ డెయిరీలన్నీ బాబు హయాంలో మూతపడ్డాయి. 2017 జనవరి 23న కడప జిల్లాలోని పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణాలోని మినీ డెయిరీ–కంకిపాడు, 2019 మార్చి 15న చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లి డెయిరీ, మరో 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని అల్ట్రా హై ట్రీట్‌మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మిల్క్ చిల్లింగ్ సెంటర్ (ఎంసీసీ)తో పాటు 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూలు) మూతపడ్డాయి. రాష్ట్రంలోని పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి.
పాల సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. కోట్లాది రూపాయల విలువైన మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిల్లింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటిపై ఈనాడు పత్రిక ఏనాడూ చిన్న వార్తా రాయలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి పాలను సేకరించడమే నిలిపివేసింది. రూ.45 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టారు. అయినా బాబు సర్కారు నోరు మెదపలేదు.
సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాడి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాల సహకార సంఘాల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు (ఎండీఎస్) ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాలు సేకరిస్తున్నారు.
మూడు జిల్లాలతో మొదలైన పాల సేకరణ ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించింది. 20 – 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న ప్రైవేటు డెయిరీలు ప్రస్తుతం రోజుకు 5 – 6 లక్షల లీటర్లు సేకరిస్తుంటే, కేవలం 30 నెలల్లోనే అమూల్ సంస్థ రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలు రెండేళ్లకోసారి పాలసేకరణ ధరలు పెంచేవి. అమూల్ మూడు నెలలకోసారి పాల సేకరణ ధరలను సవరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఇలా 30 నెలల్లో ఏడు రెట్లు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.88, ఆవు పాలకు రూ.43.69 చెల్లిస్తున్నారు.
30 నెలల్లో గేదె పాలపై రూ.16.53, ఆవు పాలపై రూ. 9.49 మేర ధరలు పెంచారు. ఒక్క రూపాయి తక్కువ కాకుండా 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు ఆర్బీకేల ద్వారా ఇన్‌పుట్స్ అందిస్తున్నారు. మధ్యవర్తులు, వాటాదారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా ప్రోత్సాహకం, బోనస్ పంపిణీ చేస్తున్నారు. ఏటా 2 సార్లు లీటరుకు అర్ధ రూపాయి లాయల్టీ బోనస్ కూడా వస్తోంది.
పాడి రైతుల సంరక్షణ, నిర్వహణ కోసం రూ.40 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా స్వల్పకాలిక రుణాలందిస్తున్నారు. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలు నిర్మిస్తున్నారు.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment