చిత్తూరు విజయ డెయిరీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని పట్టాలెక్కించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. చంద్రబాబు తన పా‘పాల’ డెయిరీ హెరిటేజ్ కోసం చిత్తూరు విజయ డెయిరీని గుదిబండలా మార్చి మూయిస్తే.. దాని పూర్వవైభవం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదం తెలిపింది. త్వరలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పాడి రైతులు, కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
చిత్తూరు విజయ డెయిరీ ప్రస్థానమిలా..
చిత్తూరు కేంద్రంగా 50 మంది పాడి రైతులతో 1969లో ప్రారంభమైన విజయ డెయిరీ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. రోజుకు ఆరువేల లీటర్ల నుంచి 4 లక్షల లీటర్ల సేకరణకు దినదినాభివృద్ధి చెందింది. 68వేల మంది పాడి రైతు కుటుంబాలకు కల్పతరువుగా మారింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటన సందర్భంగా విజయ డెయిరీని సందర్శించారు.
పాడి గురించి ఆరాతీసి పాలద్వారా వచ్చే రాబడిని గ్రహించి హెరిటేజ్ కోసం అడుగులు వేశారు. చిత్తూరు డెయిరీ మూసివేసేందుకు పన్నాగం పన్నారు. టీడీపీ నేత, తన ముఖ్య అనుచరుడు దొరబాబుని డెయిరీ చైర్మన్‌గా నియమించారు. యూనియన్లు ఉన్నా ఎవ్వరూ నోరెత్తకుండా చేశారు. ఎండీ, మేనేజర్‌నూ తన వైపు తిప్పుకున్నారు. అనంతరం తన పథకాన్ని అమలుచేశారు.
లాభాల్లో ఉన్న ఈ డెయిరీని నష్టాల బాట పట్టించారు. ఎగుమతి అయ్యే టన్నుల కొద్దీ నెయ్యి, పౌడర్‌ను రహస్యంగా నిల్వచేసేవారు. అలా ప్రతిరోజూ 35 టన్నుల నెయ్యి, మరో 32 టన్నుల పౌడర్‌ని నిల్వ చూపించి టెండరుదారులకు తక్కువకే అప్పగించేవారు. ఇలా రోజువారి నష్టాలు పెరిగి చివరకు డెయిరీ మూతకు చంద్రబాబు కారణమయ్యారు.
రాజకీయ అవినీతి ఊబిలో..
చిత్తూరు డెయిరీలో గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు సహకార సంఘాల ఎన్నికలు ఒక పెద్ద రాజకీయ వ్యవహారంగా మార్చేశారు. దీంతో డెయిరీ అవినీతిలో కూరుకుపోయింది. ఫలితంగా రైతులకు సరఫరా చేసిన పాలకు బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయింది. పాడి రైతుల ఆందోళనలతో అతి కష్టంపై బిల్లులు చెల్లించేవారు.
చివరకు రైతులకు ఈ బిల్లులు చెల్లించలేక 2002 ఆగస్టు 31న చిత్తూరు విజయ డెయిరీ మూతపడింది. అదే సమయంలో ప్రైవేటు డైరీలు పుంజుకున్నాయి. కరువు కారణంగా పంటలు దెబ్బతింటుండటంతో జీవనాధారం కోసం ఎక్కువమంది రైతులు ఆవులను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ ప్రైవేటు డెయిరీలన్నీ ఏకమయ్యాయి. పాల ఉత్పత్తిదారులను దోపిడీ చేయటం ప్రారంభించాయి. ప్రభుత్వ సహకార సంఘాల నుండి పోటీరాకుండా బాబు చక్రం తిప్పేవారనే అనేక ఆరోపణలు ఉన్నాయి.
కావాలనే నష్టాలబాట
అప్పట్లో డెయిరీలో అంతా నిజాయితీగా పనిచేసేవాళ్లం. అవినీతికి పాల్పడేవారే లేరు. అయినా నష్టాలు చూపించారు. ఎవరో పనికట్టుకుని కావాలనే మూతేశారు. డెయిరీ మూసేయటంవల్ల అనేకమంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం తెరిపిస్తానంటోంది. డెయిరీకి పూర్వవైభవం తీసుకొస్తే సంతోషిస్తాం.
– రామచంద్ర, చిత్తూరు డెయిరీ కార్మికుడు
హెరిటేజ్ కోసమే..
చిత్తూరు విజయ డెయిరీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండేది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పాల పదార్థాలు తయారయ్యేవి. ప్రత్యేకంగా ఇక్కడి చీజ్‌కు మంచి గిరాకీ ఉండేది. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూసేశారు. మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 140 మందిని బయటకు నెట్టేశారు. కొందరు వీఆర్‌ఎస్ తీసుకున్నారు. మరికొందరు అనారోగ్యంతో మరణించారు. లాభాల్లో ఉన్నప్పటికీ కావాలనే రైతులకు పేమెంట్ ఇవ్వకుండా మార్కెటింగ్‌ని దెబ్బతీశారు.
– దశరథన్, టైమ్ స్కేల్ వర్కర్, విజయ డెయిరీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment