చంద్ర బాబూ... జిల్లాకు ఏం చేశారు ?
- హెరిటేజ్ కోసం విజయా డెయిరీని మూసేశారు
- లాభాల్లో ఉన్న చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని సర్వనాశనం చేశారు
- సొంత జిల్లాకు మేలు కంటే కీడే ఎక్కువ చేశారు
- వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్ ధ్వజం
- జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమ పాలన-నారాయణస్వామి
పెనుమూరు, న్యూస్‌లైన్: తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు లోకసభ అభ్యర్థి సామాన్య కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ స్థానం ఎన్నికల పరిశీలకులు,మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆమె పెనుమూరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
పులిగుంటీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్తరోడ్డు ఇండ్లు, ఠాణావేణుగోపాల పురం, సీఎస్ అగ్రహారం కాలనీ, చార్వాకానిపల్లె, చార్వాకానిపల్లె హరిజనవాడ, బీసీ కాలనీ, మంగళ కాలనీ, పెనుమురు చెక్ పోస్టు, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. పెనుమూరు రెడ్డి రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాకు చేసిన మేలు కంటే కీడు ఎక్కువన్నారు.
చంద్రగిరి మండలంలో ఉన్న హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు విజయా డెయిరీ మూసివేశారని ఆరోపించారు. అలాగే లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా కుప్పంలో పర్యటిస్తున్నప్పుడు ఉచిత కరెంట్‌పై హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని సీఎం అయిన వెంటనే తొలి సంతకంతో నెరవేర్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే చిత్తూరు డెయిరీని తెరిపిస్తానన్నారు.
మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లావాసులు తాగు,సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్‌ను, గంగాధరనెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి నారాయణస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తారన్నారు. అలాగే ఎన్టీఆర్ జలాశయం నుంచి మిగులు జలాలు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు అనుసంధానం చేయడానికి సప్లయ్ చానల్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీనెల్లూరు అభ్యర్థి నారాయణస్వామి మాట్లాడుతూ సీమాంధ్రలో 130 నుంచి 140 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకోవడం ఖాయం అన్నారు. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పారు. కుతూహలమ్మ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేను చేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు చెప్పి ఉంటే బాగుండేదన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యులు శైలజారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కారేటి గోవిందరెడ్డి, దూది కృష్ణమూర్తి, సాతంబాకం నరసింహారెడ్డి, పెద్దినేని గోపాల్ నాయుడు, మండల కన్వీనర్ మహాసముద్రం సురేష్‌రెడ్డి, మండల సేవాదళ్ కన్వీనర్ దూది రవికుమార్, మండల అధికార ప్రతినిధి చింతాచెన్నకేశవులు, మండల కార్యదర్శి పెద్దరాసిపల్లె నరసింహారెడ్డి మండల యూత్ కన్వీనర్ ఐరాల మురళీకుమార్‌రెడ్డి, మండల బీసీ సెల్ కన్వీనర్ మనోహర్, ఎస్సీ నాయకులు దామోదరం తదితరులు పాల్గొన్నారు.