CM YS Jagan Comments On Chandrababu Naidu At Chittoor Public Meeting - Sakshi
Sakshi News home page

‘చిత్తూరు’కు క్షీరాభిషేకం!

Published Wed, Jul 5 2023 3:59 AM | Last Updated on Wed, Jul 5 2023 1:37 PM

CM YS Jagan Comments On Chandrababu At Chittoor Public Meeting - Sakshi

చిత్తూరు పోలీసు పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం. , చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ శిలాఫలకం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇవాళ మనం తెరిపిస్తున్న చిత్తూరు డెయిరీ కథ ఎలాంటిదంటే.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ మనిషి తాను స్థాపించిన డెయిరీ కోసం, సొంత లాభం కోసం, సొంత జిల్లా రైతునైనా, పిల్లనిచ్చిన మామనైనా బలి పెట్టేస్తాడని చెప్పే మనిషి కథ ఇది! ఓ నీతిమాలిన రాజకీయ నాయకుడి కథ ఇదీ! ఒక గొప్ప మెడికల్‌ కాలేజీ మన చిత్తూరుకు వస్తుంటే అడ్డుకున్నది సాక్షాత్తూ ఈ చంద్రబాబునాయుడు, గజదొంగల ముఠా సభ్యుడైన ఈనాడు రామోజీరావు వియ్యంకుడే. స్థలాలివ్వకుండా ఈ గడ్డకు మంచి మెడికల్‌ కాలేజీ రాకుండా అడ్డుకున్న చరిత్ర వారిదే. వేలూరు మెడికల్‌ కాలేజీకి జరిగిన అన్యాయాలను పూర్తిగా సరిదిద్దుతూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తున్నా.
– చిత్తూరు బహిరంగ సభలో సీఎం జగన్‌ 

సాక్షి, తిరుపతి: గత పాలకుల స్వార్థంతో రెండు దశాబ్దాలుగా మూతబడ్డ చిత్తూరు డెయిరీకి జీవం పోస్తూ అమూల్‌ సంస్థ రూ.385 కోట్ల పెట్టబడితో చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం చిత్తూరులో భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు సమీపంలోని చీలాపల్లి సీఎంసీ మెడికల్‌ కళాశాల, 300 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్, ఆర్‌కే రోజా, సీదిరి అప్పలరాజు, విడదల రజని, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీని­వాసులు, వెంకటేగౌడ, ద్వారక నా­థరెడ్డి, ఎంఎస్‌ బాబు, నవాజ్‌బాషా.. ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, చిత్తూరు మేయర్‌ అముద, ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ విజయానందరెడ్డి, జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్, డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, అమూల్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ.. 

రెండు మంచి కార్యక్రమాలకు నాంది
ఈరోజు జరుగుతున్న రెండు మంచి కార్యక్రమాల్లో మొదటిది.. ఏనాడో మూతపడ్డ అతి పెద్దదైన చిత్తూరు డెయిరీని తెరిపించేందుకు నాంది పలుకుతున్నాం. ఇక రెండోది.. దేశంలోనే టాప్‌ 3 మెడికల్‌ కాలేజీలలో ఒకటైన వేలూరు సీఎంసీ ఏర్పాటుకు పునాది రాయి వేస్తున్నాం. దివంగత వైఎస్సార్‌ ఏనాడో స్థలాన్ని కేటాయించి ఇక్కడ మెడికల్‌ కాలేజీని తీసుకొచ్చే కలగన్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత నిర్లక్ష్యానికి గురైన మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి 14 ఏళ్ల తరువాత ఆయన బిడ్డగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. 

చిత్తూరు డెయిరీ చరిత్ర..
పాడి రైతుల మొహాల్లో చిరునవ్వులు విరబూయించిన చిత్తూరు డెయిరీని 20 ఏళ్ల క్రితం కుట్ర పూర్వకంగా మూసివేశారని జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు ప్రజలు చెప్పిన మాటలు గుర్తున్నాయి. 1945లో చిల్లింగ్‌ ప్లాంట్‌గా ఏర్పడిన చిత్తూరు డెయిరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ప్రాసెసింగ్‌ చేస్తున్న పరిస్థితులు కనిపించేవి. 1988 – 1993 మధ్య రోజుకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల ప్రాసెసింగ్‌ స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో ఈ జిల్లా కర్మకొద్దీ చంద్రబాబు కళ్లు దానిపై పడ్డాయి.

1992లో తన సొంత డెయిరీ హెరిటేజ్‌ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి, పథకం ప్రకారం చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. సహకార రంగంలోని చిత్తూరు డెయిరీని 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మూత వేసే స్థాయికి తీసుకెళ్లారు. సరిగ్గా హెరిటేజ్‌ ఏర్పాటైన పదేళ్లకు అతిపెద్ద సహకార డెయిరీని చంద్రబాబు హయాంలో మూతవేసే కార్యక్రమం చేశారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు రూ.వందల కోట్ల బకాయిలు పెట్టి 2003 నవంబర్‌ 27న లిక్విడేషన్‌ ప్రకటించేశారు. 

ఆర్నెళ్లకు ఒకసారి బోనస్‌..
ఆశ్చర్యమేమిటంటే.. సహకార రంగంలో అతి పెద్దదైన చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి వెళ్తుంటే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ డెయిరీ మాత్రం అదే సమయంలో లాభాల్లోకి పరుగెత్తుకుంటూ పోయింది. 20 ఏళ్లుగా మూతపడ్డ ఈ చిత్తూరు డెయిరీ దుస్థితి చూసి దానికి జీవం పోసి పాడి రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చా.

మాట ప్రకారం రూ.182 కోట్ల బకాయిలు తీర్చి నేడు చిత్తూరు డెయిరీ తలుపులు తెరిచాం. ప్రపంచంలోనే అతిపెద్ద సహకార డెయిరీ అమూల్‌ను తేవటమే కాకుండా వారు ఇదే డెయిరీలో రూ.385 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని సంతోషంగా చెబుతున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి డెయిరీకి పాలు పోసే అక్కచెల్లెమ్మలకు లాభాలను బోనస్‌గా పంచిపెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

రూ.150 కోట్లతో తొలిదశ పనులు
రూ.150 కోట్లతో చిత్తూరు డెయిరీ తొలిదశ పనులు మొదలవుతున్నాయి. దాదాపు లక్ష లీటర్లతో మరో 10 నెలల వ్యవధిలో పాల ప్రాసెసింగ్‌ మొదలవుతుంది. రానున్న రోజుల్లో ఇక్కడే దశలవారీగా బటర్, పాలపొడి, యూహెచ్‌టీ పాల విభాగం, ఛీజ్, పనీర్, యోగర్ట్, స్వీట్‌ తయారవుతాయి. ఐదు నుంచి ఏడెనిమిదేళ్లలో 10 లక్షల లీటర్లు ప్రాసెస్‌ చేసే స్థాయికి డెయిరీ చేరుకుంటుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి.

మరో 2 లక్షల మందికి అమూల్‌ రాకతో అవుట్‌లెట్స్, డిస్ట్రిబ్యూషన్‌ చానెళ్ల ద్వారా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. చిత్తూరు జిల్లానే కాకుండా రాయలసీమకు చెందిన పాడి రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు మంచి పాల సేకరణ ధర లభిస్తుంది. 

ఇతర డెయిరీలూ పెంచక తప్పలేదు
సహకార రంగాన్ని పునరుద్ధరిస్తూ దేశంలోని అతి పెద్ద కోఆపరేటివ్‌ డెయిరీ అమూల్‌తో కలిసి 2020 డిసెంబర్‌ 2న జగనన్న పాల వెల్లువను ప్రారంభించాం. పాడి రైతుల నుంచి 8,78,56,917 లీటర్ల పాలను సేకరించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి 10 రోజులకొకసారి నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అమూల్‌ రాక ముందు 2020 డిసెంబర్‌ 2న గేదె పాల రేటు లీటరు రూ.67 ఉండగా అమూల్‌ వచ్చాక ఎనిమిది సార్లు రేటు పెంచుకుంటూ వెళ్లింది. ఈరోజు గేదె పాలు లీటర్‌ రూ.89.76 ఉంది.

అమూల్‌ రాక ముందు ఆవు పాలు లీటర్‌ రూ.32 కూడా సరిగా ఉండేవి కాదు. అమూల్‌ వచ్చిన తర్వాత 8 సార్లు రేటు పెంచుకుంటూ వెళ్లడంతో రూ.43.69కి చేరుకుంది. ఇతర ప్రైవేట్‌ డెయిరీలు కూడా సేకరణ ధర పెంచక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. పాల సేకరణలో మనం తీసుకున్న చర్యల వల్ల అక్కచెల్లెమ్మలు, పాడి రైతన్నలకు రూ.4,243 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. 

నాన్‌ రెసిడెంట్‌ నాయకులు..
చంద్రబాబు, దత్తపుత్రుడు నా¯న్‌ రెసిడెంట్‌ నాయకులు. ఇద్దరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లద్దరి కోసం హైదరాబాద్‌ పోవాల్సిందే. ఇద్దరికీ సామాజిక న్యాయం అసలే తెలియదు. పేదలకు గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తెస్తామంటే అడ్డుకుంటారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే దాన్నీ అడ్డుకుంటారు. సంక్షేమ పథకాలు ఇస్తామంటే దాన్నీ అడ్డుకొనే కార్యక్రమం చేస్తారు. వీరికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు... దోపిడీ కోసమే! ఈరోజు యుద్ధం జరుగుతోంది జగన్‌తో కాదు. పేదవాడితో పెత్తందార్లకు యుద్ధం జరుగుతోంది. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా. 

చిత్తూరుకు శుభవార్తలు
‘చిత్తూరు మున్సిపాల్టీకి సంబంధించి రూ.75 కోట్ల పనులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు. ఆర్వోబీ, లిల్లీ బ్రిడ్జి కావాలని అడిగారు. ఇవన్నీ చేస్తాం. చిత్తూరులో ఎన్ని సచివాలయాలుంటే అన్నింటికీ రూ.50 లక్షలు చొప్పున వెంటనే మంజూరు చేస్తాం. ప్రతిపాదనలు అందించిన వెంటనే మంజూరవుతాయి. బీసీ భవనన్‌ నిర్మాణం జరుగుతుంది. కాపు భవ¯నాన్ని కూడా మంజూరు చేస్తున్నా. 37 కి.మీ. రోడ్ల ప్రతిపాదనలు రూపొందించి పనులు చేపడతాం. 

షుగర్‌ ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిలు క్లియర్‌
చిత్తూరు చక్కెర కర్మాగారం ఉద్యోగులకు శుభవార్త చెబుతూ వారికి సంబంధించిన రూ.32 కోట్ల బకాయిలు క్లియర్‌ చేశాం. వారి మొహల్లో చిరునవ్వులు చూసేందుకు బకాయిలు క్లియర్‌ చేసిన తర్వాతే ఇక్కడకి వచ్చా. చిత్తూరులో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ అడిగారు. దీనిపై ప్రతిపాదనల కోసం కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాం. మరికొన్ని విద్యాసంస్ధల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం’

పాడి రైతన్నలకు లాభం: జైన్‌ మెహతా, అమూల్‌ ఎండీ
చిత్తూరులో డెయిరీ స్థాపనకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. పాడి రైతులకు మరింత మేలు చేసే విధంగా అధిక ధరకు పాల సేకరణ చేస్తాం. గుజరాత్, మరో 16 రాష్ట్రాల్లో అమూల్‌ డెయిరీలున్నాయి. ఏటా 36 లక్షల మంది పాడి రైతుల నుంచి దాదాపు 10 బిలియన్‌ లీటర్ల పాలను సేకరిస్తున్నాం. రూ.7,200 కోట్ల టర్నోవర్‌తో అమూల్‌ సంస్థ అంతర్జాతీయంగా ఉత్తమ స్థానంలో ఉంది.   

వెన్నుపోటు వీరుడు.. ప్యాకేజీ శూరుడు!
‘‘ఇవాళ వీళ్ల పరిస్థితి ఏమిటంటే.. చక్రాలు లేని సైకిల్‌ ఎక్కలేనాయన ఓ నాయకుడు! ఎవరైనా తైలం పోస్తే కానీ గ్లాసు నిండని వ్యక్తి మరో నాయకుడు! ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ శూరుడు! వీరిద్దరికీ పేదల బతుకుల గురించి, ప్రజల కష్టాల గురించి, మాటిస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి, ఒక మాటకున్న విలువ గురించిగానీ ఏమాత్రం తెలియదు. అలా బతకాలన్న ఆలోచనా లేదు. ఇద్దరూ కలసి ప్రజల్ని మోసం చేస్తూ 2014 – 19 మధ్య రాష్ట్రాన్ని ఏలారు. ఇద్దరూ కలసి రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్న పిల్లలు, సామాజిక వర్గాలకు వెన్నుపోటు పొడిచారు’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement