గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అమూల్ ద్వారా పాల సేకరణను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్
అమ్మఒడి, 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాల పట్టాలు, దిశ చట్టం, సున్నా వడ్డీ రుణాలు, ఆసరా, చేయూత పథకాలతో పాటు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో మహిళలకు సగం ఇస్తున్నాం. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అందుకే ప్రతి పథకంలో వారికి ప్రాధాన్యం. ప్రతి అడుగులో ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని ప్రభుత్వం భావిస్తూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు అమూల్ వల్ల అక్క చెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
– సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పాడి మహిళా రైతుల సంక్షేమం కోసమే అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణను చేపట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల అక్కచెల్లెమ్మలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతీ లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా చెల్లిస్తారని తెలిపారు. రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం విప్లవాత్మక కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. అమూల్‌లో మహిళలే భాగస్వాములని, వారికే లాభాల పంపకం జరుగుతుందని, అందుకే ఆ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలు సేకరిస్తుండగా, కొత్తగా గుంటూరు జిల్లాకు ప్రాజెక్టును విస్తరించారు. గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతోపాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్వారా పాల సేకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య(జీసీఎంఎంఎఫ్–అమూల్) ఎండీ ఆర్‌ఎస్ సోధి, సబర్‌కాంత సహకార సంఘం ఎండీ డాక్టర్ బీఎం పటేల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
అక్కచెల్లెమ్మల మేలు కోసమే..
► ఈరోజు గుంటూరు జిల్లాలో అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. గతేడాది జూలై 21న అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పాడి రైతులైన అక్కచెల్లెమ్మలకు మేలు చేయడానికి ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ మేరకు గతేడాది డిసెంబర్ 2న రాష్ట్రంలో అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైంది. 400 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతుండగా.. వాటిలో ప్రకాశం జిల్లాలో 200 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 100, వైఎస్సార్ జిల్లాలో 100 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో 129 గ్రామాలు, చిత్తూరులో మరో 174 గ్రామాల నుంచి పాల సేకరణ మొదలవుతోంది. అమూల్ రాకతో 400 గ్రామాల్లో అక్క చెల్లెమ్మల జీవితాలు మారాయన్నది సుస్పష్టం.
సీఎం వైఎస్ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మహిళలు
లీటరుపై రూ.7 వరకు..
అమూల్ రాకతో ప్రతి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా వస్తోందని అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. పులివెందులలోనూ పాలు సేకరిస్తున్నారు. అమూల్ సంస్థ అక్కచెల్లెమ్మలకు అదనంగా రేటు ఇవ్వగలుగుతోంది అంటే.. అందుకు కారణం ఆ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అది ప్రైవేటు సంస్థ కాదు, ఓ సహకార సంస్థ. అందులో వాటాదారులు అక్కచెల్లెమ్మలే. ఆ సంస్థ అధిక ధరలకు పాలు కొనుగోలు చేయడమేగాక.. సంస్థకొచ్చే లాభాలను తిరిగి అక్కచెల్లెమ్మలకే ఇస్తుంది. అదీ నిజమైన సహకార సంస్థ స్పూర్తి.. ప్రత్యేకత.
► అమూల్ చేసే ప్రాసెసింగ్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ సంస్థ పాలనుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు కూడా తయారు చేస్తోంది. అందుకే పాలకు మంచి ధర ఇస్తోంది. అమూల్ ఉత్పత్తులు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అందుకే లాభాలు వస్తున్నాయి. అమూల్ మన రాష్ట్రానికి రావడం విప్లవాత్మక పరిణామమని చెప్పుకోవాలి.
అదనంగా రూ.3.52 కోట్లు ఇచ్చింది..
గతేడాది డిసెంబర్ నుంచి ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఇప్పటివరకు 10,871 మంది మహిళా పాడి రైతుల నుంచి 41.44 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్ సంస్థ ఆ రైతులకు రూ.18.46 కోట్లు చెల్లించింది. ఇతర డెయిరీలు చెల్లించిన మొత్తం కంటే రూ.3.52 కోట్లు అదనంగా అమూల్ రైతులకు ఇచ్చింది.
సహకార డెయిరీలకు పూర్తి ప్రోత్సాహం..
అమూల్‌ను మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చడానికి... మహిళా డెయిరీ సహకార సంఘాల(ఎండీఎస్‌ఎస్)కు పూర్తి ప్రోత్సాహం అందించేలా ఇప్పటికే 9,899 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాల్లో పాల సేకరణ కేంద్ర భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అందుకు దాదాపు రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఆ మేరకు పెద్ద ఎత్తున ‘ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు’(ఏఎంసీయూ), ‘బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల’(బీఎంసీయూ) నిర్మాణం మొదలుపెట్టింది.
పదిరోజులకోసారి నగదు జమ..
గతంలో ఏనాడూ పాల నాణ్యత అనేది పాడి రైతుల సమక్షంలో జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఏఎంసీయూ, బీఎంసీయూల ఏర్పాటు ద్వారా ఆ ప్రక్రియ పాడి రైతుల సమక్షంలోనే జరుగుతుంది. అదేవిధంగా పాల సేకరణ తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి అమూల్ సంస్థ రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది.
► అమూల్ వల్ల రెండు మంచి పనులు. ఒకటి లీటరుకు రూ.7 వరకు ఎక్కువ ధర. రెండోది మోసం లేదు. ఏఎంసీయూ, బీఎంసీయూల ద్వారా రైతుల సమక్షంలోనే పాల నాణ్యత పరిశీలన. తద్వారా కూడా ఆ పాలకు మంచి ధర వస్తోంది. గతంలో రైతుల ముందు పాల నాణ్యత పరిశీలన ఉండేది కాదు కానీ ఇప్పుడు అంతా పారదర్శకం.
ఆర్బీకేల ద్వారా దాణా:
పాడి గేదెలు కావాలని మహిళా పాడి రైతులు కోరుతున్నారు. అయితే చేయూత పథకంలో దీన్ని చేర్చడం జరిగింది. ఆ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలు పాడి గేదెలు తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఏఎంసీయూ, బీఎంసీయూల రాకతో పాల సేకరణ చాలా బాగుంటుంది. అంతేగాక రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను అందిస్తాం.
► ఈ కార్యక్రమంలో మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జిల్లా నుంచి హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజని, ఇంకా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా పాడి రైతులు పాల్గొన్నారు.
వారే మా సంస్థ యజమానులు
రాష్ట్రంలో పాడి రైతులకు ప్రయోజనం కల్పించడంలో అమూల్‌ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని తెలిసింది. ఇది చాలా ఎక్కువ ఉత్పత్తి అని చెప్పొచ్చు. 36 లక్షల మహిళా పాడి రైతులు అమూల్‌లో భాగస్వాములే. వారే ఆ సంస్థ యజమానులు. ఇప్పుడు ఏపీలోనూ పాడి మహిళా రైతులకు మేలు చేసేలా అమూల్ పనిచేస్తుంది. వారికి అండగా నిలుస్తుంది. పాలసేకరణ కేంద్రాల్లో ఆటోమేటిక్ యంత్రాలుంటాయి. అవి పాడి రైతుల ముందే పాల నాణ్యతను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. ఆ పాలకు ఎంత ధర గిట్టుబాటు అవుతుందన్నదీ తెలుస్తుంది. ఇవన్నీ రాష్ట్రంలో మహిళా పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి.
–ఆర్‌ఎస్ సోధి(అమూల్ ఎండీ)
Comments
Please login to add a commentAdd a comment