సహకార రంగంలోని మిల్క్ డెయిరీలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి. గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడిన సహకార డెయిరీలను తిరిగి తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాడి రైతులకు మంచి రోజులొస్తున్నాయి. పాడి రైతులకు గిట్టుబాటు ధర పెరిగేలా ఇప్పటికే చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలను సైతం తిరిగి తెరిపించడం ద్వారా రానున్న రోజుల్లో పాడి పరిశ్రమ సమర్థవంతంగా నిలదొక్కుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 27 లక్షల రైతు కుటుంబాల వద్ద 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలు ఉన్నాయి. వాటిద్వారా రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో సహకార డెయిరీలు 21.7 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా.. 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేట్ డెయిరీలు సేకరిస్తున్నారు. మరో 2.19 కోట్ల లీటర్లు అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్కెట్‌కు చేరుతున్నాయి.
‘అమూల్’ రాకతో..
సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్న ‘అమూల్’ సంస్థతో గత ఏడాది ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆమూల్ సంస్థ రైతుల నుంచి పాల సేకరణకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల పాలను విక్రయించే రైతులకు లీటర్ ఆవు పాలకు రూ.4, గేదె పాలకు వెన్న శాతాన్ని బట్టి రూ.7 నుంచి రూ.20 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. 2022 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అమూల్ ద్వారా పాల సేకరణ జరిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇందులో భాగంగా గత పాలకుల నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా మూతపడిన సహకార డెయిరీలను లీజు ప్రాతిపదికన అప్పగించి.. వాటి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీ డీడీసీఎఫ్) పరిధిలో అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లి, పులివెందుల, జి.కొత్తపల్లి సహకార పాల డెయిరీలుండగా వాటిలో జి.కొత్తపల్లి డెయిరీ మినహా మిగిలిన డెయిరీలన్నీ గత పాలకుల నిర్వాకం వల్ల మూతపడ్డాయి.
ఈ ఆరు డెయిరీలకు పూర్వ వైభవం
అనంతపురం, హిందూపురం, రాజమండ్రి, కంకిపాడు, మదనపల్లి, పులివెందుల డెయిరీలను లీజు ప్రాతిపదికన అమూల్ సంస్థకు అప్పగించటం ద్వారా తిరిగి వాటిని తెరిపించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. గతంలో ఈ డెయిరీల పరిధిలో 60 వేల మంది పాల ఉత్పత్తిదారులు ఉండేవారు. వీరినుంచి రోజుకు 2.5 లక్షల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.851.5 కోట్ల టర్నోవర్ జరిగేది. వీటికి రూ.1,655 కోట్ల విలువైన 688.36 ఎకరాల భూములున్నాయి. తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో రూ.343.55 కోట్ల విలువైన 25.22 ఎకరాల భూములు ఉన్నాయి. గత పాలకులు సొంత డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలకు మేలు చేకూర్చే లక్ష్యంతో సహకార డెయిరీల ద్వారా సేకరించిన పాలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకుండా చేశారు. ఫలితంగా ఒక్కొక్కటిగా అవి మూతపడ్డాయి. వీటిలో ప్రస్తుతం రూ.12 కోట్ల విలువైన 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 మిల్క్ ప్రోసెసింగ్ ప్లాంట్లు, రెండు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మదనపల్లిలో యూహెచ్‌టీ ప్లాంట్, ఒంగోలులో పౌడర్ ప్లాంట్ ఉన్నాయి. రోజుకు 10.40 లక్షల లీటర్ల పాలను సేకరించి ప్రోసెస్ చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఏళ్ల తరబడి ఉపయోగించని మౌలిక సదుపాయాలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మూతపడిన డెయిరీలకు పూర్వవైభవం కల్పించనున్నారు. తద్వారా ఈ డెయిరీల పరిధిలోని పాడి రైతులకు అధిక పాల ధర లభించనుంది.
ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం
దశాబ్దాల క్రితం మూతపడిన సహకార డెయిరీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఇప్పటికే అమూల్ సంస్థకు పాలు పోసేందుకు పాడి రైతులు పోటీ పడుతున్నారు. సహకార పాడి రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
– ఎ.బాబు, ఎండీ, ఏపీ డీడీసీఎఫ్
పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా..
రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న డెయిరీలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూతపడిన డెయిరీల నిర్వహణ బాధ్యతలను అమూల్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడం చాలా మంచి ఆలోచన. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన డెయిరీలకు పూర్వ వైభవం వస్తే పాడి రైతులకు మంచి జరుగుతుంది.
– వైవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ అగ్రి మిషన్
చాలా సంతోషంగా ఉంది
మాకు రెండు గేదెలున్నాయి. ఒక్కో గేదె 5 లీటర్ల చొప్పున పాలిస్తుంది. గతంలో లీటర్‌కు రూ.40 నుంచి రూ.45 ఇచ్చేవారు. ప్రస్తుతం అమూల్ డెయిరీకి పాలు పోస్తున్నాం. ఇప్పుడు లీటర్‌కు రూ.65 నుంచి రూ.70 వరకు ఇస్తున్నారు. మా ఊళ్లో పాడి రైతులంతా అమూల్ డెయిరీకే పాలు పోస్తున్నారు. పులివెందుల డెయిరీని అమూల్‌కు అప్పగిస్తున్నారని తెలిసింది. సంతోషంగా ఉంది.
– కొత్తపల్లి విమల, మహిళా రైతు, పులివెందుల
Comments
Please login to add a commentAdd a comment