పల్లెల్లో పాల వెల్లువ | Automatic milk collection and bulk milk cooling units at village level | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పాల వెల్లువ

Published Sun, Jun 13 2021 2:32 AM | Last Updated on Sun, Jun 13 2021 2:32 AM

Automatic milk collection and bulk milk cooling units at village level - Sakshi

బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ నమూనా

సాక్షి, అమరావతి: పల్లెల్లో పాల వెల్లువ పరిఢవిల్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్ల(ఏఎంసీయూ)ను ఏర్పాటు చేస్తోంది. ఇదే సందర్భంలో డివిజన్‌ స్థాయిలో ఉన్న మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్ల (ఎంసీసీ)లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటోంది. గత పాలకుల నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ (ఏపీ డీడీసీఎఫ్‌) అధీనంలో రోజుకు 2.5 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే ఆరు డెయిరీలతో పాటు 5.49 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటైన 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. మూతపడిన డెయిరీలను పునరుద్ధరించడంతోపాటు పాల లభ్యత అధికంగా ఉండే గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా సహకార రంగానికి పూర్వ వైభవం తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 

నిర్మాణాలు, పరికరాలకు రూ.4,189.75 కోట్లు
ఇందులో భాగంగా నాణ్యమైన పాల సేకరణ కోసం 8,051 ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క యూనిట్‌ను 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందుకోసం రూ.942.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మహిళా మిల్క్‌ డెయిరీలు నిర్వహించే వీటిద్వారా నాణ్యమైన పాలను సేకరిస్తారు. ఇలా సేకరించిన పాలను చెడిపోకుండా భద్రపరిచేలా 9,899 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాలను ఎక్కడికక్కడే కూలింగ్‌ చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. వీటి నిర్మాణానికి రూ.1,885.76 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆయా యూనిట్లలో పరికరాల కోసం రూ.1,361.22 కోట్లు వెచ్చిస్తున్నారు. మొత్తంగా ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల కోసం రూ.4,189.75 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. వీటి నిర్మాణాలను సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దశల వారీగా వచ్చే మార్చి నెలాఖరులోగా పరికరాలను ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొస్తారు. 

రోజుకు 1.16 కోట్ల లీటర్ల పాల సేకరణ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఏ ఒక్క పాడి రైతు దళారులు, ప్రైవేట్‌ డెయిరీల దోపిడీకి గురికాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాం. డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం 6.60 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బీఎంసీయూల వల్ల రోజుకు పాల సేకరణ సామర్థ్యం 1.16 కోట్ల లీటర్లకు పెరుగుతుంది.
– ఎ.బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement