
సాక్షి, తాడేపలి : పాడి రైతులకు మేలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని.. ధరల విషయంలో రైతులకు న్యాయం జరగాలని అన్నారు. శుక్రవారం షుగర్ ఫ్యాక్టరీలు, మిల్క్ డెయిరీల అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖమంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటుగా అమూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి : రైతులు రూపాయి కడితే చాలు: సీఎం జగన్)
అమూల్‌తో భాగస్వామ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. జూలై 15లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ దిశగా అడుగులు వేయాలన్నారు. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూదన్నారు. అంతకు ముందు పాడి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అలాగే అమూల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడి పరిశ్రమలపై ఆ కంపెనీ వెల్లడించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.(చదవండి : సీఎం జగన్‌ను ప్రశంసించిన యూకే డిప్యూటీ హై కమిషనర్)
సహకార చక్కెర ఫ్యాక్టరీలపై సీఎం సమీక్ష
సహకార చక్కెర కర్మాగారాల్లో పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రులు, అధికారులు కూర్చొని ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రణాళికపై ప్రతిపాదనలు తయారు అయ్యాక.. వాటిపై పూర్తి స్థాయిలో చర్చించి ఖరారు చేద్దామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment