పాడి పరిశ్రమకు మహర్దశ | Andhra Pradesh Govt Plans to Sign Agreement with Amul in July | Sakshi
Sakshi News home page

పాడి పరిశ్రమకు మహర్దశ

Published Sat, Jun 27 2020 3:29 AM | Last Updated on Sat, Jun 27 2020 5:28 AM

Andhra Pradesh Govt Plans to Sign Agreement with Amul in July - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్, అధికారులు

రాష్ట్రంలోని పాడి రైతులకు మేలు జరగాలి. వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి రేటు రావాలి. ధర విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదు. రైతులకు అదనపు ఆదాయాలు ఇవ్వాలి, మరోవైపు సహకార రంగం బలోపేతం కావాలి 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మహర్దశ రానుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా, తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సహకార కంపెనీ ‘అమూల్‌’తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఆ కంపెనీ అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విస్తృతమైన మార్కెటింగ్‌ను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి, పాడి రైతుల సమస్యలు, పాల ఉత్పత్తులకు మంచి ధర కల్పించే అవకాశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.

జూలై 15లోగా అవగాహన ఒప్పందం.. 
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చడం, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించేలా, నాణ్యమైన పాల ఉత్పత్తులు జరిగేలా, వాటి ద్వారా రైతులకు సరైన ధర లభించేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుంచారు.
► అమూల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడి పరిశ్రమపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలను వారు వివరించారు. పాల ఉత్పత్తుల రంగంలో దేశంలో అత్యుత్తమ సహకార సంస్థగా నిలిచిన అమూల్‌కు ఉన్న పేరు, సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన మార్కెటింగ్‌ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని, రైతులకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. 

సహకార చక్కెర ఫ్యాక్టరీలపై సమీక్ష..
‘అమూల్‌’తో భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని,ఆ తర్వాత ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూలై 15లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు.. సీఎంకు తెలిపారు. 

► సహకార చక్కెర కర్మాగారాల్లో పరిస్థితులను అధికారులు ఈ సందర్భంగా సీఎంకి వివరించారు. పునరుద్ధరించాల్సిన
కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రులు, అధికారులు కూర్చొని ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదనలు తయారయ్యాక.. మరోసారి దీనిపై కూర్చొని ఖరారు చేద్దామని ఆయన చెప్పారు. 
► ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

పాడి పరిశ్రమ రంగం పటిష్టం కావాలి: సీఎం
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ పాడి పరిశ్రమలో అమూల్‌కు ఉన్న అనుభవం రాష్ట్రంలోని రైతులకు ఉపయోగపడాలని, పాడి పశువులకు వైద్యం, సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, తద్వారా రైతులకు మంచి రేటు.. ఇలా అన్ని అంశాల్లోనూ పాడి పరిశ్రమ రంగం పటిష్టం కావాలని పేర్కొన్నారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నారు. అమూల్‌తో కలసి అడుగులు ముందుకేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement