సాక్షి, అమరావతి: విజయవాడలో అమూల్ సంస్థ పాల ఉత్పత్తుల విక్రయానికి కంటైనర్ బూత్‌ల ఏర్పాటుకు హైకోర్టు అనుమతించింది. అయితే వాటి కార్యకలాపాలను ప్రారంభించవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమూల్ కంటైనర్ల ఏర్పాటుకు విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ కౌన్సిలర్ నెలిబండ్ల బాలస్వామి దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
నామినేషన్ పద్ధతిలో బూత్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చారని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు తెలిపారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్‌వో) ప్రకారమే నడుచుకున్నామని చెప్పారు. ఉచితంగా ఇవ్వలేదని, ఆ ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువలో 10 శాతానికి ఇచ్చామన్నారు. ఎలాంటి రాయితీలు, అదనపు ప్రయోజనాలు లేవన్నారు. దీని వెనుక మహిళా సాధికారిత ఉందన్నారు.
మహిళా సంఘాల నుంచి పాలు, ఇతర ఉత్పత్తులు కొని, వాటిని బూత్‌ల ద్వారా విక్రయిస్తుందని తెలిపారు. ఇవి తాత్కాలిక షెడ్లు మాత్రమేనన్నారు. వీటిని రోడ్ల మార్జిన్‌లలో ఏర్పాటు చేస్తున్నారని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని ఆదినారాయణరావు చెప్పారు. రాష్ట్రంలో పాల సొసైటీలను ప్రోత్సహించకుండా ప్రభుత్వం అమూల్‌ను ప్రోత్సహిస్తోందన్నారు. దీనికి సుమన్ స్పందిస్తూ, ఇలాంటి వ్యాజ్యాల ద్వారా మహిళా సాధికారితను అడ్డుకుంటున్నారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కంటైనర్ల ఏర్పాటుకు అనుమతించింది. పాడి రైతుల సంక్షేమం కోసం అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
అమూల్ కంటైనర్లకు హైకోర్టు అనుమతి
Published Thu, Apr 7 2022 3:50 AM | Last Updated on Thu, Apr 7 2022 8:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment