ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ బ్లాక్ ఫ్రైడే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి.. కోర్టుల్లో ఇవాళ బ్యాక్ టూ బ్యాక్ ఝలక్‌కు తగిలాయి.
ఒకవైపు ఆయన రిమాండ్‌ను రెండు రోజులు పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. ఇంకోవైపు.. ఆయన్ని సీఐడీ విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. వీటితో పాటు ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలను కూడా అనిశా(ACB) కోర్టు వాయిదా వేయడం గమనార్హం.
స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడిని ఐదురోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరగ్గా.. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. తీర్పు సమయంలో చంద్రబాబును ఎక్కడ విచారిస్తారనే దానిపై సీఐడీ సమాధానం ఆధారంగా తీర్పు ఉంటుందని తొలుత ఏసీబీ న్యాయమూర్తి చెప్పారు. అయితే..
ఫొటోలు, వీడియోలు బయటకు రావొద్దు
ఆయన్ని జైల్లోనే విచారిస్తామని సీఐడీ సమాధానం ఇవ్వడంతో.. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే రెండ్రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ‘‘విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వండి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గం. లోపు విచారణ పూర్తి చేయాలి. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతిస్తాం. ఇబ్బందులేమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. చంద్రబాబు విచారణ జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చూడాలని జడ్జి ఈ సందర్భంగా సీఐడీ అధికారులను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు కస్టడీ తీర్పుతో.. రేపు(శనివారం), ఆదివారం జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
అలా ఎలా వింటాం?
మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కస్టడీ విచారణ జరిగే సమయంలో వాదనలు ఎలా వింటామని?.. అలా వినడం సరికాదని పేర్కొంది ఏసీబీ కోర్టు. ఆపై.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం వింటామని తెలిపింది.
అంతకు ముందు రెండు
అంతకు ముందు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ ముగిసి పోవడంతో.. ఏసీబీ కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హైకోర్టులోనూ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. అయితే సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ‘‘ఇంత దర్యాప్తు జరిగిన తర్వాత.. ఈ దశలో తాము జోక్యం చేసుకోమని.. దర్యాప్తును ఆపే ఆదేశాలు ఇవ్వలేమని చెబుతూ క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment