సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ స్కామ్ గురించి, మిగిలిన నిందితుల పాత్ర గురించి చంద్రబాబుకు చాలా విషయాలు తెలుసని, అందువల్ల ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కస్టడీకి ఇచ్చే సమయంలో ఎలాంటి షరతులు విధించినా తమకు అభ్యంతరం లేదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ నిధుల మళ్లింపు, లబ్ధిదారులు ఎవరన్న విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసన్నారు.
నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీనే అంతిమ లబ్ధిదారులని తెలిపారు. స్కామ్ జరిగిన తీరును ఈ పిటిషన్‌లో వివరించారు. ‘ఈ స్కామ్ వెనుక కొందరి ఆర్థిక పరమైన దుష్ప్రవర్తన, లోతైన కుట్ర దాగి ఉంది. వీటి వెనకు అసలు కారణాలన్నింటినీ చంద్రబాబు నుంచి తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థకుంది. అధికార బాధ్యతలను పక్కన పెట్టి వ్యక్తుల లబ్ధి కోసం భారీ, లోతైన కుట్రకు పాల్పడారు.
మాకు కావాల్సిన సమాచారాన్ని చంద్రబాబు నుంచి రాబట్టినప్పుడే ఈ ఆర్థిక మోసం పూర్తిగా బయటపడుతుంది. ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన లబ్ధిదారులు చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ. మాయం చేసిన ఫైళ్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాలను చంద్రబాబును విచారించి రాబట్టాల్సి ఉంది.
షెల్ కంపెనీల ద్వారా, పలువురు వ్యక్తుల సాయంతో మొత్తం డబ్బు తిరిగి చంద్రబాబుకే చేరింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను చంద్రబాబు నుంచి రాబట్టాల్సి ఉంది. చంద్రబాబును అరెస్ట్ తరువాత విచారించాం. అయితే ఆయన విచారణకు సహకరించలేదు. అందువల్ల 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని ఆదేశించింది. కౌంటర్ దాఖలు తరువాత ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment