దర్యాప్తును, అధికారులను శాసించే స్థానాల్లో వారే ఉన్నారు
కీలక ఆధారాలు, సాక్ష్యాలను రూపుమాపేందుకు యత్నాలు
తనపై ఫిర్యాదు చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు
వారిపై చార్జిషిట్లను, కేసు డైరీలను కోర్టు ముందుంచేలా ఆదేశించండి
హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన తిలక్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సీఐడీ అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేశ్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తిమంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీల్లోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
2014–19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తిలక్ పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థలన్నీ చంద్రబాబు తదితరులకు క్లీన్‌చీట్ ఇచ్చి వారిపై నమోదైన కేసులన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నాయని అనుబంధ పిటిషన్‌లో పేర్కొన్నారు. రూ.కోట్ల కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోందని, అందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసిందని తెలిపారు.
అధికారుల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు
‘ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఐజీ, సీఐడీ అదనపు డీజీ, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్‌ను కోరగలరు. అయితే వీరంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పనితీరు మదింపు నివేదికలు (ఏపీఏఆర్) ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దే ఉంది. అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాలపై దర్యాప్తు చేసిన అధికారుల వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇది నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్‌రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీనిపై మధుసూదన్‌రెడ్డి న్యాయపోరాటం చేసి తిరిగి ఉద్యోగం పొందారు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారనేందుకు ఇదో ఉదాహరణ. అంతేకాక ఆ కుంభకోణాలపై నిష్పాక్షికంగా, వృత్తిపరంగా దర్యాప్తు చేసిన, దర్యాప్తులో పాలుపంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టారు’ అని తిలక్ వివరించారు.
ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో ఐదుగురు ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారు. సీఐడీ దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులుగా ఉన్న వీరిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరే ఆస్కారమే లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చైర్మన్‌గా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఆర్‌డీఏ పురపాలక శాఖ పరిధిలో పనిచేస్తుంది. దానికి నారాయణ మంత్రిగా ఉన్నారు. సీఆర్‌డీఏకు నారాయణ వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
వీరిద్దరూ ఆ కుంభకోణాల్లో నిందితులు. సీఆర్‌డీఏ, పురపాలక శాఖ అధికారులందరూ వీరి నియంత్రణలో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొందరి సాక్ష్యాలను కింది కోర్టు నమోదు చేసింది. మరికొందరి సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్నీ రికార్డులను చంద్రబాబు, నారాయణ పరిశీలించే అవకాశం ఉంది అని తిలక్ తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు, లోకేశ్ బెదిరించేలా మాట్లాడుతున్నారు
‘బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేశ్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా, అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచి్చన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు.
క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా? చేస్తున్నారా? అన్న విషయాలు కేసు డైరీల్లో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరులు అధికారులను, దర్యాప్తును శాసించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వారిపై నమోదయిన కేసులకు సంబంధించిన కేసు డైరీలను, చార్జిషిట్‌లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి’ అని తిలక్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment