సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,362.22 కోట్లు వెచ్చించనున్నట్లు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆయన శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసంకల్ప యాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. సహకార రంగంలోని డెయిరీలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పాడిరైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఈనెల 25న అమూల్ ద్వారా పాలసేకరణకు బిల్లులు చెల్లించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అమూల్ ప్రాథమికంగా ఎనిమిది జిల్లాలను (ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం) ఎంపిక చేసిందని చెప్పారు. ఈనెల 20 నుంచి మొదటగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 70 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతుందని, ఇది పాల ఉత్పత్తిలో 26 శాతమేనని తెలిపారు.
అమూల్ భాగస్వామ్యంతో రోజుకు 2 కోట్ల లీటర్ల పాలు సేకరించేందుకు అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో రూ.500 కోట్లతో 9,899 బల్క్ మిల్క్ చిల్లింగ్ (బీఎంసీ) యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తొలిదశలో 2,774, రెండోదశలో 3,639, మూడోదశలో 3,486 బీఎంసీ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా 7,125 పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు ఏ పాల్గొన్నారు.
పాడి పరిశ్రమ మౌలిక వసతులకు రూ.1,362 కోట్లు
Published Sat, Nov 7 2020 3:33 AM | Last Updated on Sat, Nov 7 2020 3:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment