పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్‌ | AP Govt Signs MOU With Amul Dairy To Distribute Milk And Baal Amrut | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్‌

Published Fri, Jan 28 2022 12:14 PM | Last Updated on Sat, Jan 29 2022 4:28 PM

AP Govt Signs MOU With Amul Dairy To Distribute Milk And Baal Amrut - Sakshi

కనీసం ఒక లీటర్‌ మంచి నీళ్ల సీసా ధర కూడా పాలకు రావడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలని అక్కచెల్లెమ్మలు నా పాదయాత్ర సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేని పరిస్థితిని అమూల్‌ ద్వారా తీసుకువచ్చాం. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్‌ పాల సేకరణ చేస్తోంది. ఇప్పుడు ఏడవ జిల్లాగా అనంతపురంలో అడుగుపెట్టింది.  – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్‌తో పోటీ వల్లే ప్రైవేట్‌ డెయిరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లువ శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమూల్‌ రంగ ప్రవేశం వల్ల పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే సరిపోని పరిస్థితుల్లో పాడిని తోడుగా చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

అక్క చెల్లెమ్మలే యజమానులు
అమూల్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్‌ యాజమానులు. అందుకే మార్కెట్‌లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ కంటే అమూల్‌ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది.
► పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రాసెసింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉంది. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్థాయికి అమూల్‌ ఎదిగింది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. అందువల్లే  ఎలాంటి మోసాలు, కల్తీ, దళారుల డెడద లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఇస్తోంది. వచ్చిన లాభాలను కూడా బోనస్‌ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అక్కచెల్లెమ్మలకు వెనక్కు ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం.
► మన రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన నేపథ్యంలో అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో డెయిరీలు సహకార రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్‌ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయి. వాస్తవానికి సహకార రంగంలో ఉండటం అంటే ఇలా.. అని చూపించిన పరిస్థితి దేశం మొత్తం మీద అమూల్‌లోనే ఉంది. లాభాలు పాలు పోసే అక్కచెల్లెమ్మలకే వస్తాయి అని అమూల్‌ చూపించింది. అందుకే అమూల్‌కు అంత ప్రాధాన్యత. 

అమూల్‌ రాకతో పోటీతో పాటు మార్పు
నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్‌ బాటిల్‌ చూపించే వారు. మార్కెట్‌లో వాటర్‌ బాటిల్‌ ధర రూ.23 అయితే, లీటరు పాలు అంత కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బతకాలని అడిగే వారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం.
► అమూల్‌ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకు పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడే ఎందుకు రేటు పెరిగిందంటే.. గతంలో గ్రామ స్థాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అనే పరిస్థితులు ఉండేవి.
► రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీయూ (బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు) ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. దాదాపు 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూ (ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌)లను ఏర్పాటు చేస్తోంది. 
► అమూల్‌ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడికక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందని వివరిస్తూ రశీదు ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది.

మోసాల నివారణకు చర్యలు
► పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. 
► ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో బాలమృతం, అంగన్‌వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అమూల్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోథీ, కైరా మిల్క్‌ యూనియన్‌ ఎండీ అమిత్‌ వ్యాస్, బనస్కాంత మిల్క్‌ యూనియన్‌ ఎండీ సంగ్రామ్‌ చౌదరి, సబర్‌కాంత మిల్క్‌ యూనియన్‌ ఎండీ అనిల్‌ బయాతీలకు సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement