Amul Project:
-
పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్
కనీసం ఒక లీటర్ మంచి నీళ్ల సీసా ధర కూడా పాలకు రావడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలని అక్కచెల్లెమ్మలు నా పాదయాత్ర సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేని పరిస్థితిని అమూల్ ద్వారా తీసుకువచ్చాం. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్ పాల సేకరణ చేస్తోంది. ఇప్పుడు ఏడవ జిల్లాగా అనంతపురంలో అడుగుపెట్టింది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్‌తో పోటీ వల్లే ప్రైవేట్ డెయిరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లువ శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమూల్ రంగ ప్రవేశం వల్ల పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే సరిపోని పరిస్థితుల్లో పాడిని తోడుగా చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అక్క చెల్లెమ్మలే యజమానులు ► అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్ యాజమానులు. అందుకే మార్కెట్లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ కంటే అమూల్ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ► పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రాసెసింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉంది. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్థాయికి అమూల్ ఎదిగింది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. అందువల్లే ఎలాంటి మోసాలు, కల్తీ, దళారుల డెడద లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఇస్తోంది. వచ్చిన లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అక్కచెల్లెమ్మలకు వెనక్కు ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం. ► మన రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన నేపథ్యంలో అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో డెయిరీలు సహకార రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయి. వాస్తవానికి సహకార రంగంలో ఉండటం అంటే ఇలా.. అని చూపించిన పరిస్థితి దేశం మొత్తం మీద అమూల్‌లోనే ఉంది. లాభాలు పాలు పోసే అక్కచెల్లెమ్మలకే వస్తాయి అని అమూల్ చూపించింది. అందుకే అమూల్‌కు అంత ప్రాధాన్యత. అమూల్ రాకతో పోటీతో పాటు మార్పు ►నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించే వారు. మార్కెట్లో వాటర్ బాటిల్ ధర రూ.23 అయితే, లీటరు పాలు అంత కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బతకాలని అడిగే వారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ► అమూల్ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకు పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడే ఎందుకు రేటు పెరిగిందంటే.. గతంలో గ్రామ స్థాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అనే పరిస్థితులు ఉండేవి. ► రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీయూ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. దాదాపు 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూ (ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్)లను ఏర్పాటు చేస్తోంది. ► అమూల్ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడికక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందని వివరిస్తూ రశీదు ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది. మోసాల నివారణకు చర్యలు ► పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ► ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో బాలమృతం, అంగన్వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథీ, కైరా మిల్క్ యూనియన్ ఎండీ అమిత్ వ్యాస్, బనస్కాంత మిల్క్ యూనియన్ ఎండీ సంగ్రామ్ చౌదరి, సబర్కాంత మిల్క్ యూనియన్ ఎండీ అనిల్ బయాతీలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. -
అమూల్‌తో శ్వేత విప్లవం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మత్స్య, మాంస ఉత్పత్తుల రంగంతో పాటు పాడి రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో అమూల్ పెట్టుబడుల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది శ్వేత విప్లవం వేగం పుంజుకుంటుందన్నారు. దేశంలో పాడి పరిశ్రమల రూపురేఖలు మార్చిన అమూల్ తమ పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్టంలో అమూల్ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో బుధవారం జరిగిన ఒప్పంద కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జరిగే ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అమూల్ తరఫున సభర్కాంత జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ యూనియన్ ఎండీ బాబు భాయ్ ఎం. పటేల్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలి: సీఎం జగన్
-
గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగనన్న అమూల్ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని తెలిపారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని అన్నారు. అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. అమూల్ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. చదవండి: Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని తెలిపారు. వారికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. దానివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుందని, మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని అన్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం- కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. మత్స్యశాఖపై సమీక్ష.. ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాదు, స్థానిక వినియోగాన్ని పెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తీసుకు వస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇది జరక్కపోతే సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారని అన్నారు. ప్రాసెసింగ్ చేసేవాళ్లు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్లు సిండికేట్ అవుతున్నారని పలు దఫాలుగా రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని పేర్కొన్నారు. పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాదు, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని తెలిపారు. రైతులను ఆదిశగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్లో నాణ్యత కోసం, రైతుల్ని దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వారంగ సబ్సిడీలు– రైతులకు మేలు ఆక్వారంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతులకు నేరుగా అందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేయడానికి తగిన ఆలోచనలు చేయాలని అధికారులకు తెలిపారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్ కూడా పెట్టే ఆలోచన చేయాలని అన్నారు. ఫిష్ ఆంధ్రా లోగోను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఆక్వాహబ్‌లు, అనుబంధిత రిటైల్ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌లను, 14వేల రిటైల్ అవుట్లెట్లు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రి ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 10 ప్రాసెసింగ్‌ప్లాంట్లు, 23 ప్రి ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు చెక్ పెట్టగలుగుతామని, రైతులకు మంచి ధరలు వస్తాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పనులు మొదలయ్యాని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్–జులై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధం చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. మిగిలిన 5 ఫిషింగ్ హార్బర్ల పనులు ఈ డిసెంబర్లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్, అమూల్ ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.