
మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న అమూల్ సంస్థ ప్రతినిధులు, అధికారులు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మత్స్య, మాంస ఉత్పత్తుల రంగంతో పాటు పాడి రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో అమూల్ పెట్టుబడుల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది శ్వేత విప్లవం వేగం పుంజుకుంటుందన్నారు.
దేశంలో పాడి పరిశ్రమల రూపురేఖలు మార్చిన అమూల్ తమ పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్టంలో అమూల్ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో బుధవారం జరిగిన ఒప్పంద కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అమూల్ ఎండీ ఆర్‌ఎస్ సోధి శుభాకాంక్షలు తెలిపారు.
త్వరలో జరిగే ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అమూల్ తరఫున సభర్కాంత జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ యూనియన్ ఎండీ బాబు భాయ్ ఎం. పటేల్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment