పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష | Chandrababu coalition govt faction with dairy farmers | Sakshi
Sakshi News home page

పాడి రైతుపై కక్ష?

Published Tue, Aug 6 2024 4:44 AM | Last Updated on Tue, Aug 6 2024 7:10 AM

Chandrababu coalition govt faction with dairy farmers

అమూల్‌కు కూటమి ప్రభుత్వం సహాయ నిరాకరణ

ప్రైవేటు డెయిరీల మేలే లక్ష్యంగా మహిళల ఆదాయానికి గండి

పాలసేకరణ సిబ్బందిని వెనక్కి పంపేసిన ప్రభుత్వం.. విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ నిలిపివేస్తున్న అమూల్‌

11 నుంచి అనంతపురం, 21 నుంచి తిరుపతి జిల్లాల్లో పాలసేకరణ నిలిపివేత

సెప్టెంబరు 1కి మిగతా జిల్లాల్లోనూ నిలిపివేత

మహిళా పాడి రైతుల ఆందోళన.. తిరుపతి, అనంతపురంలో నిరసన

ఇప్పటికే 4,798 గ్రామాల నుంచి 2 వేల గ్రామాలకు తగ్గిన పాలసేకరణ

పాలు పోసే వారి సంఖ్య 1.25 లక్షల నుంచి 30 వేలకు పరిమితం

మూడున్నరేళ్లలో 20 కోట్ల లీటర్ల సేకరణ 

రూ.925 కోట్లు చెల్లించిన అమూల్‌

సాక్షి, అమరావతి: పాడి రైతుపై బాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర పొందుతున్న రైతుల పొట్టకొడుతోంది. పాలు సేకరించే క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉపసంహరించడంతో పాటు అమూల్‌కు సహాయ నిరాకరణ చేస్తూ ప్రైవేటు డెయిరీల దోపిడికీ తెర తీస్తోంది. ముఖ్యంగా సొంత డెయిరీకి మేలు చేయడమే లక్ష్యంగా రాయలసీమ జిల్లాల్లో అమూల్‌కు మోకాలడ్డుతోంది. 

ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక అమూల్‌ కూడా పాల సేకరణ నిలిపివేస్తోంది. తిరుపతిలో ఈ నెల 21 నుంచి, అనంతపురం జిల్లాలో 11వ తేదీ నుంచి పాల సేకరణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ సెప్టెంబర్‌ 1 నుంచి పాల సేకరణ నిలిపివేసేందుక చర్యలు చేపడుతోంది. బాబు చర్యలు రాష్ట్రంలోని లక్షలాది పాడి రైతులకు శరాఘాతంగా మారాయి. 

రాష్ట్రంలో పాడి రైతుల్లో అధిక శాతం మహిళలే. వారే ఇప్పుడు అమూల్‌ పాల సేకరణ కేంద్రాలు కొనసాగించాలంటూ ఆందోళన బాట పట్టారు. తిరుపతి, అనంతపురం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద వందలాది మహిళలు, రైతులు నిరసన వ్యక్తంచేశారు. 

అమూల్‌ రాకతో గడిచిన మూడేళ్లుగా లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి పొందుతున్నామని, బ్యాంకుల నుంచి రకు రుణాలు తీసుకుని కొత్త పశువులను కొన్నామని రైతులు చెబుతున్నారు. అమూల్‌ కేంద్రాలు మూసివేస్తే, ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలు తగ్గించేస్తాయని, అప్పుడు తమ బతుకులు అంధకారంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొమ్మనకుండా పొగ
బాబు కూటమి అధికార పగ్గాలు చేపట్టింది మొదలు అమూల్‌ విషయంలో పొమ్మనకండా పొగపెట్టాలా వ్యవహరిస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో అమూల్‌ ప్రాజెక్టు విస్తరణ కోసం జిల్లాకో డెయిరీ డెవలప్‌మెంట్‌ అధికారిని నియమించారు. గ్రామ సచివాలయాల్లోని డిజిటల్, వెల్ఫేర్, యానిమల్‌ అసిస్టెంట్స్‌ పర్యవేక్షణలో పాలసేకరణ జరిగే ప్రతి 15–20 గ్రామాలకో మెంటార్‌నూ, ప్రతి 3–4 సచివాలయాల పరిధిలో ఒక రూట్‌ ఇన్‌చార్జిని నియమించారు. 

మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జేడీ, డీఆర్‌డీఎ పీడీ, జిల్లా సహకార శాఖాధికారులు పర్యవేక్షించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 4వ రోజూనే వీరందర్ని వెనక్కి పంపేసింది. అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా బాధ్యతల నుంచి అమూల్‌ను తప్పించింది. అమూల్‌ ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాన్ని 8.3 శాతానికి పెంచడం, పాలసేకరణ ధరను రూ.4 వరకు తగ్గించడం ప్రభుత్వ ఒత్తిళ్ల ఫలితమేనని చెబుతున్నారు. 

4,798 గ్రామాల్లో జరగాల్సిన పాల సేకరణ ఇప్పుడు 2 వేల గ్రామాలకు పరిమితమైంది. పాలుపోసే వారి సంఖ్య 1.20 లక్షల నుంచి 30వేల మందికి తగ్గిపోయింది. ఇప్పటికే పాల ఉత్పత్తి పెరిగిందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించేశాయి. అమూల్‌ పాలసేకరణ నిలిపివేస్తే, ఇక ప్రైవేటు డెయిరీలదే రాజ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు డెయిరీల దోపిడికీ వైఎస్‌ జగన్‌ కళ్లెం
ప్రైవేటు డెయిరీల దోపిడికీ కళ్లెం వేసి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా సహకార డెయిరీలకు పూర్వ వైభవం తేవాలన్న సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహకార డెయిరీ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న అమూల్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. 

పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. ప్రతి పాడి రైతుకు లీటర్‌పై రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా రూ.10 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూర్చింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఉద్యమంలా విస్తరణ
3 జిల్లలు (వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం)తో మొదలై 19 జిల్లాలకు జగనన్న పాల వెల్లువ విస్తరణ 401 గ్రామాలు, 24,277 మంది రైతులతో మొదలై నేడు 4,798 గ్రామాలు 4.50 లక్షల మంది రైతుల భాగస్వామ్యం రోజూ పాలు పోసే వారి సంఖ్య 800తో మొదలై 1.25 లక్షలకు చేరిక పాల సేకరణ రోజుకు సగటున 1,800 లీటర్ల నుంచి 3.75 లక్షల లీటర్లకు చేరిక అమూల్‌ ద్వారా 3.5 ఏళ్లలో 20 కోట్ల లీటర్ల పాలసేకరణ రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బు రూ.925 కోట్లు అందించిన ప్రయోజనాలు

– 180 రోజులు పాలు పోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్‌ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి
– లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్‌ పంపిణీ
– వర్కింగ్‌ క్యాపిటల్‌ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేలు సాయం
– కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవుకు రూ.76 వేలు సాయం
– 9,899 గ్రామాల పరిధిలో ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనాతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఎఎంసీయూ) ఏర్పాటు
– ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి శ్రీకారం
– ఎఎంసీయూల్లో రూ.1.50 లక్షల, బీఎంసీయూల్లో రూ.15 లక్షల విలువైన పరికరాల ఏర్పాటు
– అమూల్‌ ద్వారా మూతపడిన మదనపల్లి డెయిరీ పునరుద్ధరణ
– చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌కు లీజుకు. ఇప్పటికే రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం

రైతులకు మరింత లబ్ధి
అమూల్‌ డెయిరీ 7 సార్లు పాలసేకరణ ధరలు పెంచడంతో 3.5 ఏళ్లలో లీటర్‌కు గేదెపాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు లీటర్‌కు రూ.43.69 చొప్పున చెల్లిస్తున్నారు. అమూల్‌తో పోటీపడి ప్రైవేటు డెయిరీలు కూడా పాల సేకరణ ధరలు పెంచాల్సివచ్చింది. దీంతో వాటికి పాలు పోసే రైతులకు రూ.5 వేల కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. అమూల్‌ సంస్త ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాన్ని పక్కాగా లెక్క గట్టి అణాపైసలతో సహా చెల్లిస్తుండడంతో గరిష్టంగా గేదె పాలకు లీటర్‌కు రూ.100, ఆవు పాలకు రూ.50కు పైగా ధర పొందగలిగారు. పాలుపోసిన 10 రోజుల్లోనే బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్ము జమ చేయడంతో పాడి రైతుల్లో అమూల్‌ పట్ల నమ్మకం పెరిగింది. 

పక్కాగా లెక్కగట్టి ఇచ్చేవారు
ప్రైవేటు డెయిరీలు 15 రోజులకోసారి పాల డబ్బులు చెల్లిస్తే అమూల్‌ 10 రోజులకే మా ఖాతాల్లో వేస్తోంది. పైగా ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.32 నుంచి రూ.42 వరకు వరకు చెల్లిస్తున్నారు. ఇతర డెయిరీలు పాల శాతాన్ని కచ్చితంగా లెక్కించడంలేదు. రూ.25 నుంచి రూ.30 వరకు మాత్రమే ఇస్తున్నారు. 10 రోజుల్లో 35 లీటర్ల వరకు పాలు పోస్తాం. రూ.1500 వరకు జమవుతోంది. అమూల్‌ కేంద్రాలను కొనసాగించాల్సిందే..
– వెంకటశివారెడ్డి, రంగన్నగారిగడ్డ, తిరుపతి జిల్లా

మూతపడితే మా బతుకులు అగమ్యగోచరం
ప్రైవేటు డెయిరీలు 15 రోజుల సరాసరి పాల శాతాన్ని గణించి రేటు నిర్ణయిస్తాయి. అమూల్‌ ఏ రోజుకారోజే పాల శాతాన్ని లెక్కిస్తుంది. దీంతో గిట్టుబాటు ధర వస్తోంది. పాడి కొనుగోలుకు అమూల్‌ రుణాలు కూడా ఇప్పించింది. ఇతర డెయిరీల్లో ఈ సౌకర్యం లేదు. 10 రోజుల్లో 30 లీటర్లు పాలు పోస్తా. రూ.1,400 వరకు జమవుతుంది. అమూల్‌ కేంద్రాలు మూతపడితే మా బతుకులు అగమ్య గోచరంగా మారతాయి.
– స్వామిదాస్, తిరుపట్టం, తిరుపతి జిల్లా

కలెక్టరేట్ల వద్ద రైతుల ఆందోళన
అనంతపురం అర్బన్‌/తిరుపతి అర్బన్‌: అమూల్‌ పాల సేకరణ రద్దు చేస్తే పాడి రైతులు నష్టపోతారని, పాల వెల్లువ పథకాన్ని కొనసాగించాల్సిందేనంటూ మహిళా పాడి రైతులు అనంతపురం, తిరుపతి కలెక్టరేట్ల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారలకు వినతిపత్రాలు అందజేశారు. తిరుపతిలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. అమూల్‌ పాల సేకరణ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 

అనంతపురంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరికరాలతో పాల తూకం, వెన్న శాతం, ఎన్‌ఎన్‌ఎఫ్‌ శాతం ఆటోమేటిక్‌గా నమోదవుతూ ప్రతి రైతుకూ వారి ఖాతాల్లోకి పది రోజుల్లో  కచ్చితంగా డబ్బు జమయ్యేదని రైతు సంఘం నేతలు చెప్పారు. అమూల్‌ ద్వారానే రైతులకు మేలు జరిగేదన్నారు. ఎంతో పారదర్శకంగా సాగుతున్న ఈ మొత్తం ప్రక్రియను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement