కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌పై దృష్టి పెట్టండి: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Review Meeting Over Agri Infra Fund Project | Sakshi
Sakshi News home page

కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌పై దృష్టి పెట్టండి: సీఎం జగన్‌

Published Tue, Jun 1 2021 5:04 PM | Last Updated on Tue, Jun 1 2021 5:37 PM

YS Jagan Mohan Reddy Review Meeting Over Agri Infra Fund Project - Sakshi

సాక్షి, అమరావతి: అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ (ఏఐఎఫ్‌) ప్రాజెక్టులపై మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్, ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్‌), మత్స్యశాఖ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ, పశు సంవర్థక విభాగాలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు.

సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలి. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. 

కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌పై దృష్టి పెట్టండి: సీఎం జగన్‌
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్‌ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ తయారు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అదే విధంగా విశాఖపట్నం ఫిషింగ్‌ హార్భర్‌ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన నిర్దేశించారు. కాగా, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ (ఏఐఎఫ్‌) ప్రాజెక్టులకు సంబంధించి ఆయా రంగాలు, విభాగాలలో వివిధ ప్రాజెక్టుల, పనుల పురోగతిని సమావేశంలో అధికారులు వివరించారు. ఆ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.15,743 కోట్లు అని తెలిపారు.

మల్టీపర్పస్‌ ఫెసిలిటీ కేంద్రాలు (ఎంపీఎఫ్‌సీ)
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఎంపీఎఫ్‌సీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. డ్రై స్టోరేజీ–డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) గోదాములు, ఎస్సేయింగ్‌ ఎక్విప్‌మెంట్, జనతా బజార్లు మొదలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇన్‌ఫ్రా, పశు సంవర్థక మౌలిక సదుపాయాల వరకు దాదాపు 16 రకాల ప్రాజెక్టులు తీసుకురానున్నారు. ఆ మేరకు 4,277 డ్రై స్టోరేజీ , డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పీడీఎస్‌ కోసం 60 గోదాములు, 1,483 సేకరణ కేంద్రాలు, కోల్డ్‌ రూమ్స్, టర్మరిక్‌ బాయిలర్లు, టర్మరిక్‌ పాలిషర్లు. ఇంకా 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్‌ ఎక్విప్‌మెంట్, 10,678 ఎస్సేయింగ్‌ ఎక్విప్‌మెంట్, అలాగే 10,678 సేకరణ కేంద్రాల ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేయనున్నారు. 

ఏపీడీడీసీఎఫ్‌
రాష్ట్రవ్యాప్తంగా 9,899 బల్క్‌ మిల్లింగ్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ), 8,051 ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాల (ఏఎంసీయూ) నిర్మాణం చేపట్టనున్నారు. 
బీఎంసీయూల నిర్మాణానికి రూ.1,885.76 కోట్లు, ఏఎంసీయూల నిర్మాణానికి రూ.942.77 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. 
రాష్ట్రంలో ఇప్పటికే 9,051 చోట్ల బీఎంసీయూల కోసం భూమి గుర్తించగా, 6,252 యూనిట్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది.ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి మొత్తం బీఎంసీయూల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అమూల్‌ పాల సేకరణ
గత ఏడాది నవంబరు 20వ తేదీన ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలలో పాల సేకరణ మొదలు పెట్టగా, ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 29న గుంటూరు జిల్లాలో, ఏప్రిల్‌ 3న చిత్తూరు జిల్లాలోనే మరి కొన్ని గ్రామాలకు పాల సేకరణ విస్తరించారు. ఈనెల 4వ తేదీ (శుక్రవారం) నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్‌ పాల సేకరణ మొదలు పెడుతోంది. నాలుగు జిల్లాలలో 12,342 మంది మహిళా రైతుల నుంచి 50.01 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్, వారికి రూ.23.42 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. ఆ విధంగా రాష్ట్రంలో మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం లభించింది. 

మత్స్యశాఖ–మత్స్యకారులు
మత్యకారులు, ఆక్వా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం 10 ప్రాసెసింగ్‌ యూనిట్లు, 23 ప్రిప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు, 100 ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 100 ఆక్వా హబ్‌లలో ఇప్పటికే 25 హబ్‌లు మంజూరు కాగా, ఈనెలలోనే వాటి పనులు మొదలు పెట్టనున్నారు. మొత్తం 133 ప్రాసెసింగ్, ప్రిప్రాసెసింగ్‌ యూనిట్లు, ఆక్వాహబ్‌లకు దాదాపు రూ.646.90 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. 

ఫిషింగ్‌ హార్బర్లు
తొలి దశలో 4 ఫిషింగ్‌ హార్బర్లు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అవి ఉప్పాడ (తూ.గో), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు) హార్బర్లను వచ్చే ఏడాది (2022) డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా ఓడరేవులో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

చదవండి: అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement