కాకినాడ, సాక్షి: ఎవరైనా బాధితులను ఎలా పరామర్శిస్తారు?. స్వయంగా వెళ్లి పరామర్శించే వాళ్లు కొందరైతే.. బాధితుల్నే తమ దగ్గరకు రప్పించుకునేవాళ్లు మరికొందరు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం మూడో రకం!. సమయం-సందర్భం ఈ రెండింటితో సంబంధం లేకుండా బాధితులను తన దగ్గరికి రప్పించుకుని మరీ వాళ్లను వెయిట్ చేయిస్తారు.
‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈవెంట్‌కు వెళ్లి మెగా అభిమానులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత సంగతి తెలిసిందే. సినిమా పిచ్చి.. అంతకు మంచి హీరోలంటే వెర్రి అభిమానం తమవాళ్ల ప్రాణాలు తీసిందని ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత అటు చిత్ర యూనిట్‌గానీ, ఇటు ఆ ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరైన పవన్ కల్యాణ్‌గానీ బాధిత కుటుంబాల్ని పరామర్శించి ఓదార్చలేదు. సరికదా.. గత ప్రభుత్వం రోడ్డు సరిగ్గా వేయలేదని, అందుకే రెండు నిండుప్రాణాలు బలయ్యాయంటూ రాజకీయం చేయబోయారు. ఆపై కంటితుడుపు చర్యగా.. తన జనసేన తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే..
పవన్ నియోజకవర్గం పిఠాపురం నుంచి బాధిత కుటుంబాలు ఉండేది పది కిలోమీటర్ల దూరంలోనే. ఘటన జరిగి వారం అవుతున్నా బాధితులను పవన్‌గానీ, జనసేన తరఫు నేతలుగానీ కలిసింది లేదు. పోనీ.. ఇప్పుడు వాళ్లను రప్పించుకున్న సందర్భమైనా బాగుందా? అంటే అదీ లేదు. పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలను ఇప్పుడు తన కోసం పడిగాపులు పడేలా చేశారాయన.
పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో వాళ్లను పవన్ పరామర్శించడం చర్చనీయాంశమైంది. ఓవైపు సంబరాలు జరుగుతుంటే.. మరోవైపు ఆ వేదిక వద్ద కింద వాళ్లు కూర్చున్నారు. ఉదయం నుంచి వాళ్లు ఆయన కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవత్వం లోపించలేదంటారా?. ఆయన అభిమానులైనా.. ఇదేం పరామర్శ అని అనుకోరంటారా?!.
Comments
Please login to add a commentAdd a comment