ఈ భూమ్మీద అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అదొకటి. సినీ ప్రముఖులు, ధనవంతులకు నెలవుగా ఉండేదది. అలాంటి ప్రాంతం మరుభూమిగా మారింది. ఎటు చూసినా.. కార్చిచ్చు, దాని ధాటికి పూర్తిగా దగ్ధమై బూడిద మిగిలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి.
కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలగజేసిన కార్చిచ్చుగా ఇది మిగిలిపోనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు రూ.12లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మునుముందు ఇది ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన గృహాలు ఇక్కడ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
ఇప్పటిదాకా 9,000 నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. ఒక్క ఫసిఫిక్ పాలిసాడ్స్‌లోనే 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. అంటోనీ హోప్‌కిన్స్, పారిస్‌హిల్టన్, బిల్లీ క్రిస్టల్ లాంటి ప్రముఖుల ఇళ్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజాగా.. గురువారం మరోసారి మంటలు చెలరేగాయి. దీంతో నేషనల్ గార్డ్(National Guard)ను రంగంలోకి దించాల్సి వచ్చింది. కార్చిచ్చు తర్వాతి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇక్కడ అణు బాంబు పడిందా? అనే రీతిలో పరిస్థితి ఉందని లాస్ ఏంజెల్స్ కౌంటీ షరీ రాబర్ట్ లూనా అభిప్రాయపడ్డారు. శాటిలైట్ చిత్రాలు ఆ పరిస్థితిని తలపిస్తున్నాయన్నారు. తీవ్రమైన పెనుగాలుల కారణంగా మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు సరిపడా నీరు లేకపోవడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారుతోంది.
పసిఫిక్ పాలిసాడ్స్‌లో 19 వేల ఎకరాలు,
ఈటొన్ ఫైర్ 13,600 ఎకరాలు,
అల్టాడెనాలో 13వేల ఎకరాలు,
కెన్నెత్ 791 ఎకరాలు,
సన్‌సెట్ 60 ఎకరాలు,
హురస్ట్ 855 లో ఎకరాలు బూడిదయ్యాయి.
ఇక ఆల్టడెనా ప్రాంతంలో 83 సంవత్సరాల వృద్ధుడు ఈ కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటిదాకా ఏడుగురు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. కార్చిచ్చు తీవ్ర దృష్ట్యా ఆ సంఖ్యే ఎక్కువే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కార్చిచ్చు ధాటికి మరోపక్క మూగజీవాలు మరణిస్తున్నాయి. ఇళ్లను ఖాళీ చేస్తూ వెళ్తున్న వాళ్లు.. తమ వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాకు చేరుతున్నాయి.
The boy saved the rabbit from being burned in the fire #LosAngelesFire #CaliforniaWildfires #LosAngelesWildfires #California #LosAngeles #PalisadesFire pic.twitter.com/g9IAtyStGh
— Sara 🇵🇸 (@saraanwar45) January 9, 2025
దొంగతనాలు.. కర్ఫ్యూ విధింపు
విలువైన వస్తువుల కంటే తమ ప్రాణాలు ముఖ్యమనుకుంటూ కట్టుబట్టలతో జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. . అయితే.. ఇదే అదనుగా ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఆ ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నాయి. తాజాగా అక్కడి షరీఫ్ డిపార్ట్‌మెంట్ 20మంది లూటర్లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి పహారా కాస్తున్నారు. సంక్షోభ సమయంలో దోచుకుకోవాలనే ఆలోచనలు రావడం సిగ్గుచేటు అని అక్కడి పోలీస్ అధికారి ఒకరు ప్రకటించారు.
ఇంకా ఎక్కువే..
అక్యూవెదర్ అంచనాల ప్రకారం.. నష్టం 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12లక్షల కోట్లు)గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధి, ప్రముఖ సైంటిస్ట్ జోనాథన్ పోర్టర్ మాట్లాడుతూ.. కేవలం 24 గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరిగాయన్నారు మరోవైపు అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బాధిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు.
ఒకరి అరెస్ట్
కార్చిచ్చు(Wildfires) ఎందుకు రాజుకుంది అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన అధికారుల నుంచి రాలేదు. అయితే.. ఉడ్‌లాండ్ హిల్స్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నిత్ కార్చిచ్చును అంటించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.
Photo Credits: MAXAR, Planet
Comments
Please login to add a commentAdd a comment