సర్వత్రా విమర్శలు
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్‌తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది.
ముఖ్యంగా లాస్ ఏంజెలెస్‌లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను.
చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.
ప్రెస్ మీట్‌కు ముందే...
మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment