అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై వరుసగా ఆరో రోజు కూడా దాని ప్రతాపం చూపించింది. దీనికారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కి చేరింది. మరో పాతిక మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి.
‘‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం’’ అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు. కార్చిచ్చు(Wildfires)తో ఇటిప్పదాకా 24 మంది బలయ్యారు. పాలిసేడ్స్‌లో 8 మంది, ఎటోన్‌లో 16 మంది మరణించారు. చనిపోయినవాళ్లలో ‘కిడ్డీ కాపర్స్’ ఫేమ్ నటుడు రోరీ సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిల్లిన నష్టం 150 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
ఇప్పటివరకూ కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక.. పాలిసేడ్స్ ఫైర్‌ను 11శాతం, ఎటోన్ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు.. లాస్ ఏంజెలెస్ కౌంటీలో 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించిట్లు తెలిపారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
సంబంధిత వార్త: ఎందుకీ కార్చిచ్చు!
ఇక వినాశం(Disaster movies) ఆధారంగా సినిమాలు తీసే హాలీవుడ్‌లో.. మంటలతో అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు తారలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంటోనీ హోప్‌కిన్స్, పారిస్ హిల్టన్, మెల్ గిబ్సన్, బిల్లీ క్రిస్టల్ లాంటి తారల ఇళ్లు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి.
ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా కార్చిచ్చు రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విమర్శించగా.. డెమోక్రట్ సెనేట్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్ ఏంజెలెస్ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్ ఏంజెలెస్ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. మరోవైపు.. ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి.
హాలీవుడ్ స్టార్ల నిర్వాకంతో..
ఇదిలా ఉంటే.. మంటల్ని ఆర్పేందుకు నీటి కోరత అక్కడ ప్రధాన సమస్యగా మారింది. అయితే.. హాలీవుడ్ స్టార్ల నిర్వాకం వల్లే లాస్ ఏంజెలెస్‌కి ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో.. మంటలను చల్లార్చేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకున్నారంటూ డెయిలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది.
నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్‌లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీటి కంటే అధికంగా నీటిని వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. సిల్వస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైర్‌ఫైటర్లను నియమించుకున్నారని డెయిలీ మెయిల్ పేర్కొంది.
ఇక ప్రస్తుతం పసిఫిక్ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలకపోవడంతో.. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: అందుకే కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగా: అనిత
Comments
Please login to add a commentAdd a comment